కెసిఆర్ ‘తెలంగాణ మ్యాజిక్’ ఏమయింది?
x

కెసిఆర్ ‘తెలంగాణ మ్యాజిక్’ ఏమయింది?

2023తోనే కెసిఆర్ లో ఉన్న వశీకరణ శక్తి మాయమయిందా?



రాజకీయాల్లో నాయకుడెవరైనా సరే మ్యాజిక్ కొద్ది కాలమే ఉంటుందని చెప్పేందుకు చాలా దృష్టాంతాలున్నాయి. నాయకుడికి ఉన్న వశీకరణ శక్తి ఎల్లకాలం ఉండదు. కొద్ది రోజుల తర్వాత నాయకుడిలో ఉన్న జనాకర్షణ పోయి అతను సాధారణ పొలిటీషన్ అయిపోతాడు. ఆ మనిషిలో చూసేకి ఏమి ఉండదు. మాటలో పదను తగ్గుతుంది. కొత్త ఐడియాస్ ఇవ్వలేడు. ఎవరో రాసిచ్చిన పదాలు వాడాల్సి వస్తుంది. సభలో ఉన్నవాళ్లకు ఈ ప్రసంగం బోరు కొడుతుంది. చీటికి మాటికి ఈలలు వేస్తారు. నినాదాలు ఇస్తారు. సభలో ఉన్న లక్షలాది మంది ఉన్నా నేత చెప్పేది వినేందుకు మనొస్పదు.

నిన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) రజతోత్సవ సభలో పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు (KCR)కు ఎదరుయిందిదే. నాయకులే కాదు, పార్టీలు కూడా ఇలా సొంత వశీకరణ శక్తి ని కోల్పోతయా? అపుడు పార్టీ సంస్థాపక మహదాశయం పారిపోయి చీప్ పాలిటిక్స్, ఎత్తులు పైఎత్తులతో బతకాల్సి వస్తుందా. ఇలాంటి గతి కాంగ్రెస్ కు పడుతుందని మహాత్మాగాంధీ ఊహించారా. స్వాతంత్య్రం వచ్చాక, ‘ఇకా చాలు, కాంగ్రెస్ పార్టీ రద్దు చేయండి,’అని పిలుపు ఇచ్చింది ఇందుకేనా? 1948 ఫిబ్రవరి 2, 'హరిజన్' పత్రికలో ఒక వ్యాసం రాస్తూ, “కాంగ్రెస్ అవసరం తీరిపోయింది. దాన్నిక రద్దు చేయండి. అదొక ప్రజాసేవ సంఘంగా దేశమంతా విచ్చుకోవాలి,”అన్నారు. నిజానికి కెసిఆర్ కూడా చాలా సార్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టిఆర్ ఎస్ తో పనేముంటుందని కాంగ్రెస్ లో విలీనం చేసి నాటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపుడు సోనియా గాంధీకి సలహా దారుగా వెళ్లాలనుకున్నారు. ఇదే వేరే కథ.

బిఆర్ ఎస్ 25 సంవత్సరాలకింద తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ ) గా పుట్టింది. ఈ రజతోత్సవ వేడుక కోసం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో బ్రహ్మాండమయిన బహిరంగ ఏర్పాటు చేశారు. లక్షలాది మందిని రాష్ట్రం నలుమూలల నుంచి తరలించారు.


ఈ సభలో, ఇంత పెద్ద పండగలో మాట్లాడింది ఒక్కరే. మరొక్కనేత కు చాన్స్ ఇవ్వలేదు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు తెలుగు దేశం పార్టీ నుంచి టిఆర్ ఎస్ లో చేరిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చాన్స్ ఇచ్చారు. 25 సంవత్సరాలూపూర్తి చేసుకున్న పార్టీలో ఈ సుదీర్ఘ యాత్ర గురించి మాట్లాడేందుకు ఎవ్వరికీ చాన్స్ ఇవ్వలేదు.అంటే పార్టీలో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అవకాశం లేదని, ఇది మా పార్టీ మా నాయకత్వం మాయిష్టం అని కెసిఆర్ బలంగా చెప్పారు. అయితే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనమై పోతున్నదని, ప్రశ్నించే గొంతులను కేసులో నొక్కి పెడుతున్నారని, పోలీసుల జోక్యం ఎక్కువయిందని, ఇది సహించమని బిగ్గరగా అన్నారు.

