కేసీఆర్ కొడంగల్ లెక్క ఎక్కడ తప్పింది?
x
Revanth and KCR (source Twitter)

కేసీఆర్ కొడంగల్ లెక్క ఎక్కడ తప్పింది?

2018, డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో పోలీసులు రేవంత్ ఇంటి గోడలుదూకి ఇంట్లోకి ప్రవేశించారు.


విధి విచిత్రం అంటే ఇదే. తిట్టిన నోటితోనే పొగడాల్సొస్తుందనే నానుడిని అందరు వినుంటారు. కాస్త అటుఇటుగా మార్చుకుంటే కొడంగల్లో సోమవారం జరిగిందానికి సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే అనుముల రేవంత్ రెడ్డిది కొడంగల్ నియోజకవర్గమని అందరికీ తెలిసిందే. కొడంగల్ పట్టణంలో తనింటికి రేవంత్ రావటం ఆలస్యం అక్కడి పోలీసులు గాడ్ ఆఫ్ ఆనర్ కింద రేవంత్ కు సెల్యూట్ కొట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్ధిగా పోటీచేస్తున్న వంశీచంద్ రెడ్డి గెలుపుకోసం రేవంత్ స్ధానిక నేతలతో మీటింగ్ పెట్టారు. మండలాలవారీగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలంతా మీటింగుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన రేవంత్ కు పోలీసులు సెల్యూట్ కొట్టారు. రేవంత్ ఇంటిదగ్గర పోలీసులు గాడ్ ఆప్ ఆనర్ కింద సెల్యూట్ కొట్టడం ఇపుడు కొత్తేమీకాదు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి జరుగుతున్నదే. కాకపోతే సీఎం అయిన తర్వాత రేవంత్ ఎప్పుడూ నేతలు, ప్రజాప్రతినిధులతో ఇంటిదగ్గర మీటింగ్ పెట్టుకోలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే అంటే 2018, డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో పోలీసులు రేవంత్ ఇంటి గోడలుదూకి ఇంట్లోకి ప్రవేశించారు. తమను లోపలకి రానీయకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో సెక్యూరిటి గార్డును కొట్టి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు ఇంటి తలుపులను బద్దలుకొట్టి లోపలకు ప్రవేశించారు. రేవంత్ బెడ్ రూములో ఉంటే తలుపులు పగలగొట్టుకుని లోపలకు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా తనింట్లోకి ప్రవేశించటంపై పోలీసులకు, రేవంత్ కు మధ్య చాలా వాగ్వాదమే నడిచింది. అయినా రేవంత్ ను పోలీసులు లెక్కచేయకుండా తమతో పాటు తీసుకెళ్ళిపోయారు. రేవంత్ ఇంట్లో పోలీసులు చేసిన దాష్టికానికి చుట్టుపక్కల వాళ్ళే సాక్ష్యంగా నిలిచారు.

భయపడిన రేవంత్ కుటుంబం

తర్వాత రేవంత్ భార్య గీత మాట్లాడుతు తెల్లవారిజామును పోలీసులు తమింటి తలుపులను బద్దలు కొట్టుకుని ప్రవేశించినట్లు చెప్పారు. బెడ్ రూములో ఉన్న రేవంత్ ను అరెస్టుచేసి ఎక్కడికి తీసుకెళ్ళింది కూడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల కారణంగా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని భోరున ఏడ్చారు. కుటుంబసభ్యులు ఎంతగా ఏడ్చినా అరణ్యరోధనే అయ్యింది. అసలిదంతా ఎందుకు జరిగిందంటే అప్పటి ఎన్నికల్లో రేవంత్ సన్నిహితుల ఇళ్ళల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఖర్చులకు సన్నిహితుల ఇళ్ళల్లో డబ్బు దాచిపెట్టారన్నది ఆరోపణలు. దాచిపెట్టిన డబ్బుల కోసమే పోలీసులు సోదాలు చేశారు. అయితే ఆ సోదాల్లో ఏమీ దొరకలేదు. ఎంత వెతికినా ఏమీ దొరకలేదన్న కోపంతో కొందరిని పోలీసులు చితకబాదారు. దాంతో రేవంత్ కు మండిపోయి 4వ తేదీన కొడంగల్ బంద్ కు 3వ తేది సాయంత్రం పిలుపిచ్చారు.

సరిగ్గా 4వతేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారంకోసం కేసీయార్ కొడంగల్ పట్టణానికి వస్తున్నారు. ఒకవైపు కేసీయార్ బహిరంగసభ మరోవైపు రేవంత్ బంద్ పిలుపు. దాంతో పట్టణంలో ఉద్రిక్తపరిస్ధితులు పెరిగిపోయాయి. అందుకనే రేవంత్ ను అరెస్టుచేసినట్లు పోలీసులు ప్రకటించారు. కేసీయార్ రాకసందర్భంగా, బంద్ పిలుపు నేపధ్యంలోనే రేవంత్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మీడియాతో చెప్పారు.

ఎందుకు రేవంత్ ను టార్గెట్ చేశారు ?


అప్పట్లో రేవంత్ ను కేసీయార్ ఎందుకంత టార్గెట్ చేసినట్లు ? ఎందుకంటే ఎలాగైనా సరే రేవంత్ ను గెలవనీయకూడదని అనుకున్నారు. కారణం ఏమిటంటే రేవంత్ గెలిస్తే అసెంబ్లీలో ఫేస్ చేయాలి. అసలే జనాల్లో మంచి క్రేజున్న నేత పైగా మంచి వాగ్ధాటి ఉన్నది. చెప్పదలచుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పగలడు. ఓటుకునోటు అరెస్టు నేపధ్యంలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రేవంత్ అసెంబ్లీలో అడుగుపెడితే ఇంకేమైనా ఉందా అని కేసీయార్ అనుకునుంటారు. అప్పటికే అంటే 2014-18 మధ్యలోనే అసెంబ్లీలో కేసీయార్ ను రేవంత్ ఒక ఆటాడుకుంటున్నారు. అందుకనే నెలపాటు రేవంత్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా నిషేధం విధించారు.

ఇదంతా మనుసులో పెట్టుకునే అసలు అసెంబ్లీలోకే అడుగుపెట్టనీయకుండా చేయాలని రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. విచిత్రం ఏమిటంటే కేసీయార్ వల్ల ఎన్ని ఇబ్బందులుపడ్డారో కళ్ళారా చూసిన జనాలు రేవంత్ కు ఓట్లేయలేదు. కేసీయార్ ప్రయత్నాలు ఫలించి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 9,319 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొసమెరుపు ఏమిటంటే 2019 పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా గెలవటం.

Read More
Next Story