
Graphics-P.S. Subrahmanyam
అయ్యా ట్రంపు.. మాలో మాకే పెట్టావా 'చిచ్చు'
అయ్యో రామా! అమెరికాలో మనవాళ్లెందుకిలా తిట్టుకు చస్తున్నారు! Green card v/s H-1B, F-1
'నాకు ఒకటి పోతే ఎదుటోడికి వాడికి రెండు పోవాలన్న' సామెతను ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు రుజువు చేస్తున్నారు. 'కడుపు నిండిన వారికీ కడుపు కాలుతున్న వారికీ' మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరుకు ట్రంప్ తెచ్చిన కొత్త వీసా విధానం ఆజ్యం పోసింది.
అమెరికాలో గ్రీన్ కార్డు, Citizenship (పౌరసత్వం) ఉన్న వారికీ, వివిధ రకాల వీసాల మీద ఉన్న వారికి మధ్య 'సూటిపోటి మాటల యుద్ధం' మొదలైంది. ట్రంప్ వీసా ఫీజు పెంపు మనలో మనకే (ఇండియన్స్ మధ్య) కొత్త చిచ్చు పెట్టింది.
అమెరికాలో గ్రీన్ కార్డు, Citizenship (పౌరసత్వం) ఉన్న వారు, వివిధ రకాల వీసాల మీద ఉన్న వారు సామాజిక మాధ్యమాల వేదికగా బాహాబాహీకి తలపడుతున్నారు. ఎఫ్-1 వీసాపై ఉన్న విద్యార్థులు, H 1 B పై ఉన్న ఉద్యోగులు 'ఇక తట్టాబుట్టా సర్దుకోవడం మేల'ని అమెరికాలో స్థిరపడిన వర్గం మాట్లాడుతుంటే.. ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయడానికి, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారు 'మీ కడుపు నిండితే చాలా' అని మండిపడుతున్నారు. 'ఏరు దాటిందాక ఒక తీరు, ఏరు దాటిన తర్వాత మరో తీరా' అని ప్రశ్నిస్తున్నారు. అందరం బతకడానికి వచ్చిన వాళ్లమే కదా, ఇంత నిర్దయగా ఉండాల్నా అని వాపోతున్నారు.
కొత్త ప్రపంచాన్ని చూడాలని, F1 వీసానో, H1 వీసానో సాధించి కొత్త రెక్కలు కట్టుకుని అమెరికాకి వచ్చిన యువతరం అక్కడ స్థిరపడిన వాళ్లపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారే రాజకీయ ఆర్ధిక సామాజిక విధానాలకు తమకు సంబంధం ఏమిటని నిలదీస్తున్నారు.
అమెరికాకి వచ్చిన ఈ కొత్త వలసల వల్ల తమ పిల్లల భవిష్యత్ అవకాశాలు దెబ్బతింటున్నాయని అక్కడ స్థిరపడిన, గ్రీన్ కార్డున్న భారతీయులు వాపోతున్నారు. కొందరైతే అవాకులు చెవాకులు పేలుతున్నారు. 'వీళ్లకి స్కిల్స్ లేవు, నైపుణ్యం లేదు' అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇలా కించపరచడం తగదని హెచ్ 1 బీ, ఎఫ్-1 వీసా దారులు కోరుతున్నారు. Stop ridiculing, Stop preaching now అని కోరుకుంటున్నారు. అసూయ, ద్వేషాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో స్థిరపడిన వారి వాదనలో నిజంగానే అర్థం ఉందా?
2000వ సంవత్సరానికి పూర్వం అమెరికా వీసాలకు ఇప్పుడున్నంత గిరాకీ లేదు. నిజంగా స్కిల్ ఉన్న వాళ్లు, పీహెచ్‌డీ చేసిన వారు, శాస్త్రవేత్తలు ఎవరైనా అమెరికాకి దరఖాస్తు చేసుకుంటే గ్రీన్ కార్డ్ ఇచ్చి మరీ అమెరికాకి పిలిపించుకునే వారు. 2000వ సంవత్సరం (y2k) ప్రారంభంలో సరికొత్త అవకాశాల అన్వేషణలో ఓ కొత్తతరం అమెరికా చేరింది. ఆ ప్రాంతంలోనే ఈ H1B ప్రారంభమైంది. స్కిల్డ్ వర్కర్స్ అమెరికాలో పని చేసేందుకు ఇచ్చే వీసా ఇది. ఆ సమయంలో యూఎస్ వెళ్లిన వారికి ఇప్పుడు గ్రీన్ కార్డులు, పౌరసత్వాలు వచ్చాయి.
వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగి పెద్దై అమెరికా సమాజంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్లు ఉద్యోగాల అన్వేషణలో ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రస్తుతం ఇండియా నుంచి పోయిన వారు పోటీ అవుతున్నారనేది కీలకాంశం.
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు...
"2001లో ఒకప్రోగ్రామ్ రాయడానికి ఒక రోజు పట్టేది. ఇప్పుడు ఒక గంటే పడుతోంది. ఆవేళ అది అమెరికాకి కొత్త. ఇప్పుడు అందరికీ తెలుసు. అమెరికన్ జాబ్ మార్కెట్ పెరిగింది. 2015 నుంచి 2022 మధ్య ప్రత్యేకించి కరోనా సమయంలో లక్షలాది మంది ఇండియన్ విద్యార్ధులు ప్రత్యేకించి తెలుగు పిల్లలు అమెరికా వచ్చారు. విద్యార్థి వీసాలపై కోటా లేదు. ఇంతమందికే వీసాలు ఇవ్వాలన్న రూల్ లేదు. అమెరికన్ job మార్కెట్ పై హైప్ క్రియేట్ అయింది. దాంతో కన్సల్టెన్సీలూ పుట్టుకొచ్చాయి. భారీ మోసాలూ చోటుచేసుకున్నాయి. ఎటువంటి నైపుణ్యం లేని వారు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాయించడం మొదలు పెట్టారు. అది అమెరికాలోని స్థానికులకు బయటి నుంచి వచ్చిన వారికి మధ్య అసూయ, ద్వేషాలను రగిలించింది. ఇప్పుడదే మన వాళ్లలోనూ కనిపిస్తోంది" అన్నారు న్యూజెర్సీలో స్థిరపడిన తెలుగు వాసి షరీఫ్ (పేరు మార్చాం).
ఈపాటికే రద్దు చేసి ఉండాల్సింది?
"H 1B వీసాను ఈపాటికే రద్దు చేయాల్సింది, రాజకీయ కారణాల దృష్ట్యా కొనసాగుతోందని, మున్ముందు ఇంకా కష్టాలు రావొచ్చు. గతంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లను తీసుకువచ్చే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్లను తీసుకుంటున్నారు. కన్సల్టెంట్ కంపెనీలు వీళ్లను హైర్ చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకు ముందున్న ఐటీ గిరాకీ లేదు. వర్క్ ఫ్రం హోం చేసే పరిస్థితి ఉంది. దేశాలు పట్టి పోవాల్సిన పని లేదు" అన్నారు టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో ఉంటున్న ఎన్. ప్రసాద్.
రెడీమేడ్ చపాతీలా ప్రస్తుత ఐటీ..
"గత పాతికేళ్లలో సాఫ్ట్ వేర్ కూడా రెడీమేడ్ చపాతీ అయింది. ఏఐ వచ్చిన తర్వాత మరీనూ. అమెరికాలో సగటున ఐటీ ఖర్చు 4 వేల డాలర్లు. అదే ఇండియాలో ఐటీ ఖర్చు 97 డాలర్లు. అంటే అమెరికాలో ఖర్చు పెడతారు, అలాగే ఇండియాలోనూ ఖర్చు పెరగాలి. సొంత పొలాన్ని ఎండబెట్టుకుని పరాయి వాడి చేలో పని చేస్తున్నట్టు ఉంది.." అని ఇంకో పెద్దాయన చెప్పారు. (ఈయన పిల్లలు సంపాయించిన పౌరసత్వం ఆధారంగా ఈయన కూడా గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యారు.)
