గౌరవెల్లికి నీటి గలగలలు ఎన్నడో?
x
గౌరవెల్లి ప్రాజెక్ట్

గౌరవెల్లికి నీటి గలగలలు ఎన్నడో?

ప్రాజెక్ట్ పూర్తయి రెండేళ్లు అయిన నీరు నిండని పరిస్థితి. ఎన్జీటీలో కేసు వేసిన ముంపు బాధితులు


హుస్నాబాద్.. ఎటూ చూసిన పెద్ద పెద్ద కొండలు, గుట్టలు.. రాళ్లు, రప్పలు. నిత్య కరువు ప్రాంతం.. వానాకాలమైన, ఎండాకాలమైన నీటికి కటకటే. అయినా అన్ని కష్టాలకు ఓర్చి ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు.

బుతుపవనాలతో ఆడే జూదంలో అన్నదాతలు చాలాసార్లు ఓటమి పాలయ్యారు. వీరిని ఆదుకోవడానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలకులు ఓ మోస్తారు ప్రయత్నాలు చేశారు.

జలయజ్ఞంలో భాగంగా అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ ను నిర్మించడానికి నడుంబిగించింది. 1.5 టీఎంసీల సామర్థ్యంలో 2007-08 లో అనుమతులు ఇచ్చి, పనులు ప్రారంభించింది. దానికి అనుగుణంగా కాలువల తవ్వకాలు కూడా చేపట్టింది.

అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాజెక్ట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 లో ఈ ప్రాజెక్ట్ ను సందర్శించారు. చుట్టూ కొండలు ఉండటం, కేవలం మరో నాలుగు తండాల ముంపుతో దీని సామర్థ్యం ఏడు రెట్లు పెంచవచ్చని ఇంజనీర్లు సూచించడంతో 8.5 టీఎంసీలకు పెంచారు.
2017 లో మరోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కాలంతో పోటీపడి 2023 లో పనులు పూర్తి చేశారు. అదే సంవత్సరం ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను సైతం విజయవంతం చేశారు. నీటితో నింపి కాల్వల ద్వారా వాటిని రైతులకు అందించడం మాత్రమే మిగిలిందన్న తరుణంలో కొత్త అవాంతరం వచ్చి పడింది.



సమస్య ఏంటీ.. నీళ్లు ఎందుకు రావట్లేదు?
ఈ ప్రాజెక్ట్ ను అక్కన్నపేట మండంలోని గుడాటిపల్లి అనే గ్రామంలో నిర్మిస్తున్నారు. దీనికింద మరో మూడు తండాలు, చిన్న గ్రామాలు రెండు ఉన్నాయి. మొదట ప్రాజెక్ట్ ను కేవలం 1.5 టీఎంసీలతో నిర్మించడటంతో ఇందులో భూములు కోల్పోయిన రైతులు ఎగువ ప్రాంతంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు.
అయితే కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచడంతో రెండోసారి కొనుగోలు చేసిన భూములు కూడా ముంపు కింద ప్రభుత్వం సేకరించింది. ఇందులో కొంతమంది రైతులు పరిహారం చాలాతక్కువగా ఉందని తీసుకోవడానికి నిరాకరించారు.
కొంతమంది ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మొత్తం, మైనర్లు మేజర్లుగా మారిన వారికి పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.
తమకు ప్రభుత్వం న్యాయం చేశాకే ప్రాజెక్ట్ ట్రయల్ రన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు నాలుగు సార్లు లాఠీచార్జీ చేశారు. అర్థరాత్రి కరెంట్ ఆఫ్ చేసి గుడాటిపల్లిలో ఇళ్ల లో దూరి వారిని బలవంతంగా ఖాళీ చేయించినట్లు ఆరోపించారు.
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో చాలామంది రైతులకు గాయాలయ్యాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికి పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో కొంతమంది రైతులు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆశ్రయించారు. రైతులకు నష్ట పరిహారం ఇచ్చిన తరువాతే నీటిని నింపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దానితో ప్రాజెక్ట్ లో నీరు ఎత్తిపోయడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయంపై గుడాటిపల్లి బాధితులతో మాట్లాడటానికి ‘ది ఫెడరల్’ ప్రయత్నం చేసినప్పటికి వారు స్పందించలేదు.
ఎన్ని వేల ఎకరాలు..
ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 1.20 వేల ఎకరాలను నీరు అందించాలని ప్రణాళిక వేశారు. హుస్నాబాద్, అక్కన్నపేట, వేలేరు, ధర్మసాగర్, చిగురుమామిడి, కోహెడ, భీమదేవరపల్లి, సైదాపూర్, స్టేషన్ ఘన్పూర్ మండలల్లోని ప్రజలకు సాగు, త్రాగు నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
కుడి కాలువ కింద 90 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద మరో 30 వేల ఎకరాలు సాగు నీరు అందించాలని కాల్వలు పూర్తి చేశారు. చాలా సంవత్సరాల క్రితమే కాల్వల తవ్వకంతో ప్రస్తుతం వీటిలో పెద్ద పెద్ద చెట్లు పెరిగాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏర్పడింది.
‘‘కొంతమంది రైతులు చెన్నైలోని ఎన్జీటీలో కేసు వేశారు. కేసు నడుస్తూ ఉంది. వచ్చే నెలలో మరో వాయిదా ఉంది. ప్రభుత్వం స్టే ఎత్తివేయించడానికి ప్రయత్నిస్తోంది.
కొంతమంది రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. కానీ మరికొంతమంది రైతులు పరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.
90 శాతం ప్రాజెక్ట్ పూర్తి అయింది. కొన్ని చోట్ల కట్టకు రాళ్లు పరచాలి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏఈ రాములు ‘ది ఫెడరల్’ కు చెప్పారు.



నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు?
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలక వాటర్ జంక్షన్ అయిన మిడ్ మానేర్ నుంచి నీటిని ఎత్తి పోస్తారు. మొదట మిడ్ మానేరు నుంచి నేరుగా బెజ్జంకి మండలంలోని కొత్తపల్లి చెరువుకు నీటిని ఎత్తిపోస్తారు.
అక్కడ నుంచి గ్రావిటి కెనాల్ ద్వారా నార్లపూర్ చేరుతాయి. తరువాత 11 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా హుస్నాబాద్ మండలంలోని రేగొండ లో నిర్మించిన సర్జిపూల్ కు నీరు చేరుతుంది.
ఇక్కడ 132 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు బిగించారు. ఇవి 700 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఈ మోటార్లు 126 మీటర్ల ఎత్తులో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ కు జలాలను తరలిస్తాయి.
ప్రతిదశలోనూ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులన్నీ ప్రభుత్వం పూర్తి చేసింది. కేవలం నీటిని నింపి, కాలువల ద్వారా రైతులకు అందించడమే మిగిలింది. ఈ విషయం పై హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ను సంప్రదించడానికి ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు.
హుస్నాబాద్, స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలోని కొన్ని మండలాల ప్రజలకు గౌరవెల్లి ప్రాజెక్ట్ నీరే దిక్కు. ఈ సంవత్సరం తెలంగాణ అంతటా విస్తృతంగా వర్షాలు కురిసినప్పటికి ఇక్కడ మాత్రం మోస్తారు వానలే కురిశాయి.
చాలాచోట్ల చిన్న చిన్న కుంటలు కూడా నిండని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వేసిన నాట్లకు కూడా నీరందకు చిన్న, సన్నకారు రైతులు బావులు పూడిక తీస్తున్నారు. దసర పండగలోపు వర్షాలు కురవకపోతే ఈ సారి వేసవి కాలం పంటల సంగతి పక్కన పెడితే కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి.
ప్రభుత్వం వెంటనే ఎన్జీటీ కేసును పరిష్కరించి నీటిని అందించాలని సామాజిక ఉద్యమకారుడు కే. రమేష్ కోరారు. స్వతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారిగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని కానీ చేతికి అందిన ముద్ద, మూతికి అందడం లేదన్నారు.
భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలోని ఓ రైతు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘వానలు సరిగా పడక 20 రోజుల కిందే నాటు వేశాను. రెండు మూడు రోజులు చెరువు నిండినట్లే చేసింది. కానీ తుప్పురు తప్ప పెద్దగా వానపడలేదు.
ఇప్పుడు పొలం పారుత లేదు. వరుస తడులు పెడుతున్న. ఎండుతదా.. పండుతదా అనే దేవుడికే తెల్వాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
మొన్నటి యాసంగి సీజన్ లో నీళ్లు అందక హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎండిన పంట లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో బోరు బావుల తవ్వకం, బావిలో పూడిక తీతలు చేసినప్పటికి పంటకు నీరు అందించలేకపోయారు. ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరాలంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడమే దిక్కు.
Read More
Next Story