Vykunta Dwara Darsanam | వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటి ?
ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో అప్పటినుండి వైకుంఠ ద్వార దర్శనం(Vykunta Dwara Darsanam) అనేపదానికి విశేష ప్రాచుర్యం వచ్చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనం నేపధ్యంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో అప్పటినుండి వైకుంఠ ద్వార దర్శనం (Vykunta Dwara Darsanam) అనేపదానికి విశేష ప్రాచుర్యం వచ్చేసింది. ఈ నేపధ్యంలోనే ‘వైకుంఠ ద్వార దర్శనం’ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. నిజానికి వైకుంఠ ద్వార దర్శనాన్నే కొందరు ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటుంటారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)లో అసలు ఉత్తర ద్వారం అన్నదే లేదు. ఉత్తర ద్వారమే లేదుకాబట్టి ఉత్తర ద్వార దర్శనం అన్న ప్రశ్నే లేదు. అయితే ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు వచ్చింది ? ఎందుకంటే శ్రీరంగంలోని శ్రీమహావిష్ణు దేవాలయంలో ఉత్తర ద్వారం ఉంది.
శ్రీరంగం(Sri Rangam Temple)లో శ్రీమహావిష్ణు భక్తుడు విష్ణుచిత్తు ఆళ్వార్ ఉండేవారు. ఆయన వైకుంఠ ఏకాదశిరోజున(Ekadasi) ఉత్తర ద్వారం(Uttara Dwaram)లో శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్న సమయంలోనే మోక్షం లభించిందని స్ధలంపురాణం చెబుతోంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న విష్ణుచిత్తుడుకి మోక్షం లభించిన దగ్గర నుండి ఉత్తర ద్వారదర్శనం అనే దర్శనానికి బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది. అప్పటినుండే వైకుంఠ ఏకాదశిరోజున విష్ణువును దర్శించుకుంటే మోక్షంతో పాటు సకల శుభాలు కలుగుతాయని విష్ణుభక్తులందరు నమ్ముతారు. ముక్కోటి దేవతలు ఏకాదశి రోజున బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరొచ్చింది. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకన్న రోజున తాము కూడా మహావిష్ణువును దర్శించుకుంటే తమకు కూడా శుభాలు కలుగుతాయని భక్తల విశ్వాసం.
శ్రీమహావిష్ణువే కలియుగంలో శ్రీవెంకటేశ్వరుడి అవతారంగా తిరుమలలో స్వయంభూగా వెలిసారు కాబట్టి భక్తులందరు తిరుమలను కలియుగ వైకుంఠంగా పిలుస్తారు. అందుకనే వైకుంఠఏకాదశి రోజున తిరుమల(Tirumala)లో వెలసిన శ్రీవెంకటేశ్వుడిని దర్శించుకోవాలని అఖిలాండ భక్తకోటి కోరుకుంటారు. ఏడాదిలో ఒక్కరోజున వచ్చే వైకుంఠ ఏకాదశిని పరమపవిత్రంగా భావిస్తారు. అందుకనే ఆ రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తహతహలాడుతారు. ఏడాదిలో ఏకాదశిలు 24 వచ్చినా ఉత్తరాయణం పుణ్యకాలం ముందువచ్చే ఏకాదశి రోజుకి మాత్రం పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. గురువారం వైకుంఠ ఏకాదశిలో శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు అందుకే భక్తులు పోటెత్తింది.
తిరుమల ఆలయంలోని గర్భగుడికి ఆనుకుని ఉన్న క్యారిడార్ నే వైకుంఠ ద్వారం అంటారు. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా ఈ ద్వారంగుండానే భక్తులు లోపలికి ప్రవేశించి హుండీ దగ్గరున్న ఉత్తర ద్వారం వైపు భక్తులు బయటకు వచ్చేస్తారు. ఉత్తరంవైపు వెళ్ళేది ఉండదు, ఆలయం బయటకు వచ్చేదీ ఉండదు. అందుకనే తిరుమల ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం అన్నదే లేదు. ఇక్కడ ఉన్నదంతా వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే. గర్భగుడి దగ్గర బంగారు బావి అనేది ఉంది. ఆ బంగారు బావికి పక్కనే చిన్న తలుపుంటుంది. దర్శనం చేసుకున్న భక్తులు ఆ ద్వారం ద్వారా బయటకు వచ్చేస్తారు. ఒకపుడు వైకుంఠ ఏకాదశి ఒక్కరోజున మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించేవారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్దం క్రితం ఏకాదశి రోజుతో పాటు ద్వాదశి రోజున కూడా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నది తిరుపతి తిరుమల దేవస్ధానం పాలకమండలి. చాలా సంవత్సరాల పాటు ఇలాగే జరిగింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి(TTD Trust Board) వైకుంఠ ద్వార దర్శనాన్ని ఒక్కరోజుకి పరిమితం చేయకుండా పదిరోజుల పాటు భక్తులను అనుమతించాలని డిసైడ్ చేసింది. శ్రీరంగం దేవాలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం పదిరోజులున్నట్లే తిరుమల ఆలయంలో కూడా దర్శనాలకు పదిరోజులు అనుమతించాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అప్పటినుండే తిరుమల ఆలయంలో పదిరోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనంకు అనుమతిస్తున్నారు. భక్తుల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ(YCP) హయాంలో పై నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే బదులు పదిరోజులు దర్శనానికి అనుమతిస్తే ఎక్కువమంది శ్రీవారిని దర్శించుకుంటారన్నది అప్పటి పాలకమండలి భావన. అప్పట్లో టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని దేశంలోని చాలా వైష్ణవ దేవాలయాలు స్వాగతించాయి.
11వ శతాబ్దంలోనే మొదలైంది
ఇదే విషయమై తిరుమల దేవాలయం ప్రధాన అర్చకుడు అర్చకం వేణుగోపాల దీక్షితులు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘వైకుంఠ ద్వార దర్శనం 11వ శతాబ్దంలోనే మొదలైంద’న్నారు. ‘అప్పట్లో గర్భగుడి మాత్రమే ఉండేదని అయితే తర్వాత కాలంలో దేవాలయాన్ని పాలకులు ప్రాకారాలుగా విస్తరించార’ని చెప్పారు. ‘ఏడాదిలో 24 ఏకాదశిలు ఉన్నా ఉత్తరాయణ పుణ్యకాలం ముందు వచ్చే ఏకాదశి చాలా ప్రశస్తమైనదని భక్తులు నమ్ముతార’ని చెప్పారు. తిరుమల దేవాలయంలో ఉత్తర ద్వారం అన్నదే లేదని క్లారిటి ఇచ్చారు. ‘శ్రీరంగం దేవాలయంలో మాత్రమే ఉత్తర ద్వారం ఉంది కాబట్టే అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంద’ని వేణుగోపాల దీక్షితులు చెప్పారు.