తెలంగాణా ఎన్నికలపై సీమాంధ్రుల దెబ్బ
x
people travelling from Hyderabad to Seemandhra for voting

తెలంగాణా ఎన్నికలపై సీమాంధ్రుల దెబ్బ

గ్రేటర్ పరిధిలో సుమారు 40 లక్షలమంది సీమాంధ్రులు నివసిస్తున్నారు. గ్రేటర్ పరిధి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ పార్లమెంట్ సీట్లు వస్తాయి.


ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికలు తెలంగాణా ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటున్న సీమాంధ్రులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకనే హైదరాబాద్ నుండి ఏపీలోని తమ సొంతూళ్ళకు వెళ్ళటానికి జనాలు గురువారం నుండే రెడీఅయిపోయారు. 11, 12 తేదీలు అంటే శని, ఆదివారాలు సెలవురోజుల్లవటం, 13వ తేదీ పోలింగ్ కారణంగా ఎలాగూ సెలవే. శుక్రవారం సెలవు పెట్టుకుంటే మొత్తం నాలుగురోజులు కలిసొస్తుంది. అందుకనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలమంది గురువారం సాయంత్రం నుండే ఏపీలోని తమ సొంతూళ్ళకి బయలుదేరి వెళిపోతున్నారు. ఈ కారణంతోనే గురువారం నుండి ట్రాఫిక్ కూడా తగ్గుతోంది. ఇక అసలు విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో సుమారు 40 లక్షలమంది సీమాంధ్రులు నివసిస్తున్నారు. గ్రేటర్ పరిధి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళతో పాటు కొంతవరకు మెదక్ పార్లమెంటు పరిధి కూడా వస్తుంది.

2019 ఎన్నికల వరకు ఏపీ, తెలంగాణాలో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండేదికాదు. 2014లో అయినా తర్వాత జరిగిన ఎన్నికలు అయినా రెండు రాష్ట్రాల్లోను వేర్వేరు రోజుల్లో జరిగేది. కాబట్టి తెలంగాణాలోని సీమాంధ్ర ఓటర్లు రెండు రాష్ట్రాల్లోను తమ ఓట్లను వేసేవారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా తెలంగాణా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకరోజు పోలింగ్ జరిగితే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి ఇంకోరోజు పోలింగ్ జరిగింది. 2014లో కూడా తెలంగాణాలో పోలింగ్ ముగిసిన వారంరోజులకు ఏపీలో ఎన్నికలు జరిగాయి. దీనివల్ల తెలంగాణాలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఓట్లేసిన జనాలు తీరిగ్గా ఏపీకి వెళ్ళి ఓటింగులో పాల్గొన్నారు. 2018 అసెంబ్లీకి తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగిన కారణంగా కూడా సీమాంధ్రులు రెండు రాష్ట్రాల్లోను ఓట్లేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కొందరు ఓటర్లు సీమాంధ్రవైపు మొగ్గుచూపారు.

తెలంగాణా, ఏపీలో డబుల్ ఓట్ల(డూప్లికేట్ ఓట్లు)ను ఏరేయాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమీషన్ కు 2023, డిసెంబర్ 15వ తేదీన ఫిర్యాదు చేశారు. ‘రెండు రాష్ట్రాల్లోను డబుల్ ఓట్లు లక్షల్లో ఉన్న’ట్లు ఎంపీ చెప్పారు. ‘బోగస్, డబల్ ఓట్లు సుమారు 40 లక్షల దాకా ఉన్న’ట్లు ఆయన కమీషన్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇదే విధమైన ఫిర్యాదును టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా చేశారు. ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ జనవరి 10వ తేదీన విజయవాడలో మాట్లాడుతు ‘రెండు చోట్ల ఓట్లుండటం క్రిమినల్ నేరంకిందకు వస్తుంద’ని హెచ్చరించారు. కాబట్టి ‘డబుల్ ఓట్లున్న వాళ్ళంతా స్వచ్చంధంగా ఒకచోట ఓటును వదులుకోవాల’ని అప్పీల్ చేశారు. అలాగే ఏప్రిల్ 12వ తేదీన సంగారెడ్డిలో మేస్త్రీభవన్ శంకుస్ధాపన సందర్భంగా అప్పటి మంత్రి హరీష్ రావు మాట్లాడుతు ‘తెలంగాణా, ఏపీలో ఉన్న ఓట్లను రద్దుచేసుకోవాల’ని కార్మికులకు అప్పీల్ చేశారు. ‘భవన నిర్మాణ కార్మికుల్లో చాలామందికి తెలంగాణాతో పాటు ఏపీలో కూడా పెద్దసంఖ్యలో ఉన్న’ట్లు హరీష్ చెప్పారు. కాబట్టి ‘ఏపీలో ఓట్లను రద్దుచేసుకుని తెలంగాణాలో మాత్రమే ఉంచుకోవాల’ని విజ్ఞప్తిచేశారు.