వీళ్లు తిరిగి వచ్చేస్తే వాళ్లకు ఉద్యోగాలు వస్తాయా?
“ఇక్కడ చదువుకున్నాక లేదా ఉద్యోగం చేసుకున్నాక స్వస్థలాలకు వెళ్తే మంచిది” అని కొందరు ఎన్‌ఆర్‌ఐలు సూచిస్తున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది- తమ పిల్లల అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళనే కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు తమ దేశాలకు వెళ్లిపోతే ఇక్కడ పుట్టిన ఇండియన్ ఆరిజన్ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నది వీళ్ల వాదనగా ఉంది. దీనికి కొనసాగింపుగానే ఎఫ్-1, హెచ్ 1 బీ వీసాలపై ఉన్న వాళ్లపై జోకులు వేస్తున్నారు. ఎగతాళిగా మెసేజీలు పెడుతున్నారు.
"ఇక బయల్దేరండి, తట్టా బుట్టా సర్ధుకున్నారా.."అని ఒకరు, "మీరు తొందరగా వెళ్లే మా పిల్లలకైనా ఛాన్స్ వస్తుందేమోరా, లక్షకు పెంచి ట్రంప్ మంచి పనే చేశార్రా.." అనే వాళ్లు కొందరు..
ఈ తీరును ఉద్యోగాల కోసం వేట (ఆన్ బెంచ్) సాగిస్తున్న కొత్త వలసదారులు వ్యతిరేకిస్తున్నారు.
నిజంగా ‘పోటీ’ పెరిగిందా?
హెచ్-1బీ వీసాలను ఏడాదికి 85,000 ఇస్తారు. వీటిలో 65 వేలు రెగ్యులర్, 20 వేలు USలో మాస్టర్స్ చేసే వారు. కానీ దరఖస్తు చేసుకునే వారి సంఖ్య సుమారు 2 లక్షల దాకా ఉండడంతో లాటరీ పద్ధతిన ఈ వీసాలను ఇస్తున్నారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు.
2023-2024 లెక్కల ప్రకారం హెచ్-1బీ అప్రూవల్స్‌లో ఇండియన్ నేషనల్స్ వాటా సుమారు 70%+. కాబట్టి ఏ మార్పు వచ్చినా ప్రభావం భారత్ పైనే ఎక్కువ. అందులో తెలుగు వాళ్లూ గణనీయంగా ఉంటారు.
2024 నాటికి USలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు 15లక్షల 80వేలు. ఇందులో ఇండియా వాటా 27%. వీరిలో చాలామంది F-1 → OPT → STEM OPT (24 నెలలు) → H-1బీ మార్గాన్ని ప్రయత్నిస్తారు. పైప్‌లైన్ పెద్దది కాబట్టి ఎంట్రీపై భారీ ఫీజు (లక్ష డాలర్లు) పెట్టామన్నది అమెరికా వాదన.
స్థిరపడిన వారి వాదనకు డేటా సపోర్ట్ ఉందా?
హై-స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ వల్ల స్థానికుల వేతనాలపై నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. H-1బీ ఇన్‌ఫ్లో పెరిగితే పేటెంటింగ్, ఫర్మ్ స్కేల్ కూడా పెరిగిన సూచనలు ఉన్నాయి. కానీ కొన్ని సెగ్మెంట్లలో, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ అకౌంటింగ్ వంటి రంగాల్లో, H-1బీ హైరింగ్ కి స్టార్టింగ్ వేతనాలు 10% తక్కువగా ఉన్న రుజువులూ ఉన్నాయి.
ఇది లోకల్ గ్రాడ్యుయేట్స్‌కు ఇబ్బంది కలిగించొచ్చు. కానీ టెక్/ఇన్నోవేషన్-ఇంటెన్సివ్ రంగాల్లో ఫర్మ్ ఉత్పాదకత పెరగడం వల్ల నెట్ ఎఫెక్ట్ పాజిటివ్ గా కనిపిస్తుంది.
