
రేవంత్ కు మంత్రి కొండా సురేఖకు ఎక్కడ చెడింది ?
మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను అరెస్టుచేయటానికి పోలీసులు వస్తే మంత్రితో పాటు ఆమె కూతురు కొండా సుస్మిత(Konda Susmitha) అడ్డుకున్నారు
దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు తొందరలోనే ఉద్వాసన తప్పదనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)తో మంత్రికి చెడిన కారణంగా క్యాబినెట్ నుండి తప్పించటం ఖాయమని పార్టీలో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా ఈ ప్రచారం పెరిగిపోవటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను అరెస్టుచేయటానికి పోలీసులు వస్తే మంత్రితో పాటు ఆమె కూతురు కొండా సుస్మిత(Konda Susmitha) అడ్డుకోవటమే. మాజీ ఓఎస్డీపైన బెదిరింపులు, అవినీతి కేసులు నమోదయ్యాయి. అందుకనే సుమంత్ ను అరెస్టుచేయటానికి పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు మాజీ ఓఎస్డీ హైదరాబాదులోని మంత్రి ఇంట్లో ఉన్నాడని పోలీసులకు తెలిసింది.
అందుకనే ఓఎస్డీని అరెస్టుచేసేందుకు పోలీసులు కొండాసురేఖ ఇంటికి బుధవారం రాత్రి చేరుకున్నారు. అయితే లోపలకు పోలీసులు ఎంటర్ కాకుండా మంత్రి కూతురు సుస్మిత అడ్డుకున్నారు. సుమంత్ ను అరెస్టుచేయటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అరెస్టుచేస్తున్నారో చెప్పాలని అడిగారు. ఇంట్లోకి అడుగుపెట్టేందుకు సెర్చ్ వారెంటుందా ? ఎఫ్ఐఆర్ కాపీని తెచ్చారా ? చూపించండి అంటు పోలీసులను మంత్రి కూతురు బెదిరించారు. తమ ఇంటికి మఫ్టీలో వచ్చినా చాలా మర్యాదగా మాట్లాడుతున్నానని లేకుంటే మర్యాద ఇచ్చేదాన్ని కాదని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఒకవైపు పోలీసులతో కూతురు గొడవపడుతుండగానే మరోవైపు సుమంత్ ను కారులో ఎక్కించుకుని మంత్రి హైదరాబాద్ నుండి వరంగల్ కు వెళ్ళిపోయారు.
ఇక్కడే సమస్య పెద్దదయిపోయింది. ఎలాగంటే అవినీతి, బెదిరింపుకేసులు నమోదైన మాజీ ఓఎస్డీని పోలీసులు అరెస్టుచేయకుండా మంత్రి, ఆమె కూతురు అడ్డుపడటం చాలా తప్పు. పోలీసులతో మాట్లాడి సమస్యను సర్దుబాటు చేసుకోవాల్సిన మంత్రి, ఆమె కూతురు బెదిరించటం విచిత్రమే. పైగా పోలీసుల ముందే మాజీ ఓఎస్డీని తీసుకుని మంత్రి కారులో వరంగల్ కు వెళ్ళిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రే ప్రభుత్వాన్ని థిక్కరించటం చాలా తప్పు. పోలీసుల విధులకు మంత్రి, ఆమె కూతురు అడ్డుపడటం నేరం కిందకే వస్తుంది.
ఈ విషయంలోనే మంత్రిపై రేవంత్ చాలా సీరియస్ అయినట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. రేవంత్ ఆదేశాల మేరకే సుమంత్ బెదిరింపులు, అవినీతిపై చీఫ్ సెక్రటరీ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే రేవంత్ ఆదేశాల ప్రకారమే జరిగిందని అర్ధమవుతోంది. రేవంత్ ఆదేశాలను మంత్రి థిక్కరించటమే కాకుండా సవాలు విసిరినట్లుగా కనబడుతోంది. తన ఆదేశాలకే మంత్రి ఎదురు తిరగటంతో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. హోలు మొత్తంమీద విచిత్రం ఏమిటంటే మంత్రి కూతురు సుస్మిత మాట్లాడుతు వాళ్ళ అమ్మకు ఏమైనా జరిగితే అందుకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించటం. రెడ్లంతా కలిసి బీసీ బిడ్డయిన తన తల్లిని వేధిస్తున్నట్లు ఆరోపించారు. తన తల్లిని రేవంత్, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి వేధిస్తున్నట్లు మండిపడ్డారు. బీసీ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ సీఐ రావటం ఎంత సిగ్గుమాలిన చర్య ? అని నిలదీశారు. అందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు.
తాము బీసీలం కాబట్టే ప్రభుత్వం వేధిస్తోందని సుస్మిత చెప్పటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీ కాబట్టే కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చిందన్న విషయాన్ని సుస్మిత మరచిపోయింది. రాహుల్ గాంధీ బీసీలకు పెద్ద పీట వేయాలని చెబుతుంటే రేవంత్ మాత్రం బీసీ ఆడబిడ్డను తొక్కటానికి ట్రై చేస్తున్నట్లు సుస్మిత రెచ్చిపోయింది. అరెస్టవ్వాల్సిన మాజీ ఓఎస్డీ మంత్రి ఇంట్లో ఉన్నాడని తెలిసింది కాబట్టే పోలీసులు తమ ఇంటికి వచ్చాడన్న విషయాన్ని సుస్మిత కన్వీనియంట్ గా దాటేస్తోంది.
సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల టెండర్ల దగ్గర మంత్రులు కొండాసురేఖ-పొంగులేటికి చెడింది. దాంతో ఇదే విషయాన్ని కొండాసురేఖ ఢిల్లీలోని అధిష్ఠానంకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పొంగులేటి మీద మాత్రమే చెప్పకుండా రేవంత్ ను కూడా యాడ్ చేశారు. పొంగులేటికి రేవంత్ మద్దతుగా ఉండి తనను ఇబ్బంది పెడుతున్నాడనే అర్ధంవచ్చేట్లుగా సురేఖ అధిష్ఠానంకు ఫిర్యాదు చేయటంతో రేవంత్ కు బాగా మండింది. దానిప్రభావం మంత్రి ఓఎస్డీని ఉద్యోగంలో నుండి ఊడబీకటంపైన పడింది. దాంతో సమస్య బాగా పెరిగిపోయి చివరకు క్యాబినెట్ నుండి సురేఖ ఉద్వాసన తప్పదనే ప్రచారం దాకా చేరుకుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.