‘రిజర్వేషన్ల కేసును వెనక్కు తీసుకునేది లేదు’
x
Buttem with leaders of various parties

‘రిజర్వేషన్ల కేసును వెనక్కు తీసుకునేది లేదు’

రాజకీయంగా బుట్టెంగారి మాధవరెడ్డి పేరు అన్నీ రాజకీయ పార్టీల్లోను మారుమోగిపోతోంది


బుట్టెంగారి మాధవరెడ్డి..ఈ పేరు ఇపుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు 42శాతంకు వ్యతిరేకంగా కేసువేసింది బుట్టెంగారి మాధవరెడ్డే. బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తు ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ 9 పై హైకోర్టు(Telangana High Court) స్టే విధించింది. హైకోర్టు ఎందుకు స్టే విధించింది అంటే బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు కారణంగానే. మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదన్న సుప్రింకోర్టు(Supreme Court) తీర్పుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం జారీచేసిన జీవో 9 జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జీవో జారీచేసిన వెంటనే బుట్టెంగారి హైకోర్టులో కేసు దాఖలుచేశాడు. ఈకేసును మాధవరెడ్డి తరపున లాయర్ మయూర్ రెడ్డి దాఖలుచేశారు. బుట్టెంగారి కేసు దాఖలుచేసిన కారణంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మోయిద్దీన్ ధర్మాసనం కేసును విచారించింది. అన్నీవైపుల నుండి వాదనలు విన్న కోర్టు జీవో 9 అమలుపై స్టే విధించింది.

ఇపుడు విషయం ఏమిటంటే రాజకీయంగా బుట్టెంగారి మాధవరెడ్డి పేరు అన్నీ రాజకీయ పార్టీల్లోను మారుమోగిపోతోంది. కారణం ఏమిటంటే కొంతమందేమో రేవంత్ రెడ్డే బుట్టెంగారితో చెప్పి కేసు వేయించాడని ఆరోపిస్తున్నారు. మరికొందరేమో బుట్టెంగారి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సన్నిహితుడు కాబట్టి ఆమే కేసు వేయించారని అంటున్నారు. మరికొందరేమో కేసీఆర్ కు సన్నిహితుడు కాబట్టి మాధవరెడ్డితో చెప్పించి బీఆర్ఎస్సే కేసు దాఖలు చేయించిందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. విషయం ఏదైనా మాధవరెడ్డి పేరైతే ఇపుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది వాస్తవం. ఇంతకీ బుట్టెంగారి మాధవరెడ్డి ఎవరు ? ఎవరంటే రెడ్డి జాగృతి అనే సంస్ధకు అధ్యక్షుడు. ఈ సంస్ధను రెడ్డి 2016లో పెట్టాడు.

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతానికి చెందిన బుట్టెంగారి ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉన్నాడు. ‘8తెలంగాణ ఫెడరల్’’ తో బుట్టెంగారి మాట్లాడుతు ‘‘తనకు అన్నీపార్టీల్లోని నేతలతో సంబంధాలున్న’’ట్లు చెప్పాడు. ‘‘2016 వరకు తాను తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పనిచేసిన’’ట్లు చెప్పాడు. ఉద్యమపార్టీ టీఆర్ఎస్ ను కేసీఆర్ 2016లో రాజకీయ పార్టీగా మార్చిన విషయాన్ని గుర్తుచేశాడు. ‘‘ఉద్యమపార్టీ రాజకీయపార్టీగా మారేంతవరకు తాను ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న’’ట్లు వివరించాడు. ‘‘ఆతర్వాత ఉద్యమం నుండి పక్కకు జరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్న’’ట్లు చెప్పాడు. ‘‘ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్నపుడు తనకు అందరితోను పరిచయాలు ఉండేవని ఇప్పుడైతే ప్రత్యేకించి ఏ ఒక్కరితోను తనకు సంబంధంలేద’’న్నారు. అయితే గతంలో రేవంత్, కేసీఆర్, కిషన్ రెడ్డి, కవిత, హరీష్ తో బుట్టెంగారి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి.

‘‘మయూర్ రెడ్డి లాంటి ఖరీదైన లాయర్ ను నియమించుకుని కేసు దాఖలు చేసేంత ఆర్ధికశక్తి తనకు లేద’’ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే ‘‘మిగిలిన వాళ్ళదగ్గర ఫీజు తీసుకునేట్లు కాకుండా సోషల్ కాజ్ మీద కేసు వేస్తున్నాను కాబట్టి మినిమం ఫీజు తీసుకుని కేసు దాఖలు చేయటానికి మయూర్ రెడ్డి అంగీకరించిన’’ట్లు చెప్పాడు. ‘‘బీసీల రిజర్వేషన్ల జీవోకు వ్యతిరేకంగా కేసు దాఖలుచేసినందుకు చాలామంది ప్రతిరోజు ఫోన్లుచేసి తిడుతున్నార’’ని కూడా మాధవ్ చెప్పాడు. వెంటనే కేసు వాపసుతీసుకోవాలని ప్రతిరోజు ఫోన్ చేసి చాలామంది బూతులు తిట్టి బెదిరిస్తున్నార’’ని చెప్పాడు. కేసును ఎట్టి పరిస్ధితుల్లోను వాపసుతీసుకునేది లేద’’ని కూడా అన్నాడు. ‘‘మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదన్నది మాత్రమే తన ఆలోచన అని, రాజకీయంగా ఎవరూ తనతో చెప్పి కేసు వేయించలేద’’ని బుట్టెంగారి మాధవరెడ్డి స్పష్టంచేశాడు.

Read More
Next Story