దాదాపు గంట సేపు జరిగిన ఆయన ప్రసంగంలో ఒక్క కొత్త మాట లేదు. కొత్త ఆలోచన లేదు. కొత్త ప్రోగ్రాం లేదు. పిలుపు లేదు. పంచ్ లేదు. కెసిఆర్ నాలుక మొద్దుబారింద అనిపించేలా సాగింది ఆయన ఉపన్యాసం. ఆయన ప్రసంగం తీరు ఏమాత్రం ఆసక్తికరంగా లేదు, ఉత్తేజకరంగా లేదు. ఈ అసహనం జనంలోకనిపించింది. చాలా సార్లు ఆయన ‘గొడవ చేయవద్దు’ అని వారించాల్సి వచ్చింది. బస్సులు పెట్టారు కాబట్టి వచ్చారు. చలువ పందిర్లు ఏర్పాటు చేశారు కాబట్టి కూర్చొన్నారు. మంచినీళ్లిచ్చారు. మజ్జిగ ఇచ్చారు కాబట్టి ఓపిక ప్రదర్శించారు. వచ్చేది మనదే ప్రభుత్వం అని కెసిఆర్ అన్నారు. జనంలో కొందరు ‘మళ్లీ ముఖ్యమంత్రి కెసిఆరే’ అన్నారు.ఇది అన్ని సభల్లో అందరు నాయకులు చేసేదే, చూసేదే.

మ్యాజిక్ ఏమయింది?

తెలుగు నాట రాజకీయాల్లో ఏ నాయకుడికి మ్యాజిక్ లేదా వశీకరణ శక్తి ఎక్కువ కాలం నిలవలేదు. తెలుగు రాజకీయాల్లోకి మ్యాజిక్ ఎన్టీరామారావుతో ప్రవేశించింది. అంతకు ముందు వశీకరణ శక్తి ఉన్ననేతలు కాంగ్రెస్ లో లేరనే చెప్పాలి. గొప్పవక్తలు ఉండవచ్చు గాక, జనాకర్షణ లేదు. చాలా మంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర భాసించారు. ఉంటే గింటే కమ్యూనిస్టు రాజకీయాల్లో మహావక్తలు ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీల మ్యాజిక్ తో జీవిస్తూ వచ్చింది. ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను అందించింది తప్ప మహనేతలను అందివ్వలేదు. అయితే, చాలా మంది ఇతర పార్టీల నేతలు అసెంబ్లీలో మంచి వక్తలు అనిపించుకున్నారు. వాళ్లెవరూ జనాన్ని తమ వైపు తిప్పుకుని తమపార్టీని అధికారంలోకి తెచ్చేంత సత్తా ఉన్నవాళ్లు కాలేకపోయారు.

కమ్యూనిస్టుపార్టీ మాత్రం ఎందరో మహనేతలను, వక్తలను అందించింది. 1980 నాటికి కమ్యూనిస్టు నేతల మ్యాజిక్ కూడా పోయింది. అప్పుడు తెలుగు నేల ఒక మ్యాజికల్ పవర్ ఉన్న నాయకుడికి ఎదురుచూస్తూఉందా అన్నట్లు తయారయింది. 1982లో ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం’ పార్టీ రూపంలో జనం ముందుకి వచ్చారు. ఆయన ఒక సుడిగాలి సృష్టించారు. రాజకీయాల్లోకి మాజికల్ పవర్ ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో కంటెంటు, పామ్ (content and form)ని మార్చేశారు.

రాజకీయాల్లో ఉపన్యాస కళ ప్రవేశం

ఎన్టీఆర్ ఉపన్యాసానికి ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రశక్తి ఉన్న మాటలను ప్రయోగించారు. రాజకీయాలను గొప్ప ప్రదర్శన కళగా మార్చారు. బస్సులు, లారీలతో తోలే అవసరం లేకుండా జనం ఈ మాటల మాంత్రికుడిని చూసేందుకు పరుగులుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలేలా చేశారు. ఆ దెబ్బ నుంచి కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేకపోయింది. అపుడుపుడు అధికారంలోకి వచ్చినా ఆ కాంగ్రెస్, పాత కాంగ్రెస్ కాదని అట్టే తెలిసి పోతుంది. ఇలాంటి జనవశీకరణ శక్తి ఉన్న ఎన్టీరామారావు మ్యాజిక్ కూడా ఎంతో కాలం నిలవలేదు.


