
‘సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?’
హైదరాబాద్‌తో బీజేపీ రాజకీయం చేస్తోందన్న మహేష్ కుమార్ గౌడ్.
తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ పోరాటం, హైదరాబాద్‌తో బీజేపీ రాజకీయం చేస్తోందని, అందుకు బుధవారం వాళ్లు పరేడ్ గ్రౌండ్ నిర్వహించిన పార్టీ కార్యక్రమం ఉదాహరణ అని అన్నారాయన. బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆత్మ క్షోభిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17కి బీజేపీకి ఏం సంబంధం ఉంది? అని ప్రశ్నించారు. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో బీజేపీ నేత ఎవరైనా ఉన్నారా? గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ ఒలకబోసే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి? నెహ్రూ మాటమేరకే పటేల్.. సైన్యాన్ని తీసుకుని వచ్చారు.. అని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. చెప్పుకోవడానికి బీజేపీ చరిత్ర లేదని విమర్శలు గుప్పించారు.
బీజేపీ పాత్ర ఎందులో ఉంది..?
‘‘బీజేపీ పాత్ర ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా లేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బీజేపీ ఎక్కడైనా ఉందా? బీజేపీ నేత ఎవరైనా వీటిలో పాల్గొన్నారా? కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రోగ్రాం.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది? గుజరాత్‌లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17నే భారత్‌లో విలీనం అయింది. అలాంటప్పుడు సెప్టెంబర్ 17న గుజరాత్‌లో జునాఘడ్ గురించి ఎటువంటి కార్యక్రమం ఎందుకు నిర్వహించడం లేదు? ఎవరూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? కానీ బీజేపీ మాత్రం హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది. ఇది రాజకీయం కాదా?’’ అని ప్రశ్నించారు.
బీజేపీకి ఎన్నికలే ముఖ్యం..
‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాక.. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతిసారి ఎన్నికల ముందు అనేక ఘటనలు జరిగాయి. అవన్నీ కూడా ఎన్నికల ముందే జరిగేవి. వాటిపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై చర్చ జరగాలి. ఉన్న అనుమానాలు నివృత్తి కావాలి. ప్రతిసారి ఎన్నికల ముందే ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? పహల్గాం దగ్గర భద్రతను ఎందుకు తొలగించారు. పహల్గాం విషయంలో మోడీ, అమిత్ షా ఇద్దరూ విఫలమయ్యారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లైన్‌లోనే కవిత..
ఈ సందర్భంగానే కల్వకుంట్ల కవిత.. తెలంగాణ విలీనం దినోత్సవ కార్యక్రమం నిర్వహించడంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగింది విలీనం కాబట్టే.. కవిత.. విలీన దినోత్సవం చేస్తున్నారు. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టే కవిత ఆ లైన్‌లో ఉన్నారు’’ అని అన్నారు. అనంతరం కవిత పార్టీ పెట్టడం అన్న అంశంపై స్పందించారు. ఎవరు పార్టీ పెట్టినా తాము స్వాగతిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని అన్నారు.