
బీసీ డిక్లరేషన్ అప్పుడు అసలు కవిత ఎక్కడున్నారు..?
మహేష్ కుమార్ చెప్పినట్లు తీహార్ జైలులో ఉన్నారా? లేదంటే ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు..?
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ నిర్ణయం తమ పోరాట ఫలమే అన్న కవిత వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అదే రేంజ్‌లో తోసిపుచ్చుతున్నారు కూడా. ఈక్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన పనికి కవిత క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కవితకు, బీసీ డిక్లరేషన్‌కు అసలు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. బీసీల కోసం కవిత ఏనాడు పోరాడారాని? ప్రశ్నలు సంధించారు. దీంతో రాష్ట్రమంతా ఒకటే చర్చ మొదలైంది. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ జరిగిన సమయంలో కవిత ఎక్కడున్నారు? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ దీని గురించే అంతా చర్చిస్తున్నారు.
కవిత తీహార్ జైలు ఊసలు లెక్కేస్తున్నారు?: మహేష్
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకారం అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించే సమయంలో కవిత.. తీహార్ జైలులో కటకటాలు లెక్కబెడుతున్నారు. ఇవే వ్యాఖ్యలు ఆయన చేశారు. “ఇది సామాజిక న్యాయానికి నాంది పలికే చారిత్రాత్మక ఆర్డినెన్సు. ఈ మైలురాయి నిర్ణయాన్ని ఆవిష్కరించిన సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నా” అని ఆయన తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, గతంలో తానే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ కవితపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మహేష్ గౌడ్, “బీఆర్ఎస్‌లో దెయ్యాల పీడ ఉందా? లేక దెయ్యాలే పనిచేస్తున్నాయా? కవిత సూటిగా చెప్పాలి. ఆమె ఏ పార్టీకి చెందినవారో ప్రజలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రకటించిన రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో ఆమె లిక్కర్ స్కామ్ ఊసులు లెక్కపెడుతున్నారు” అంటూ చురకలంటించారు.
నిజానికి కవిత ఎక్కడ ఉన్నారు..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను 10 నవంబర్ 2023న ప్రకటించింది. ఆ సమయంలో కవిత జైలులో లేరు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసింది 16 మార్చి 2024న. 15 మార్చి 2024న దాదాపు ఏడు గంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. ఆమెను తమ వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత 14 ఆగస్టు 2014న ఆమెకు బెయిల్ మంజూరు అయింది. ఈ లెక్కన చూసుకుంటే ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ సమయంలో కవిత.. మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టడం లేదు.
10 నవంబర్ 2023న కవిత ప్రతి కార్యకర్త, నేత తరహాలోనే ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఆ రోజున ఆమె.. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతని నామినేషన్ సందర్భంగా తమ పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తుకు నమూనాగా గులాబీ రంగు అంబాసిడర్ కారును ఆమే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెల్లారు. ఆ రోజంతా కూడా ఆమె పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు.