
‘జూబ్లీ’ ఎన్నికలో దానం ప్రచారం చేస్తారు: మహేష్ కుమార్
తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ ప్రచారం చేస్తే తప్పేంటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రశ్నించారు. తమ పార్టీకి దానం సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్‌కు భయమెందుకని చురకలంటించారు. దానం నాగేందర్ ఏమీ.. తెరవెనక నుంచి మద్దతు ఇవ్వడం లేదని, బహిరంగంగానే కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం వెలుగు చూస్తుంది. ఒకటి సమసిపోయింది అనుకునేలోపే మరొకటి రెడీగా ఉంటుంది. తాజాగా పార్టీలో సమస్యలపై, పార్టీపైన వస్తున్న విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఇంకా కొన్నే ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు ఉండటాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు ఉండటాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన వ్యక్తి పేరు.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఎలా ఉందని ప్రశ్నించారు. స్పీకర్ అడిగితే తాము పార్టీ ఫిరాయించలేదని అబద్ధాలు చెప్తున్న ఈ నాయకులు.. దీనికి ఏమని బదులు ఇస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ విమర్శలపై స్పందించిన మహేష్ కుమార్.. దానం నాగేందర్ తమ పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఇక ఫిరాయింపు నేతల వ్యవహారం స్పీకర్ చూసుకుంటారని అన్నారు. దానం నాగేందర్ బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారని, ముసుగులో గుద్దులాట ఏమీ లేదని స్పష్టం చేశారు.
జీవన్‌నూ సెట్ చేస్తాం..
అనంతరం తాజాగా కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మహేష్ కుమార్ స్పందించారు. తనను మేకను బలిచ్చినట్లు బలి ఇచ్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మహేష్ కుమార్.. జీవన్ రెడ్డి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని, అతి త్వరలోనే ఆయనను కూడా సెట్ చేస్తామని తెలిపారు. పార్టీలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇలాంటివి భవిష్యత్తులో రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్, తాను కలిసి ఢిల్లీ వెళ్లనున్నామని, అక్కడ డీసీసీల ఎంపికను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.