RS Praveen | ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ చదవి ఏమిటి ఉపయోగం ?
x
BRS leader RS Praveen

RS Praveen | ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ చదవి ఏమిటి ఉపయోగం ?

ఉద్యోగజీవితంలో ఎలాగ పనిచేశారో తెలీదుకాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారు


ఆర్ఎస్ ప్రవీణ్ వాదన విన్న తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. ఈయన పూర్వాశ్రమంలో ఐపీఎస్ అధికారి. తర్వాత సంక్షేమ స్కూళ్ళు, హాస్టళ్ళను బాగుచేయాలన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో కేసీఆర్(KCR) ను రిక్వెస్టు చేసుకుని మరీ సంక్షేమ కార్యదర్శిగా పనిచేశారు. ఆల్ ఇండియా సర్వీసులో కీలకమైన ఐపీఎస్ కు ప్రవీణ్(RS Praveen) ఎంపికయ్యారంటే బాగా సరుకున్న మనిషే అనుకోవాలి. ఉద్యోగజీవితంలో ఎలాగ పనిచేశారో తెలీదుకాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. సిర్పూర్ లో ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.

ఇపుడు విషయంఏమిటంటే మీడియాతో ప్రవీణ్ మాట్లాడుతు మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేసినట్లు ఆరోపించారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి కుట్ర పన్నాయట. సిట్ విచారణ జరిపించాలని, రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్ డేటాను చెక్ చేయాలని ఏమిటేమిటో డిమాండ్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో వచ్చిన పెద్ద శబ్దంపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిందని నిలదీశారు. మేడిగడ్డలో 20వ నెంబర్ పిల్లర్ ను ఎవరో పేల్చే కుట్రచేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాంతంలో భూకంపాలు వచ్చాయా ? లేకపోతే బాంబులతో పేల్చారా ? అన్నది తేల్చాలట. 2023, అక్టోబర్ 21 రాత్రి మేడిగడ్డ బరాజ్ దగ్గర భారీ పేలుడు శబ్దం వచ్చినట్లు మరుసటిరోజు మహదేవ్ పూర్ పోలీసుస్టేషన్లో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావుతో పాటు రేవంత్ అంటే ప్రవీణ్ కు కూడా నిలువెత్తు మంట ఉన్నట్లుంది. ఆమంటలో లాజిక్కులను కూడా ప్రవీణ్ మరచిపోయారు. ప్రవీణ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మేడిగడ్డ బరాజ్ కట్టింది, పిల్లర్లు కుంగింది, బరాజ్ ప్లాట్ ఫారమ్ చీలికలు వచ్చేసింది అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే. కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాలు చేసినపుడు, చేసిన తర్వాత కూడా ఏ ఒక్కపార్టీని చూడటానికి వాటి దరిదాపుల్లోకి కూడా కేసీఆర్ ప్రభుత్వం అనుమతించలేదు. ఇక ప్రవీణ్ చెప్పిన అక్టోబర్ 21 అంటే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ఇపుడు బాంబులు పెట్టి పేల్చాశారేమో అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్న ప్రవీణ్ మరి ఆప్పట్లోనే విచారణ చేయించాలని కేసీఆర్ ను ఎందుకు డిమాండ్ చేయలేదు ?

ఇపుడు రేవంత్, కిషన్, బండిని టార్గెట్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది కేసీఆర్, హరీష్ మాత్రమే అని మరచిపోతున్నారు. ఎందుకంటే అప్పట్లో సర్వంసహా అన్నీ దగ్గరుండి పర్యవేక్షించింది, నిర్మాణాలు జరిపించింది మామా, అల్లుళ్ళే. మేడిగడ్డ కుంగితే పిల్లర్లకు ఎక్కడా పగుళ్ళు రావని ఇంజనీరింగ్ నిపుణులు చెప్పినట్లు చెప్పిన ప్రవీణ్ ఆనిపుణులు ఎవరంటే మాత్రం నోరిప్పలేదు. నిర్మాణాలు మొత్తం నాసిరకం, నిర్మాణాలు చేసేముందు చేయాల్సినంత భూపరీక్షలు చేయలేదని ఇంజనీరింగ్ నిపుణులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ)తో పాటు చాలామంది ఇంజనీరింగ్, ఇరిగేషన్ నిపుణులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

ప్రవీణ్ ఉద్దేశ్యంలో ఇంజనీరింగ్, ఇరిగేషన్ నిపుణులు చెప్పిందంతా అబద్ధాలు తాము చెప్పేది మాత్రమే నిజమని. కాళేశ్వరం, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్, హరీష్ నే తప్పుపట్టడాన్ని పార్టీనేతలు తట్టుకోలేకపోతున్నారు. కాళేశ్వరం పాపాలే కేసీఆర్, హరీష్ మెడకు చుట్టుకుంటాయేమో అనే టెన్షన్ నేతల్లో పెరిగిపోతున్నట్లుంది. ఆభయంతోనే రేవంత్ పై ఎదురుదాడులు చేస్తు లాజిక్కుకు అందని ఆరోపణలు చేస్తున్నారు. పిల్లర్లు ఎందుకు కుంగిపోయి చీలిపోయాయి, బరాజ్ ప్లాట్ ఫారమ్ ఎందుకు చీలికలు వచ్చేశాయంటే నిర్మాణం నాసిరకమని కళ్ళకు కనబడుతోంది. బరాజ్ నిర్మాణం జరిపించిన కేసీఆర్, హరీష్, నిర్మాణసంస్ధతో పాటు ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులే ప్రవీణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.


రేవంత్ ను టార్గెట్ చేయాలంటే, పాలనపరమైన లోపాలను ఎత్తిచూపాలంటే చాలా అవకాశాలుంటాయి. అయితే అందరికళ్ళకు కనబడుతున్న కాళేశ్వరం, మేడిగడ్డ లోపాలను గుడ్డిగా సమర్ధించాలని ప్రవీణ్ ప్రయత్నాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. తమ అధినేతను అడ్డుగోలుగా సమర్ధించేందుకు ఉన్నతచదువులు చదివి, ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ ఇలాంటి సిల్లీ ఆరోపణలు చేస్తారని ఎవరూ ఊహించలేదు.

Read More
Next Story