ఎన్టీ రామారావు: ఉపన్యాస మాంత్రికుడు

1995 లో పార్టీ లో తిరుగుబాటు వచ్చింది. ఆయనను పదవినుంచి పక్కకీడ్చేశారు. అయితే, తెలుగు నాడు తల్ల డిల్ల లేదు. భూకంపం రాలేదు. నిరసన జ్వాలలులేవు. తాము బాహువులు బార్లాచాపి ఆలింగనం చేసుకుని ఆధికారం అప్పగించిన ప్రజలు ఎన్టీరామారావు ఆర్తనాదాలను పట్టించుకోనేలేదు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీ కొత్త అవతారమెత్తింది. అది వేరే కథ. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ తెలుగుదేశం పార్టీ పొత్తులు,ఎత్తులు, పై ఎత్తులు, ఫిరాయింపులు లేకుండా అధికారంలోకి వచ్చింది లేదు.

వైఎస్ ఆర్ ది మరొక రకం మ్యాజిక్

ఈ మధ్యలో అధికారంలోకి వచ్చిన వైఎస్ శేఖర్ రెడ్డి (2004-2009) కూడా కొంత మంత్ర శక్తి ప్రదర్శించారు. దానికి ఎన్టీరామారావు కున్న కళాత్మకత పొల్చలేం కాని, రాజశేఖర్ రెడ్డిలోకచ్చితంగా కాంగ్రెస్ నేతలెవరిలో లేని ఆకర్షణ శక్తి ఉంది. ఆయన సభలకు జనం పరుగులు తీశారు. రాజకీయాల్లోకి ఆయన కొత్త దనం తీసుకువచ్చారు. ఎవరికీ అంతవరకు తట్టని కొత్త పథకాలు తెచ్చారు. కొత్త ఎత్తులు వేశారు. ఆయనలో లేని ఉపన్యాస కళకి ఈ పథకాలు హంగునిచ్చాయి. దానికి తోెడు ఆయన పంచకట్టు, పలకరింపు, సాదాసీదా తనం ఆకర్షణను రెట్టింపు చేశాయి.


వైఎస్ రాజశేఖర్ రెడ్డిది తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ

ఆయన దెబ్బకి కెసిఆర్ తెలంగాణ గురించి మాట్లాడటం మానేశారు. నిజానికి అపుడే కెసిఆర్ మాజికల్ పవర్ తగ్గడం మొదలయింది. దాన్ని మళ్లీ సమకూర్చుకునేందుకు చాలా కష్ట పడ్డారు. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎమ్మెల్యేలతో, ఎంపిలతో రాజీనామ చేయించి ఉప ఎనికల్లో గెలిపించి తన నాయకత్వాన్ని నిరూపించుకోవలసి వచ్చింది. దీనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, రాజకీయఆకర్షణ లేని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు కావడం కూడా కెసిఆర్ కు కలసి వచ్చాయి. అపుడే తెలంగాణ ఉద్యమంలోకి జెఎసి (జాయింట్ యాక్షన్ కమిటీ) అనే ఒక మహత్తర వ్యూహం ప్రవేశించింది. ఇది తెలంగాణ ఉద్యమాన్నివూరూరికి, వీధివీధికి, ఇంటింటికి, కులకులానికి మనిషి మనిషికి తీసుకెళ్లింది. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వం భయపడేలా చేసింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరువేరింది. తర్వాత టిఆర్ ఎస్ కొత్త అవతారమెత్తంది.

1995 తర్వాత ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఏవిధంగా ఎత్తుల, పైఎత్తులతో మనుగడ సాగించిందో తెలంగాణ రాష్ట్ర సమితి పంథా కూడా అదే అయింది. ప్రత్యర్థి పార్టీలను మట్టు బెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం, తెలంగాణని కెసిఆర్ ఏకచ్ఛత్రాధిపత్యం కిందికి తెచ్చే ప్రయత్నం బాగా సాగాయి. ఉద్యమ కాలలో కెసిఆర్ లో కనిపించిన పదును తగ్గుతూ వచ్చింది. వెక్కిరించే ఉపన్యాసాలు, జోక్స్, అభ్యంతకర భాష, ప్రతిపక్ష పార్టీ నాయకులను మరుగుజ్జుల్లా చూడటంమొదలయింది, పార్టీ నేతలను గుర్తించకపోవడం, నవాబులా ప్యాలస్ లో లేదా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం అందరికీ తెలిసిందే. దీనికి రాజకీయ అధికారం బలం అండగా నిలిచింది. రాజకీయాధికారం ఆయనలో ఉన్న సహజ మంత్రశక్తి సన్నగిల్లిపోతున్న విషయాన్ని గుర్తించకుండా చేసింది. ఈలోపాన్ని కప్పిపుచ్చేందుకు సంక్షేమపథకాలు కూడా బాగా పనిచేశాయి. రెండోసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ వాతావరణ బాగా తోడయింది. ఈ ముసుగు తీసేసే మొనగాళ్లు అటు బిజెపిలో గాని, కాంగ్రెస్ లో గాని లేకుండా పోయారు.