జెనరేషనల్ రియాలిటీ
1990 నుంచి 2000మధ్య వచ్చిన వలసదారుల (US-Born) పిల్లలు ఇప్పుడిప్పుడే లేబర్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆసియన్/ఇండియన్ అమెరికన్ జనాభా వేగంగా పెరుగుతోంది. ఇది సహజంగానే ఎంట్రీ-లెవల్ లో పోటీగా కనిపిస్తుంది. కాని నిజానికి ఇదే సమయంలో US లేబర్ ఫోర్స్ లో యువత శాతం పెరుగుతోందన్న సంకేతాలు ఉన్నాయి.
అందువల్ల బయటి నుంచి వచ్చిన వారు “అమెరికా పిల్లల ఉద్యోగాలు తీసుకెళుతున్నారు” అనే వాదనలో అర్థం లేదు. హై-స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్‌తోనే ఉద్యోగాల సంఖ్య, కంపెనీల స్కేలు, ఇన్నోవేషన్ పెరిగే అవకాశాలు అధికం.
ఫీజు పెంచడం వల్ల స్థానికులకే మేలు..
USలో పుట్టిన ఇండియన్ అమెరికన్స్: ఎంట్రీ-లెవల్ SWE/డాటా/సెక్యూరిటీ రోల్స్‌లో సిటిజన్/గ్రీన్‌కార్డ్ హోదా ఉన్నవారికి ఎంప్లాయర్లు ప్రాధాన్యత ఇస్తారు. కాస్ట్-రిస్క్ తక్కువ కాబట్టి షార్ట్-టర్మ్‌లో ప్లస్ పాయింట్ స్థానికత. అయితే వాళ్లకు అమెరికన్ చట్టాల ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ జాబ్స్ పట్ల అమెరికన్ యూత్ పెద్దగా ఆసక్తి చూపదు. ఇది హెచ్ 1 బీ వీసాదారులు లేదా అక్కడ చదివిన మన పిల్లలకు కలిసివచ్చే అంశం.
ఇండియా నుంచి కొత్తగా వచ్చేవారు: స్పాన్సర్ ఖర్చు పెరిగినందున ఎక్కువ కంపెనీలు ముందుకు రావు. పెద్ద సంస్థలన్నీ ‘హై వేజ్-హై స్కిల్’ నిపుణులనే ప్రిఫర్ చేయవచ్చు. అప్పుడైనా స్థానికులకే ప్రాధాన్యత ఉంటుంది.
కేవలం చిన్న, మధ్య తరహా కంపెనీలు మాత్రమే రిమోట్/ఆఫ్‌షోర్ వైపు వెళతాయి. ఆ తరహా ఉద్యోగాల్లో ఇండియా నుంచి వచ్చే వారికి అవకాశం లభించవచ్చు.
వేతన దోపిడీని అరికట్టాలన్న అమెరికా లక్ష్యం ఒప్పుకోదగినదే. కానీ ఫీజు పెంపు ఒక్కటితో మార్కెట్‌లో రిస్క్-అడ్జస్టెడ్ మెరిట్ సెలక్షన్ వస్తుందని చెప్పటం అతిశయోక్తి. “అమెరికా పిల్లల అవకాశాలు తగ్గుతాయి” అన్నది అతి వాదనే.
అసూయా? లేదా నిజమైన ఆందోళన?
హెచ్-1బీ వీసా దారులు, ఎఫ్-1 విద్యార్థులపై “నైపుణ్యం లేదు, అవకాశాలు కబళిస్తున్నారు” అనే ఆరోపణలు అసంబద్ధం. ఆకలి ఆరాటం అందరిదీ ఒకటే.
“అసూయ, ద్వేషం ఆపాలి. మనలో మనమే విభేదాలు పెంచుకోవడం వల్ల అందరికీ నష్టం” అని గుర్తించాలి. అమెరికాలో ఆస్తులు ఉన్నాయని సంబరపడవద్దు, సంక్షోభం వచ్చిందంటే అందరూ బాధితులే” అని ఫ్లోరిడా వాసి రావు ఆర్ రాయల్ ఇచ్చిన సలహా అందరూ పాటించదగింది.
Next Story