కంటోన్మెంట్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ లో అభ్యర్థుల పోటీ
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రెస్టీజియస్ గా తీసుకుంది.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు మే 13 న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉపఎన్నికపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. సరైన అభ్యర్థిని నిలబెట్టాలని కసరత్తు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ఇప్పటికే లాస్య నందిత సోదరి నివేదితని తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి వేటలో ఉన్నాయి. కాగా, ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు. అన్నిచోట్లా గులాబీ జెండానే ఎగిరింది. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కి కూడా తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి గణేష్ నారాయణ్ ని పార్టీలో చేర్చుకుంది.
అయితే ఈ సీటు కోసం హస్తం పార్టీలో పోటీ కూడా ఎక్కువైంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెల కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశపడ్డ అద్దంకి దయాకర్ కూడా కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానానికి అధికార పార్టీలో గట్టి పోటీ పెరిగింది. టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అభ్యర్థుల్లో మొదలైంది.