తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ప్రశ్నల్లో తొంగి చూసిన ఆంధ్ర
x

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ప్రశ్నల్లో తొంగి చూసిన ఆంధ్ర

ప్రభుత్వాలు మారితే విధానాలే కాదు చరిత్ర కూడా మారుతుందని టిజిపిఎస్ సి నిరూపిస్తున్నది


‘ ముడ్డి మీద తంతా.. నేను చంద్రబాబు శిష్యుడిని కాదు.. సహచరుడినే’ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ మీడియా గోష్టిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలవి... నిజంగా ఆయన చంద్రబాబుకు సహచరుడే కానీ శిష్యుడు కాదా.. ఆయన అంతరంగంలో ఏముంది.. ఏడాది ప్రజా పాలన ఏమని చెబుతోంది.. కొన్ని సంఘటలను పరిశీలిస్తే.. ఆయన ఆంధ్రచూపు కనిపిస్తుంది.

డిసెంబర్ 16, 2024 టీజీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర అవతరణ పేపర్ లోని ప్రశ్నలు.. ఎస్ సెట్..
26వ ప్రశ్న.. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు గవర్నర్, శాసనమండలి చైర్మన్, విధాన సభ స్పీకర్, ప్రతిపక్ష నేతలు..
53 వ ప్రశ్న.. జూలై 1996 నాటి ప్రభుత్వం ఆర్థిక వనరులను పెంచడానికి తీసుకున్న చర్యలు..
86 వ ప్రశ్న.. తెలుగు దేశం తెలుగు గౌరవం పేరిట, తెలుగు ఐక్యత ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. దానికి కొనసాగింపు ఆప్షన్
87. తెలుగు తల్లి పై ప్రశ్నలు..
88. ఎన్ టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులని పొగడటం, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు..
91. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్స్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ ఏది?
92. ఆంధ్ర వ్యాపారులైన టి సుబ్బిరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు చెందిన సంస్థలను జతపరుచుము?
93. చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని నీటి పారుదల ప్రాజెక్ట్ లను అభివృద్ది చేశాడు? దానికి కొనసాగింపు ఆప్షన్, ఇంకా తెలుగుదేశం ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడం..
తెలంగాణను చెరబట్టి వనరులను దోచుకుపోయారు, ఇక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించారు, జై తెలంగాణ అన్నందుకు నక్సలైట్లు అని ముద్ర వేసిన కాల్చి పారేశారు.. ఇవన్నీ ఎవరు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వలస పాలనలో కూడా రెండు దశలు ఉన్నాయి. మొదట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను ఏలింది కాంగ్రెస్.. ఇక్కడ ఉద్యోగాలు కొల్లగొట్టి, నీళ్లను, నిధులను ఎలాంటి ఆటంకం లేకుండా ఆంధ్రకు తరలించుకుపోయారు. ఆ తరువాత టీడీపీ హయాంలో ఈ దోపిడికి తోడు, వలసలను ప్రోత్సహించడం, తెలంగాణ సాంస్కృతిక దాడులు మొదలు పెట్టింది.
తెలంగాణ ప్రజలు అసలు మనుషులే కాదన్నట్లు, వారికి ఎలాంటి చరిత్ర లేదన్నట్లు, తెలంగాణ యాసను కించపరచడాన్ని ప్రోత్సహించింది. ఇక చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో అధికారం చేపట్టిన తరువాత ఈ దాడులు తీవ్రమయ్యాయి. తెలంగాణ పదాన్ని నిషేధించడం, సొంత రాష్ట్రం కావాలని అడిగిన వారందరిని నక్సలైట్ల పేరుతో కాల్చి చంపడం ప్రారంభించారు.
తెలంగాణవాదులను, ప్రజలను ఎంత హింసించాలో అంతా చేశారు. కానీ చిట్ట చివరికి తెలంగాణ వచ్చింది.. పోరాటం ఎవరి మీద జరిగిందో.. ఎలా చేశామో ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పాల్సిన పనిలేదు.
పోనీ తెలంగాణ వచ్చిన తరువాత అయిన చంద్రబాబునాయుడు సవ్యంగా సాగనిచ్చాడా అంటే అదీ కాదు.. తెలంగాణ మొదటి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ లో మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దేవుడి దయ వల్ల ఐదేళ్లకు ముందే మా ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తాం. దానికి కొనసాగింపుగా తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు’’. నోట్ల కట్టలతో తెలంగాణ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడింది ఎవరో మీకు మరోసారి గుర్తుచేయాల్సిన అవసరం లేదు.
ఈ సంఘటనలు, పైన గ్రూప్ 2 లో అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సంబంధం ఉందో మీకు ఈపాటికే అర్థమయి ఉంటుంది. ‘‘ కత్తి ఆంధ్ర వాడిదే అయినా.. పొడిచేది తెలంగాణ వాడే..’’ ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో అన్న మాటలు..
తెలంగాణ తల్లి.. తరువాత అమర వీరుల స్థూపమేనా?
టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగు తల్లి పేరుతో తెలంగాణ చరిత్రను, సంస్కృతిని మాయం చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని గ్రహించిన తెలంగాణ వాదులు, మేధావులు తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మలి దశ ఉద్యమంలో ఉద్యమ గుర్తులు అన్ని చోట కనిపిస్తాయి. ‘‘ తెలంగాణలో అమరవీరుల స్థూపాల తరువాత తెలంగాణ తల్లి విగ్రహాలే అధికం. అలాంటిది రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అని జీవోలు ఇచ్చేశారు.
అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ లోగో మార్పుకు సంకేతాలు, టీఎస్ తీసేసి, టీజీ సిరీస్ తెచ్చారు, తరువాత అమర వీరుల స్థూపాన్ని సైతం మార్చేస్తారు కావచ్చు’’ అని తెలంగాణ ఉద్యమం సందర్భంగా మండల జేఏసీలో చురుకుగా పాల్గొన్న ఓ ఉద్యమకారుడు ‘ ఫెడరల్ తెలంగాణ’ ముందు అనుమానం వ్యక్తం చేశారు.
‘‘ మార్పు మార్పు అన్నారు.. ప్రజా తెలంగాణ అని ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ ప్రశ్నలు.. కొన్ని సంఘటనలు చూస్తే ఇది బానిస తెలంగాణలా కనిపిస్తుంది ’’ అని ఆ ఉద్యమకారుడు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారిక హోదా లేకపోతే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆ పని చేస్తే సరిపోతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఆనాడు ఉద్యమం సందర్భంగా మాతో కలిసిరాలేదని, పైగా తమపై అక్రమ కేసులు పెట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమం సందర్భంగా కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఉద్యమం సందర్భంగా పోలీసులకు సమాచారం ఇచ్చి ద్రోహులుగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు కేసుల సందర్భంగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగామని వివరించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ తెలంగాణ ఉద్యమ గుర్తులు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.
తెలంగాణ చరిత్రను తుడిచే ప్రయత్నం చేస్తారా?
గ్రూప్ 2 పరీక్ష సందర్భంగా కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలు, నక్సలైట్ ఉద్యమం పై ప్రశ్నలు సంధించారు కానీ, మలి విడత ఉద్యమానికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్, కేసీఆర్ పై ప్రశ్నలు ఏవీ రాలేదు. ‘‘ తెలంగాణ మలి విడత ఉద్యమంలో కేసీఆర్ పాత్ర విస్మరించలేనిది. ఆయనపై గానీ, ఆ పార్టీ ఉద్యమం నిర్మించిన తీరుపై ప్రశ్నలు ఉంటాయని అనుకున్నాను.
కానీ అవేవీ లేకుండా ప్రశ్నలు వచ్చాయి. ఇదేలా అనిపించిందంటే.. స్వాత్రంత్య్ర పోరాటం కాంగ్రెస్ చేసింది కాబట్టి, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్వాతంత్య్ర పోరాట ప్రశ్నలు లేకుండా యూపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహ కూడా ఎవరూ భరించలేరు.. కానీ తెలంగాణ మలి విడత ఉద్యమానికి సరిగ్గా అలాగే జరిగింది ’’ అని హనుమకొండలోని భీమారంలో గ్రూప్ 2 పరీక్ష రాసిన ఓ అభ్యర్థి ‘ఫెడరల్ తెలంగాణ’ తో అన్న మాటలు.
చాలామంది గ్రూప్ 2 అభ్యర్థులతో ‘ ఫెడరల్ తెలంగాణ’ మాట్లాడే ప్రయత్నం చేసింది. గ్రూప్ 2 పరీక్ష చాలా సార్లు వాయిదా పడటం, ఇంతకుముందు నిర్వహించిన అనేక నోటిఫికేషన్ లలో ఉద్యోగాలు రావడంతో ఈ పరీక్షకు చాలా తక్కువ మంది హజరయ్యారు. పేపర్ 4 చాలా సులభంగా ఉందంటూనే తెలంగాణ మలి దశ ఉద్యమంపై ప్రశ్నలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారితే విధానాలు మారాలి కానీ చరిత్ర మారడం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏంటనీ ప్రశ్నించారు.
ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ:హరీష్ రావు
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పరీక్షలా అంటూ ఎక్స్ వేదికగా దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమేనా మార్పు అంటూ ట్వీట్ చేశారు.
ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు, తెలంగాణ కు అడ్డం పడిన రాయపాటి, లగడపాటి, కావూరీ, టీ సుబ్బిరామిరెడ్డి పై ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ ను దత్తత తీసుకోవడం ఇలాంటి ప్రశ్నలు ఎలా ఇస్తారని అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నంలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత్య దుర్మార్గం అని మండిపడ్డారు. నీ కుటిల ప్రయత్నాలను తెలంగాణ సమాజం గుర్తించిందని, తగిన సమయంలో బుద్ధి చెబుతుందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.


Read More
Next Story