Telangana Eknath Shinde
x

Telangana Eknath Shinde | తెలంగాణ ఏక్ నాథ్ షిండే ఎవరు?

తెలంగాణలో ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) పేరు మార్మోగుతోంది. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తోంది.


తెలంగాణలో ఏక్ నాథ్ షిండే పేరు మార్మోగుతోంది. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తోంది. ఎవరు మరో ఏక్ నాథ్ షిండే అవుతారు అనే చర్చ మొదలైంది. నెక్స్ట్ షిండే అని కొన్ని వేళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని చూపిస్తుంటే.. మరికొన్ని వేళ్ళు హరీష్ రావు వైపు చూపిస్తున్నాయి. ఈ విధంగా శివరాత్రికి శివ నామస్మరణ చేసినట్టు రాజకీయ నేతలంతా షిండే నామస్మరణ చేస్తున్నారు.

అసలు ఏక్ నాథ్ షిండే ఏం చేశారు?

ఏక్ నాథ్ షిండే ఆటో డ్రైవర్ గా కెరీర్ ప్రారంభించి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన పరిణామాలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014, 2019 లలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి, 2019 లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల కూటమి) ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ పార్టీలో ఆయనకి సముచిత స్థానం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నతరం శివ సేన CM అభ్యర్థిగా తనయుడు ఆదిత్య ఠాక్రేని ప్రొజెక్ట్ చేయడాన్ని మరింత సహించలేకపోయారు. పార్టీపై తిరుగుబాటు చేసి సస్పెండ్ అయ్యారు. ఇదే అదునుగా భావించిన బిజెపి మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పింది.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సీట్లు అవసరం. దీంతో అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా 4 రోజులకే కుప్పకూలింది. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి 'మహా వికాస్ అఘాడీ' పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. కూటమిలోని శాసనసభ్యుల సంఖ్య 154కు చేరడంతో అప్పటి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైంది. అసంతృప్తితో ఉన్న షిండే 2022 లో తిరుగుబాటు చేయడంతో శివసేన రెండు వర్గాలుగా చీలింది. తన వర్గంలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపి.. ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మరో పది మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరడంతో సంఖ్య 40కి పెరిగింది. దీంతో షిండే సహా ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్, కోర్టులను ఆశ్రయించారు ఠాక్రే. ఆరు నెలల తర్వాత షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదంటూ మహారాష్ట్ర స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏక్ నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అంటూ స్పీకర్ స్పష్టం చేశారు.

తెలంగాణ షిండే ఎవరు?

మహారాష్ట్ర పరిణామాల అనంతరం తెలంగాణలో సైతం పార్టీల నేతలు మరో పార్టీలోని ముఖ్య నేతలకి షిండే ట్యాగ్ తగిలిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం.. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ, సీఎం అభ్యర్థి ఎంపిక పలు చర్చలకు దారి తీసింది. రేవంత్ షిండే అవుతారని, భట్టి షిండే అవ్వొచ్చని కామెంట్స్ వినిపించాయి. కానీ కాంగ్రెస్ రేవంత్ కి సీఎం పగ్గాలిచ్చి, భట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి సముదాయించింది. కానీ రేవంత్ సీఎం టర్మ్ రెండున్నరేళ్లు మాత్రమే అంటూ ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు అడపాదడపా ఎద్దేవా చేస్తూనే ఉంటారు. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచింది. మరోసారి షిండే పేరు హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. దీనికి కారణం మోదీని రేవంత్ పెద్దన్నయ్య అని పిలవడమే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఈసారి గెలవదని నొక్కి చెబుతుంటే.. రేవంత్ మాత్రం మా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీ దయ ఉండాలంటూ మోదీకి విజ్ఞప్తులు చేయడం, రేవంత్ రెడ్డి కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుందని నమ్ముతున్నారని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇది కాస్తా విమర్శలకు దారి తీసింది.

"రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే.. త్వరలో ఆయన బీజేపీతో చేతులు కలిపి ఏక్ నాథ్ అవ్వొచ్చు" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావాలని ఆయన కోరుకుంటున్నారని, ఎంపీ ఎలక్షన్స్ తరవాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని విమర్శించారు. మరోవైపు గులాబీ అధినేత కేసీఆర్ సైతం త్వరలో రేవంత్ సర్కార్ కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావుకి అసెంబ్లీ పక్ష నేత బాధ్యతలు అప్పగించకపోతే లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన ఏక్ నాథ్ షిండే అవుతారని, తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు. ఇక బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు అంటూ కామెంట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ షిండే ఎవరు కానున్నారు అనే చర్చ ఉత్కంఠగా మారింది.

Read More
Next Story