అయితే, రెండో టర్మ్ మధ్యలో కెసిఆర్ కి సవాల్ ఎదురయింది. బిజెపి నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రావడంతో తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. మాటలతో, తిట్లతో నెట్టుకొచ్చే కెసిఆర్ కు అంతేమాటకారులు, అంతే తిట్ల భాష తెలిసిన ఇద్దరు నాయకులు పోటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు తిట్ల, బూతులు రాజకీయాలు అయ్యాయి. అయితే, ఈ గొడవ కెసిఆర్ లో జనాకర్షణ శక్తి ఆరిపోయిందని, మంత్రశక్తి మాయమైందని చాలా స్పష్టంగా వెల్లడించింది. కెసిఆర్ అంటే ‘మాటల మరాఠీ’ గా తరిగిపోయాడని అని అర్థమయింది. ఆయన ఉపన్యాసాలు పనిచేయడం మానేశాయి.మాటలు పదును తగ్గిపోయింది. కెసిఆర్ అంటే నవ్వుకోవడం మొదలయింది. ఆయన ఎత్తగడలు వీగిపోయాయి. సోషల్ మీడియా సటైర్ మొదలయింది. ఫలితంగా 2023, 2024 ఘోర పరాజయం ఎదురయ్యింది.

ఎందుకు ఘోర పరాజయం అంటే, ఆయన పోటీ చేసిన రెండో నియోజకవర్గం కామారెడ్డి లో పరాజయం ఎదురయింది. పార్లీ ఓటమి వల్ల ఆయన అసెంబ్లీలో కాలు మోపేందుకు కూడా జంకుతున్నారు. తనను ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు వూహించుకున్నా, జనం ఆయన్ని అందరిలాగా సాధారణ ఎమ్మెల్యేగా మార్చాయి. దీనితో ఆయన సభలో కాలుమోపలేని పరిస్థితి వచ్చింది.

ఎల్క తుర్తి సభకి రెండు రోజుల ముందు ఆయన కుమారుడు కెటి రామారావు చేసిన ప్రకటన ప్రజాస్వామిక స్ఫూర్తికి తగ్గట్టుగా లేదు. ఆ ప్రకటన తండ్రి హోదాని దిగజార్చింది. మళ్లీ ముఖ్యమంత్రిగానే కెసిఆర్ అసెంబ్లీలో అడుగు పోడతారని కెటిఆర్ ప్రకటించడం వింతగా లేదూ!

కెసిఆర్ నిన్నటి సభలో ప్రజస్వామ్యం గురించి మాట్లాడుతున్నపుడు, పోలీసుల దుష్ప్రవర్తను గురించి మాట్లాడినపుడు సభలో ఉన్న పిల్లలకు కూడా కెసిఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులు, ధర్నా చౌక్ రద్దు , ప్రొఫెసర్ కోదండరామ్ ని అరెస్టు చేసిన తీరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి దర్శనం చేసుకోలేకపోయిన తీరు... కళ్ల ముందు కదలుకుండా ఎలా ఉంటాయి? జనంలో కెసిఆర్ ఇమెజ్ తగ్గింది. ఆయన వూహారూపం కూడా బాగా చిక్కిపోయింది.ఈ నేపథ్యంలో బిఆర్ ఎస్ ఎల్క తుర్తి సభ ఒక కొత్త దిశ చూపుతుందని, కెసిఆర్ కొత్త ప్రొగ్రాం ప్రకటిస్తారని, పార్టీ కి కొత్త కార్యాచరణ అందిస్తారని... ఏవేవో ఉహాగానాలు వచ్చాయి.

కెసిఆర్ ఉపన్యాసం చప్పగా...

