తెల్ల రేషన్ కార్డుల పంపిణీపై ఉత్తకుమార్ క్లారిటీ
x
Source: Twitter

తెల్ల రేషన్ కార్డుల పంపిణీపై ఉత్తకుమార్ క్లారిటీ


తెలంగాణ పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డు అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ, ఎవ్వరికీ అన్యాయం చేయదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిపాలన కాంగ్రస్‌తోనే సాధ్యమవుతుందని, అందుకే ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగిస్తుందని వ్యాఖ్యానించారు. ఎంత కాకున్నా 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఈరోజు నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ కల కల్లగానే మిగులుతుందని, వాళ్లను ప్రజలు మళ్లీ నమ్మరని, వారి నిజస్వరూపం ఏంటో ప్రజలు చూశారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగింది
తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందులో ఎటువంటి సందేహం లేదని వెల్లడించారు. ‘‘నా ఫోన్ వందకు వందశాతం ట్యాపింగ్‌కు గైరైంది. దీని వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా శిక్ష పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు సంస్థలు దూకుడుగా దర్యాప్తు చేస్తున్నాయి. దీని వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది. అందుకే బీఆర్ఎస్ భయపడుతోంది. ఇప్పటికే కూతురు ఒక కేసులో, గొర్రెల స్కాం కేసులో మరికొందరు ఇరుక్కుపోయారు. దీంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ కేసు ఎవరిని లోపలకు పంపుతుందో అని బీఆర్ఎస్ వణుకుతోంది. ఈ విషయంలో తప్పు చేసిన వారికే శిక్ష పడుతుంది. తప్పు చేయని ఎవరికీ ఏమీ కాదు. కాబట్టి తప్పు చేసిన వాళ్లే భయపడతారు’’అని బీఆర్ఎస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.
కాంగ్రెస్‌లో చేరడానికి అంతా సిద్ధం
కాంగ్రస్‌లో జరుగుతున్న చేరికలపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరడానికి ప్రతిపక్ష నేతలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘‘మా పాలన చూసే ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరడానికి క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి రెడీ అంటున్నారు. ఇతర పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ చేరడానికి చర్చలు చేస్తున్నారు. చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు’’అని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
డిపాజిట్లు కూడా కష్టమే
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు దొరకడం కూడా కష్టమేనని, అవి లభించినా వాళ్లు సంబరాలు చేసుకోవచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ చక్రం తిప్పుతుందని, రాష్ట్రంలో 14 సీట్లు తప్పకుండా కాంగ్రెస్‌కే వస్తాయని అన్నారాయన. ‘‘బీఆర్ఎస్‌ను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్లు అధికారం నుంచి తప్పుకునే సరికి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో తాగునీటి, కరెంటు సమస్యలు తీరాయి. మేము కేసీఆర్ మాదిరిగా ఫాం హౌస్‌లో పడుకునే నేతలం కాదు. ప్రజల సమస్యల తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తాపత్రయపడే వాళ్లం. అందుకోసమే ప్రతి రోజూ మేము సచివాలయానికి వస్తున్నాం. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నాం. దాదాపు అన్ని సమస్యలపై ప్రతి వారం పది రోజులకు సమీక్షిస్తున్నాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాబాయించే వారు. అందుకే ఆయనను నమ్మడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. మా అధికారంలో అలా కాదు’’అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని, అన్ని పథాకలు లబ్ది దారులకు చేరువవుతాయని వెల్లడించారు.
Read More
Next Story