
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టిన సుస్మిత ఎవరు ?
వృత్తిరీత్యా డాక్టర్ అయిన సుస్మిత మంత్రి కొండాసురేఖ(Konda Surekha) కూతురు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పరిస్ధితులు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఒకవైపు మంత్రి కొండాసురేఖ, కొండా మురళి మరోవైపు ముగ్గురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, సీనియర్ నేతలు మోహరించారు. మంత్రితో అమీతుమీ తేల్చుకునేందుకు ఎంఎల్ఏల వ్యతిరేకవర్గం సిద్ధపడింది. అందుకనే రెండుగ్రూపుల్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటు, సవాళ్ళు విసురుకుంటు ఇటు ఎనుముల రేవంత్ రెడ్డిని అటు పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజ(Meenakshi Natarajan)న్ ను ఇరకాటంలో పడేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ‘రాబోయే ఎన్నికల్లో పరకాల ఎంఎల్ఏ అభ్యర్ధి’ అని సుస్మిత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో చిచ్చు మొదలైంది. ఇంతకీ ఈ సుస్మిత ఎవరు ? ఆమె పెట్టిన పోస్టు జిల్లా కాంగ్రెస్ లో ఎందుకింKతగా సంచలనమైంది ?
సుస్మిత పూర్తిపేరు కొండా సుస్మితా పటేల్(Konda susmita Patel). వృత్తిరీత్యా డాక్టర్ అయిన సుస్మిత మంత్రి కొండాసురేఖ(Konda Surekha) కూతురు. చిన్నపటి నుండి ఇంట్లోని రాజకీయ వాతావరణాన్ని చూస్తునే పెరిగింది. అందుకనే వృత్తిరీత్యా డాక్టర్ అయినా మనసంతా రాజకీయాలవైపే లాగుతోంది. అందుకనే తొందరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యింది. నిర్ణయం తీసుకోవటమే ఆలస్యం రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం అభ్యర్ధిగా టికెట్ కోసం ప్రయత్నిస్తానని సోషల్ మీడియా ఖాతాలో పోస్టుపెట్టింది. ఇంకేముంది ఈ పోస్టుకు అనుకూలంగా, వ్యతిరేకంగా దుమారం రేగుతోంది.
వ్యతిరేకంగా గోలవటానికి కారణం ఏమిటంటే ఇపుడు పరకాల నియోజకవర్గం ఎంఎల్ఏగా రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. రేవూరి టీడీపీలో ఉన్నప్పటినుండి రేవంత్(Revanth) కు గట్టి మద్దతుదారుడు. ఇపుడు మంత్రి కొండాసురేఖ వ్యతిరేకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. రేవూరికి కొండా దంపతులకు ఏమాత్రం పడటంలేదు. ఇలాంటి రేవూరి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గంలో పోటీచేయటానికి మంత్రి కూతురు సుస్మిత ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న విషయం బయటపడితే వ్యతిరేకవర్గం మౌనంగా ఎందుకుంటుంది ? పరకాలలో పోటీకి కూతురుని మంత్రే ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం, ఆరోపణలు పెరిగిపోవటంతో పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది. రేవూరిని దెబ్బకొట్టేందుకే మంత్రి తన కూతురును రాజకీయాల్లోకి దింపుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే వ్యతిరేకవర్గం మరింత అలర్టయిపోయి కొండా దంపతులను మరింతగా వ్యతిరేకిస్తోంది.
కూతురు సుస్మిత పెట్టిన పోస్టుపై మంత్రి మాట్లాడుతు తన భవిష్యత్తును డిసైడ్ చేసుకోవటానికి తనకూతురు సుస్మితకు అన్నీ విధాలుగా హక్కుందని అన్నారు. కూతురు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటే వద్దని చెప్పటానికి తాము ఎవరం ? అని మంత్రి అమాయకంగా ప్రశ్నించారు. తన భవిష్యత్తు తననిర్ణయం అని మంత్రి తేల్చేశారు. ఇదే విషయమై తండ్రి కొండా మురళి(Konda Murali) మాట్లాడుతు రాజకీయ ప్రవేశంపై తన కూతురు ఎందుకు ప్రకటన చేసిందో తమకు తెలీదన్నారు. ఏదేమైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కొండా దంపతులు స్పష్టంచేశారు.
కూతురు రాజకీయ ప్రవేశంగురించి తమకు తెలీదని, భవిష్యత్తు నిర్ణయించుకునే హక్కు తమ కూతురుకు ఉందని మంత్రి ఎంత సమర్ధించుకుందామని అనుకున్నా సాధ్యంకాదు. ఎందుకంటే తల్లి,దండ్రులతో ముందుగా మాట్లాడకుండానే కూతురు పరకాలలో పోటీగురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టే అవకాశాలు లేవని చాలామంది భావిస్తున్నారు. తమ ప్రత్యర్ధి క్యాంపులోని రేవూరిని దెబ్బకొట్టేందుకే కూతురును మంత్రి రంగంలోకి దింపుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2009లో పరకాల నియోజకవర్గంలో కొండాసురేఖ గెలిచిన విషయం తెలిసిందే. అందుకనే పరకాల నియోజకవర్గంలో తమకు గట్టిపట్టుందని కొండా దంపతులు పదేపదే ప్రకటనలు చేస్తున్నది. జిల్లాలో చాలామంది నేతలు కొండా దంపతులనే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది కూతురు కొండా సుస్మిత కూడా తల్లి, దండ్రులకు తోడయితే ఇంకేమన్నా ఉందా ?