ఎవరీ మావోయిస్టు నేత హిడ్మా!  పోలీసులు ఎందుకు చుట్టుముట్టారు?
x
పోలీసులు విడుదల చేసిన హిడ్మా ఫెల్ ఫోటో

ఎవరీ మావోయిస్టు నేత హిడ్మా! పోలీసులు ఎందుకు చుట్టుముట్టారు?

ఛత్తీస్ఘడ్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలను హడలెత్తిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, గెరిల్లా పోరాట వ్యూహకర్త హిడ్మా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.


2021 నాటికి ఆయనపై ఉన్న కేసులు 31, 2022 నాటికి 36, 2023 ముగిసే నాటికి దాదాపు 40.. ఏటికేడాది పెరిగిపోతున్న కేసులు.. దండకారణ్యంలో హడలెత్తిస్తున్న ఎదురుకాల్పులు.. పోటాపోటీ చావులు.. వీటన్నింటి వెనుకున్న ఏకైక నాయకుడే మడివి హిడ్మా.. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన పేరన్నా, ఊరన్నా హడలిపోయే పోలీసులు ఇప్పుడా ఊరిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎర్రజెండాలు రెపరెపలాడే ఆ ఊళ్లో ఇప్పుడు సైన్యం సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. మావోయిస్టులకు సవాల్ విసిరింది. మావోయిస్టుల ఆట కట్టించేందుకు సన్నద్ధమైంది.

మడివి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ సొంత ఊరైన పూవర్తి దండకారణ్యంలో ఆదివారం జాతీయ జెండా రెపరెపలాండింది. ఇంతకాలం ఎర్రజెండాలు కనిచించిన చోట ఎట్టకేలకు జాతీయ జెండా ఎగిరింది. ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుకొండస్టేషన్‌ పరిధిలో ఈ పూవర్తి గ్రామం ఉంది. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు సందర్భంగా తొలిసారి గ్రామంలో జాతీయ జెండాను ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ఎగుర వేశారు. మావోయిస్టు కంచుకోటలాంటి ఈ ప్రేతంలో... హిడ్మాను పట్టుకొవడమే లక్ష్యంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్ఘడ్ ప్రాంతంలో జరిగిన ప్రతి పేలుడు వెనుక హిడ్మా ఉన్నారనేది పోలీసుల అనుమానం. అనేక మంది పోలీసులను హతమార్చిన హిడ్మా తలపై సుమారు 45 లక్షల రివార్డు ఉంది.

ఇంతకీ ఎవరీ హిడ్మా...

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన మరో నక్సలైట్ల దాడిలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ మరణించారు. ఈ దాడిలో పోలీసుల దృష్టిలో అరివీర భయంకరమైన నక్సల్ కమాండర్ హిడ్మా ప్రమేయం ఉందనేది పోలీసుల అనుమానం. దీంతో ఆయన్ను ఎలాగైనా పట్టుకోవాలని సీఆర్పీఎఫ్ పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఈ నక్సలైట్ ఉద్యమ నాయకుణ్ణి వీలయితే పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టడం లేదంటే పూర్తిగా లేకుండా చేయడానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు బోలెడంత ఆసక్తి చూపిస్తున్నారు. బీజాపూర్‌లో జరిగిన నక్సలైట్ల ఆకస్మిక దాడిలో 23 మంది జవాన్లు మరణించి, 31 మంది గాయపడిన రెండు రోజుల తర్వాత, 2021 ఏప్రిల్ 5న మొదటిసారిగా హిడ్మా పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఆ తరువాత చత్తీస్‌గఢ్ లో జరిగిన ప్రతి పేలుడు వెనుకా ఆయన పేరే వినపడింది.

హిడ్మా కనిపించినా, కనిపించకపోయినా సంచలమే...

