కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎవరి వాదన వాస్తవం..?
x

కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎవరి వాదన వాస్తవం..?

జ్యూడిషియల్ కమిషన్‌కు అబద్ధం చెప్పడంలో ప్రతిపక్షాలకు ఉన్నంత స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండదు.


తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశం కాకరేపుతోంది. అసలు కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయా లేదా? అన్న అంశం కన్నా ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో ఎవరు నిజం చెప్తున్నారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అటు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం చెప్పే విషయాలు, ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న విషయాలు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై క్యాబినెట్ సమావేశాలు జరగలేదని కాంగ్రెస్ చెప్పడం, అసలు పీసీ ఘోష్ కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తుందే కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ విమర్శించడం అధికమైంది. ఇంతలో పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి వెల్లడం.. 100 పేజీల అదనపు సమాచారాన్ని అందించడం కీలకంగా మారితే.. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ విషయంలో క్యాబినెట్ ఆరుసార్లు ఆమోదం తెలిపిందని హరీష్ రావు వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయమే అత్యంత కీలకంగా మారింది.

విచారణలో ఈ విషయం ఎందుకు చెప్పలేదు..?

జూన్ 9న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్.. హరీష్ రావును విచారించింది. ఆ సమయంలో కూడా హరీష్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో క్యాబినెట్ ఆరుసార్లు ఆమోదం తెలిసిందని, అసెంబ్లీలో మూడుసార్లు ఆమోదం పొందిందని చెప్పలేదు. క్యాబినెట్ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం చేపట్టామని మాత్రమే హరీష్ రావు చెప్పారు. కానీ ఈసారి మాత్రం అదనపు సమాచారం అందించడం కోసం వీళ్లే సమయం అడిగి మరి.. కమిషన్ ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న డాక్యుమెంట్‌ను కమిషన్‌కు సమర్పించారు. అనంతరం బయట మాట్లాడుతూ.. క్యాబినెట్ ఆరుసార్లు, అసెంబ్లీ మూడు ఆమోదం ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని హరీష్.. విచారణ సమయంలో ఎందుకు చెప్పలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా పీసీ ఘోష్ కమిషన్‌ను తప్పుదోవ పట్టించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా హరీస్ రావు విమర్శలు చేశారు.

కమిషన్‌ను ప్రభుత్వం ఎందుకు పక్కదారి పట్టిస్తుంది?

అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయని భావించి.. విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేసిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వమే.. తాము వేసిన కమిషన్‌‌ను విచారణ విషయంలో పక్కదారి పట్టిస్తుంది? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. అందులో జుడీషియల్ కమిషన్ విషయంలో.. ఆటలు కాదని ప్రతి ప్రభుత్వానికి తెలుసు. ఏమాత్రం అటుఇటు అయినా.. కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని వివరాలకు ప్రభుత్వం కమిషన్‌కు అందించాల్సిందే. వాటిలో అవకతవకలు చేయడం కుదరనిపని. ఈ విషయాలు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌కు తెలియవా? అని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

క్యాబినెట్ సమావేశాలు ఎక్కడ జరిగాయి..?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆరుసార్లు ఆమోదం తెలిసిందని హరీష్ రావు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఒక్కసారి జరిగినట్లు కూడా చెప్పట్లేదు. అంతేకాకుండా మంత్రి సమావేశాలకు సంబంధించి మినిట్ బుక్స్ అన్నిటినీ ఇప్పటికే కమిషన్‌కు కూడా సర్కార్ సమర్పించింది. మినిట్ బుక్స్ అనేవి బీఆర్ఎస్ హయాంలో రాసినవే కాబట్టి.. వాటిలో ఇప్పుడు మార్పులు చేయడం, చెరిపేసి వేరేగా రాయడం అనేది జరిగే పని కాదు. కాబట్టి.. ఉన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నట్లు ఆరు సార్లు కాకపోయినా.. ఒక్కసారైనా క్యాబినెట్ సమావేశం జరగడం, కాళేశ్వరంకు ఆమోదం తెలపడం జరగాలి కదా..! ఆ విషయాన్ని ప్రభుత్వం.. కమిషన్‌కు చెప్పాలి కదా? ఎందుకు అలా ఏమీ లేదు అని చెప్తుంది? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ఎవరి వాదన వాస్తవం అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే విధంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే సదరు దస్త్రాలపై ప్రతి మంత్రి సంతకం ఉంటుంది. అప్పుడు కేసీఆర్ క్యాబినెట్‌లో, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్‌లో కూడా ఉన్న ఏకైక నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు. ఆయన సైతం ‘క్యాబినెట్ అప్రూవల్‌కు కాళేశ్వరం ఒక్కసారి కూడా రాలేదు. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లు మాత్రమే క్యాబినెట్ దృష్టికి వచ్చాయి’ అని తేల్చి చెప్పారు. మరి క్యాబినెట్‌లోని మంత్రికి కూడా తెలియకుండానే కాళేశ్వరంకు ఆనాటి మంత్రివర్గం ఆరుసార్లు ఆమోదం తెలిపిందా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం అబద్ధమాడటం అంత ఈజీ కాదు..!

బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు జ్యూడిషియల్ కమిషన్‌కు అబద్ధం చెప్పడంలో ప్రతిపక్షాలకు ఉన్నంత స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే.. ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉండాలి. మర్చిపోయాను, పొరబడ్డాను వంటి సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకే ఒకటికి వందసార్లు చూసుకుని పక్కా లెక్కలు, సమాచారంతో ప్రభుత్వం వివరాలను అందిస్తుంది. అదే ప్రతిపక్షాలు విషయానికి వస్తే.. వారికి ఇలాంటివి ఏమీ ఉండవు.. ఒకవేళ ఇదే అంశంపై రానున్న రోజుల్లో.. ఆరుసార్లు క్యాబినెట్ ఆమోదం తెలపలేదు కదా.. అని కమిషన్ ప్రశ్నిస్తే.. మేము పొరపాటు పడ్డాం అని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతులు దులిపేసుకోవచ్చు. కానీ ఇంతటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి కమిషన్‌కు ఇచ్చే సమాచారం విషయంలో ప్రభుత్వం పక్కాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story