ఈసారి 13వతేదీన తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకనే తెలంగాణాలోని సీమాంధ్ర జనాలు తెలంగాణా పార్లమెంటు ఎన్నికలను వదిలేసి ఏపీలో జరగబోయే రెండు ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఏపీ ఎన్నికలు సింగిల్ లైన్ మీదే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో విడుదలచేస్తే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే మ్యానిఫెస్టోలు, ప్రభుత్వ పనితీరు చూసి ఓట్లేయటం పక్కకుపోయింది. జరగబోయే ఎన్నికలు జగన్ అధికారంలో ఉండాలా ? వద్దా అనే సింగిల్ లైను మీదే జరగబోతోంది. తెలంగాణా, ఏపీలో పార్లమెంటు ఎన్నికలు కామన్ అయినా ఏపీలో అదనంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటమే తెలంగాణాలోని సీమాంధ్రులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ఏపీలో ఓట్లేయటానికి తెలంగాణా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులు వెళుతుండటం వల్ల ఇక్కడ ఎన్నికల మీద ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ తగ్గిపోతోందంటే దాని ప్రభావం ఏ పార్టీ మీద, ఏ అభ్యర్ధి మీద పడుతుందో అర్ధంకావటంలేదు. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ, మెదక్ నియోజకవర్గాల్లో గెలుపును మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపధ్యంలో సుమారు 40 లక్షల మంది ఓటింగుకు దూరంగా ఉండటం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పాలి.


ఓటింగ్ శాతం పెంచాలని ఒకవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ నెత్తి నోరు మొత్తుకుంటున్నది. తగ్గిపోతున్న ఓటింగ్ శాతాన్ని పెంచటానికి కమీషన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. యంగ్ ఇండియా, యంగిస్ధాన్ లాంటి అనేక స్వచ్చంధ సంస్ధలతో కలిసి తగ్గిపోతున్న ఓటింగును పెంచటానికి చాలా కార్యక్రమాలను చేస్తోంది. పనిలోపనిగా ఓటింగ్ సమయాన్ని కూడా పెంచింది. ఇంతకుముందు ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసేది. 13వ తేదీన జరగబోయే పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలదాకా జరుగుతుంది. అంటే ఓటింగ్ శాతం పెంచటానికి కమీషన్ పోలింగ్ సమయాన్ని సాయంత్రం గంటసేపు పొడిగించింది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 50 శాతం మాత్రమే నమోదైంది.

ఇదే విషయమై ఉబెర్ లో పార్టనర్ గా పనిచేస్తున్న రామకృష్ణ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ఎన్నికల్లో ఓటేసేందుకు శనివారం బయలుదేరి కాకినాడకు వెళుతున్నట్లు చెప్పాడు. తెలంగాణాలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగుతున్నాయి కదాని అడిగితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యమన్నారు. కాకినాడ నుండి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న చాలామంది పోలింగ్ కోసం బయలుదేరుతున్నట్లు చెప్పాడు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, సనత్ నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మలక్ పేట నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నట్లు రామకృష్ణ చెప్పాడు. ఏపీకి వెళ్ళే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ఆర్టీసీ ప్రత్యేకంగా 700 బస్సులు అదనంగా వేస్తే ఏపీ కూడా 1200 బస్సులను ఏర్పాటుచేసింది. అలాగే ప్రత్యేక రైళ్ళు కూడా నడుస్తున్నాయి. ఏపీకి వెళుతున్న ప్రత్యేక రైళ్ళు, వేలాది ప్రత్యేక బస్సులను చూస్తేనే తెలంగాణాలో ఎన్నికలపై ఏ మేరకు ఎఫెక్టు పడుతుందో అర్ధమైపోతోంది.

Read More
Next Story