చత్తీస్‌గఢ్ లోని దట్టమైన అరణ్యాలలో, లోతైన ప్రాంతాలలో హిడ్మా కనిపించినా కనిపించకపోయినా ఆయన నీడ, జాడ కనిపిస్తుంది. ప్రతి హత్యాకాండలో పోలీసులు ఆయన పేరునే బయట పెడతారు. చాలామంది పోలీసులకు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు. అయినా అటు పోలీసులు గాని ఇటు మావోయిస్టులు గాని పరస్పర వేట మానలేదు. పోలీసు బలగాలను వెంబడించడం అంటే హిడ్మా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని ప్రతీతి. బస్తర్‌లో మావోయిస్టు ఉద్యమాన్ని భుజాలపై వేసుకున్నాడు. తనను తాను హిడ్మాగా పిలుచుకునే వ్యక్తి. ఎన్ని మారుపేర్లు ఉన్నాయో తెలియదు. సంతోష్, అలియాస్ దేవా అనే పేర్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే రాజ్యం పై యుద్ధం చేసేందుకు తుపాకీ పట్టే ముందు ఆయన ఎవరో, ఏమిటో వారికి తెలియదు. హిడ్మాకు 50 ఏళ్లుపైన్నే ఉంటాయి. పొట్టిగా ఉన్నా సన్నగా ఉంటాడని, కండలు తిరిగిన మనిషేమీ కాదన్నది పోలీసుల అభివర్ణన. మహాచురుకైన వాడని చెబుతారు కాని ఎలా ఉంటాడో వారికి ఖచ్చితంగా తెలియదు. హిడ్మాలాగా ఉండే పురుషుల ఫోటోలు మాత్రం వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి.

అతి చిన్న వయసులోనే కేంద్రకమిటీకి

సీపీఐ (మావోయిస్ట్‌లు) కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మా 1981లో పుట్టారనేది ఓలెక్క. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో తక్కువ వయస్సు ఉన్నవాళ్లలో ఈయన ఒకరు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో నక్సల్స్ దాడికి హిడ్మా కారణమనే ఆరోపణ ఉంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మాలోని పూర్వాతి గ్రామంలో జన్మించారు. బస్తర్‌లో మావోయిస్టుల పేరు చెబితే మొదట గుర్తుకువచ్చే పేరు హిడ్మా. చదువు సంగతి పూర్తిగా తెలియకపోయినా 10వ తరగతి వరకు చదివారని చెబుతారు. పార్టీలో చేరిన తరువాత సైనిక ఆపరేషన్, గెరిల్లా యుద్ధంలో మాస్టర్ స్ట్రాటజిస్ట్ అయ్యాడు.

2016లో ఆరుగురు నక్సల్స్‌తో పాటు అరెస్టయ్యారు. ఆ సమయంలో హిడ్మా ఎవరికీ పెద్దగా తెలియదు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1 ఏరియా కమాండర్‌గా పనిచేశారు. ఆ తరువాత సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాలలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ క్రియాశీల సభ్యుడిగా పని చేశారు. 2010 ఏప్రిల్ లో దంతెవాడలో మావోయిస్టుల దాడి జరిగే నాటికి ఆయన సెంట్రల్ కమిటీ సభ్యులు. ‌అప్పటికి ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యుల్లో ఆయనే చిన్నవారు.

2017 సుక్మా దాడితో సహా, సుమారు దశాబ్దం క్రితం భద్రతా సిబ్బందిపై జరిగిన అనేక భీకర దాడుల వెనుక సూత్రధారులలో హిడ్త ఒకరని నమ్ముతారు. ఇరవై ఆరు వేర్వేరు దాడులల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెబుతారు.

2021 నుంచి హిడ్మా కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఇప్పుడు తీవ్రమైంది. అనేకసార్లు పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్న హిడ్మా దళాన్ని ఎలాగైనా పట్టుకోవడమే సీఆర్పీఎఫ్ ఉద్దేశం. CRPF ప్రత్యేక జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)కు చెందిన సుమారు 2,000 మంది భద్రతా బలగాలు హిడ్మా కోసం వేటాడుతున్నాయి. మరికొన్ని సాధారణ బెటాలియన్లు, ఛత్తీస్‌గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) యూనిట్లు ఉండనే ఉన్నాయి.

సుమారు 400 మంది గెరిల్లాలు హిడ్మా దళంలో ఉన్నట్లు సమాచారం. యుద్ధ తంత్రంలో‌ నేర్పరిగా భావించే హిడ్మా పలుమార్లు ఛత్తీస్‌గఢ్ పోలీసుల్ని టోకరా కొట్టించారు. అనేకమంది CRPF, జిల్లా రిజర్వ్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యులను హతమార్చారు. దళ సభ్యురాలినే వివాహం చేసుకున్న హిడ్మా కోసం ప్రస్తుతం సైనిక నిఘా ముమ్మరమైంది.

Read More
Next Story