
రేవంత్ ఢిల్లీకి వెళ్ళటం వల్ల ఏమిటి ఉపయోగం ?
రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతున్న కారణంగా నిధులు, అభివృద్ధి సమానంగా అందటంలేదనే ఆరోపణలకు కొదవలేదు
కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రాల అభివృద్ధి అంతిమంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. దీన్నే సమాఖ్యస్పూర్తి అనంటారు. అయితే చాలాకాలంగా సమాఖ్యస్పూర్తి దెబ్బతినేసిందనే చెప్పాలి. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతున్న కారణంగా నిధులు, అభివృద్ధి సమానంగా అందటంలేదనే ఆరోపణలకు కొదవలేదు. పోని కేంద్రానికి రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నుల దామాషాలో అయినా కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులు, అభివృద్ధిలో ప్రాధాన్యత ఇస్తున్నదా అంటే అదీలేదు. ఈనేపధ్యంలోనే ఎన్డీయేయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి, నిధుల కేటాయింపులో కేంద్రానికి ప్రతిపాదనలు అందివ్వటం, విజ్ఞప్తులు చేస్తున్నా ఉపయోగం కనబడటంలేదు.
ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth) శుక్రవారం ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటన(Delhi Tour) పూర్తిగా పార్టీ వ్యవహారమే. జనగణన, కులగణన చేయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ అధిష్ఠానం కీలకమైన సమావేశం నిర్వహించబోతోంది. ఆ సమావేశంలో పాల్గొనటమే రేవంత్ ఢిల్లీ పర్యటన ముఖ్యఉద్దేశ్యం. సమావేశం తర్వాత యధావిధిగా పార్టీ అగ్రనేతలు సోనియా గాంధి(Sonia Gandhi), రాహుల్ గాంధి(Rahul Gandhi)తో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీ అవబోతున్నారు.
ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే రేవంత్ ఇప్పటికి 32 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. నాలుగుసార్లు నరేంద్రమోడి(Narendra Modi)తోను మిగిలిన సార్లు వివిధ శాఖల కేద్రమంత్రులతో భేటీఅయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రతిపాదనలు అందించారు. పెండింగులో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని విజ్ఞప్తులు కూడా చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు, మూసీనది ప్రక్షాళనకు నిధులు, ఫ్యూచర్ సిటి ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలని రేవంత్ మోడితో పాటు పట్టణాభివృద్ధి శాఖ, ఆర్ధికశాఖ మంత్రులను కలిశారు. ఇందిరమ్మ ఇళ్ళను మంజూరుచేయాలని గ్రామీణ, గృహనిర్మాణ శాఖల మంత్రిని కలిశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ-ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కారించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(AmitShah) ను కలిసి చాలాసార్లు విజ్ఞప్తిచేశారు. రేవంత్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా, మోదీతో పాటు ఎంతమంది కేంద్రమంత్రులను కలిసినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు.
రాష్ట్రాభివృద్ధి విషయంలో రేవంత్ వచ్చి తమను ఇన్నిసార్లు కలుస్తున్నా మోదీ, కేంద్రమంత్రులు ఎక్కడా సానుకూలత కనబరచటంలేదు. కేంద్రప్రభుత్వం అందుకుంటున్న పన్నుఆదాయంలో తెలంగాణ నుండి ప్రతిఏడాది వేల కోట్లరూపాయలు అందుతోంది. తెలంగాణ నుండి వస్తున్న వేలకోట్ల రూపాయల పన్నుల దామాషాలో అయినా నిధులు అందించాలి, అభివృద్ధిపనులను మంజూరుచేయాలని కేంద్రం అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. 2020-21 నుండి 2024-25 వరకు తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ పన్నుల కింద రు. 2,39, 489 కోట్లు అందింది. అయితే కేంద్రంనుండి తెలంగాణకు ఐదేళ్ళల్లో రు. 1.76 లక్షల కోట్లు మాత్రమే తిరిగొచ్చింది. కేంద్రంనుండి 2024-25 ఆర్ధికసంవత్సరంలో రు. 29,900 కోట్ల వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పన్ను ఆదాయంలో తెలంగాణకు కేంద్రం కేటాయించింది రు. 24,540 కోట్లు మాత్రమే. ఇదేసమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల మంజూరులో, అభివృద్ధి పనుల మంజూరులో కేంద్రప్రభుత్వం టాప్ ప్రయారిటి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనేక ఉదాహరణలను గమనించిన తర్వాత కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమాఖ్య స్పూర్తి దెబ్బతినేసిన విషయం అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో రేవంత్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు.