Komatireddy Venkat Reddy
x

సీఎం రేవంత్ స్థాయిని తేల్చేసిన మంత్రి కోమటిరెడ్డి

కోమటి టార్గెట్ కేటీఆర్, హరీష్ రావా? లేదంటే రేవంత్ రెడ్డా?


సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఈ వాదన అంతే బలంగా వినిపిస్తోంది. చాలా మంది నేతలు సీఎం పదవి అందుకే స్థాయి రేవంత్‌కు లేదన్న అభిప్రాయంతో ఉన్నారని, తమతో పోల్చుకున్నా సీఎం రేవంత్ స్థాయి తక్కువ అని అనుకుంటున్న వారు ఉన్నారన్న చర్చ జోరుగానే సాగుతోంది. ఇప్పటికి కూడా ఇది హాట్ టాపిక్‌గానే ఉంది. అయితే గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఈ వాదనలకు బలం చేకూర్చాయి. అదే విధంగా ఒక సందిగ్దతను కూడా సృష్టించాయి. ఆయన మాటలు బూమరాంగ్ తరహాలో వచ్చి ఆయన మెడకే చుట్టుకున్నాయని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కోమటి ఏమన్నారంటే..!

ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన వస్తే అన్ని అంశాలు, సమస్యలపై చర్చిస్తామని అన్నారు. ‘‘హరీష్, కేటీఆర్‌తో మాకు సంబంధం లేదు. వాళ్ల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉందని నేను అనుకోవట్లేదు. అందుకే నేను వాళ్లు ఏం మాట్లాడినా నేను స్పందించను. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం కేసీఆర్ మాట్లాడితేనే మాట్లాడతా. నా స్థాయి అది’’ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.

కోమటి టార్గెట్ బీఆర్ఎస్ నేతలా? రేవంతా?

కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి అంటే విమర్శకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఆయన కేటీఆర్, హరీష్ రావులను తక్కువ చేయాలనుకున్నారా? లేదంటే రేవంత్ స్థాయి తనకన్నా తక్కువ అని చెప్పాలనుకున్నారా? అసలు ఆయన ఏం అనాలని అనుకున్నారో తెలియట్లేదంటూ పలువురు విశ్లేషకులు కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కనబరుస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన ఒకే రాయితో రెండు పిట్టలను కొడదాం అనుకున్నారని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి హరీష్ రావు, కేటీఆర్‌లది తన స్థాయి కాదని చెప్తూనే.. రేవంత్‌ది వాళ్ల స్థాయి మాత్రమే అని చెప్పకనే చెప్పారని వారు అంటున్నారు.

Read More
Next Story