అయితే, తమ ప్రభుత్వం పదేళ్లలో ఎలా ‘బంగారు తెలంగాణ’ సృష్టించిందోచెప్పారు. అయితే, అదే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారునే నిజం ఇంకా పచ్చిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యలాలను ఆయన ఎండగట్ట లేకపోయారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేకపోయారు. "కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతున్నది, ఇపుడు హైదరాబాద్ యూనివర్శిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా భూములు అమ్ముతార,"ని అని అన్నా దానిని బల్ల గుద్ది ‘ఇది తప్పు’ అని చెప్పలేకపోయారు. ఎందుకంటే, ఉస్మానియా భూముల మీద ఆయన కన్నేయడం, దానికి పెద్ద ఎత్తున నిరసన రావడం అందరికీ తెలుసు. ఇక భూములు అంటారా.భూముల అమ్మకాలని తారాస్థాయికి తీసుకుపోయింది ఆయనే. అందుకే ఈ విమర్శను చేసిన వెంటనే ‘భూములు అమ్మడం తప్పుకాదు, నిధులు అవసరమయినపుడు భూములు అమ్ముకోవడం చేయవచ్చు,’ అని ఒక సమర్థన విసరాల్సి వచ్చింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కెసిఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడాలేదని రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి అన్నారు. ఇద్దరికి ఒకే విధానాలు, ఇద్దరివి రైతు వ్యతిరేక విధానలు, రైతుల నుంచి భూములు కాజేసే విధానాలే అని కన్నెగంటి అన్నారు.

నిజానికి కెసిఆర్ అభివృద్ధి నమూనాను చూసి ప్రజలు జడిసిపొవడం మొదలయింది. ‘కారు’ వస్తే భూములు పోతాయ’నే నినాదం మొదలయింది. కామారెడ్డి నియోజకవర్గంలో ఇది బాగా పనిచేసింది. కామారెడ్డి మునిసిపల్ మాస్టర్ ప్లాన్ చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడిపోయారు. ప్రభుత్వ భూములు వదిలేసి, ఒకటి రెండెకరాల పేదల భూములు తీసుకొంటున్నారని ఆందోళన చేశారు. మాస్టర్ ప్లాన్ చివరకు ఉపసంహరించుకోవలసి వచ్చింది. కారు వస్తే భూములు పోతాయన్న భయం ‘ధరణి యాప్’ వల్ల బాగా బలపడిపోయింది. ఇవింకా సలుపుతున్నాగాయాలే.

వీటిని మరపించి, పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు కెసిఆర్ కొత్త విషయాలు చెబుతారు అని అంతా భావించారు. కోట్లాది రుపాయలు వెచ్చించి జనాన్ని తరలించారు. దీనికి తగ్గట్లు కెసిఆర్ ప్రసంగం ఉంటుందనుకున్నారు. అలా జరగలేదు. ఆయన బిఆర్ ఎస్ గురించి గొప్పలు చెప్పలేకపోయారు. కారణం ఓడిపోయిన వాస్తవం ఇంకా పచ్చిగానే ఉంది. కాబట్టి గొప్పలు నమ్మరు. ‘కాంగ్రెస్ తెలంగాణకు విలన్’ అన్నారు. అది కూడా నమ్మేమాట కాదు. కాంగ్రెస్ తో ఆయనకు ఉన్న అనుబంధం అంతాయింతాకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో , కేంద్రంలో అధికారం పంచుకున్నారు. బలపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రికి పాదాభివందనం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ కు సోనియా కు అభినందనలు చెబుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రోజు మీకు నచ్చకపోతే, కాంగ్రెస్ విలన్ అవుతుందా అనే ప్రశ్న వచ్చేలా ఆయన మాట్లాడారు.

ఇలాగే ఆయన చెప్పిన విషయాలు ఏవీ ఆమోదయోగ్యంగా, ఆలోచింపచేసేవిగా లేవు. మాట తీరులో సూటిదనం లేదు. మాటల్లో పదును లేదు, పదాలు చప్పగా ఉన్నాయి. ఉపన్యాసంలో ఆయన ఒరిజనల్ టెంపోలేదు. మొత్తానికి కెసిఆర్ లో అంతా ఆశించిన మంత్ర శక్తి, వశీకరణ శక్తి కనిపించలేదు....ఏమయింది? 20యేళ్లకే పోయిందా? 2023 తోనే ఆ అధ్యాయం ముగిసిందా? లేదా రేపటికి దాచుకున్నారా?


Read More
Next Story