
తెలంగాణ ఏసీబీ కార్యాలయం
తెలంగాణలో అవినీతి అధికారులపై చర్యలు ఎప్పుడు ?
తెలంగాణ రాష్ట్రంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సాగిన అవినీతి, అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి 151 కేసుల్లో తుది నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై నెలాఖరు వరకు ఏసీబీ 151 తుది నివేదికలను సమర్పించగా వీటిలో 21 అక్రమాల కేసులు జులై నెలలోవని ఏసీబీ అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో 151 కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ దాడులు, విచారణల్లో తేలింది. దీంతో ఈ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.ఏసీబీ వరుస దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.గత ఏడాది వచ్చిన నివేదికలపై సర్కారు ఇంకా చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
జులై నెలలో 22 ఏసీబీ కేసులు
తెలంగాణలో ఒక్క జులై నెలలోనే 22 అక్రమాల కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఇందులో 13 ట్రాప్ కేసులు, ఒకటి సంపాదనకు మించిన ఆస్తులు కూడగట్టిన కేసు అని తెలంగాణ ఏసీబీ అధికారులు చెప్పారు. రవాణశాఖ చెక్ పోస్టులు, సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి రూ. 11.50 లక్షలను సీజ్ చేశారు. ఏసీబీలో పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ఏసీబీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆర్టీఐ యాక్టివిస్టు సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆరునెలల్లో 148 కేసుల నమోదు
ఈ ఏడాది ఏసీబీ తెలంగాణలో జనవరి నుంచి జులై నెల వరకు 148 కేసులు నమోదు చేసింది. ఇందులో 93 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసులు కావడం విశేషం. 9మంది అవినీతి అధికారులు సంపాదన కంటే అధికంగా ఆస్తులున్నాయని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. మరో 15 మంది అధికారులపై క్రిమినల్ మిస్ కాండక్ట్ కేసులు, మరో 11 మందిపై శాఖ పరమైన విచారణలు చేపట్టారు. 17 ప్రభుత్వ విభాగాలపై ఆకస్మికతనిఖీలు చేసి 145 అధికారులు, ఉద్యోగులు, పదిమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.30.32 లక్షలను స్వీధీనం చేసుకున్నారు. సంపాదనకు మించిన ఆస్తున్న కేసుల్లో నిందితుల నుంచి రూ.39 లక్షలు సీజ్ చేశారు.
ఏసీబీ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి డీజీ ఆదేశాలు
తెలంగాణలో ఈ ఏడాది అర్ద సంవత్సరంలో ఏసీబీ నమోదు చేసిన కేసులపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ తాజాాగా సమీక్షించారు. దీర్ఘకాలికంగా ఏసీబీ అధికారుల వద్ద పెండింగులో ఉన్న కేసులను సత్వరం దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని డీజీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల సంఖ్య పెరిగింది. అక్రమాల ఆట కట్టించిన ఏసీబీ అధికారులను తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న అవినీతి, అక్రమాలపై 1064 ఫోన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని డీజీ కోరారు. ఏసీబీపై ప్రజల్లో ప్రచారం చేసేందుకు స్టిక్కర్లను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయించారు.
Next Story