
రైతులు రోడ్డెక్కుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికిపోయారు?
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలంగాణ రైతులకు కావాల్సిన యూరియాను తెచ్చే దమ్ము కాంగ్రెస్ ఎంపీలకు లేదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలేమో అసలు ఈ సమస్యపై పెదవి ఇప్పరని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతోందని ఆయన అన్నారు. ‘‘యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడున్నారు? సమస్యలు ఇక్కడుంటే సీఎం, మంత్రులు ఉండేది ఢిల్లీ, బీహార్‌లలోనా? జాతీయ పార్టీలకు ఓట్లు.. రాష్ట్ర ప్రజలకు పాట్లా’’ అంటూ కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి.. బీహార్‌లో పర్యటిస్తుండటంతో కేటీఆర్ ఈ వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి రేవంత్.. పార్టీ కోసం బీహార్‌లో పర్యటిస్తుండటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
బీహార్‌లో రేవంత్ చేస్తుందిదే..
బీహార్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అతి త్వరలో అక్కడ ఎన్నికల పోరు జరగనుంది. ఈ క్రమంలోనే అన్ని జాతీయ పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా బీహార్‌లో ప్రచారాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్.. ఓట్ అధికారి యాత్ర ప్రారంభించింది. ఇాందులో ఓటర్ల జాబితా అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అందులో పాల్గొనడం కోసమే తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు బీహార్ వెళ్లారు. అందువల్లే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతాంగం కష్టాలు తీర్చడం చేతకాని పాలకులు.. పక్క రాష్ట్రాల ప్రజలకు హామీలు ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ చురకలంటించారు.