‘చప్పట్ల’ కాలంలో ‘తప్పెట్లు’ మోగిస్తున్నారెందుకూ?
x

‘చప్పట్ల’ కాలంలో ‘తప్పెట్లు’ మోగిస్తున్నారెందుకూ?

హోలీ ముందు ఇంతకుముందు జరగని వివాహాలు, కాలంతో పాటు మారిన వివాహాలు


పెళ్లి అంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు కుటుంబాలను ఓ జంట కలిపే పెద్ద పండగ. వారిని సమాజంలోకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ నిర్వహించే వేడుక. దీనికి అత్యంత కీలకమైన అంశం సుమహూర్తం.

జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సుముహూర్త బలం వారిని కలిపి ఉంచుతుందని, కుటుంబ విలువను ముందు తరాలకు తీసుకెళ్తుందని హిందూ సమాజం విశ్వసిస్తుంది. అయితే గత కొంతకాలంగా సుముహూర్తాలు లేకుండానే వివాహాలు జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

హోలీ పండగ ముందు..
సాధారణంగా తెలంగాణలో హోలీ వేడుకల ముందు పెళ్లిలు జరిగేవి కావు. హోలీ రోజున పరమశివుడు, మన్మథుడిని దహనం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడు రోజులు పిల్లలు ‘జాజిరి ఆట’ ఆడతారు.


వీటిని స్థానికంగా చప్పట్లుగా పిలుస్తారు. ఫల్గుణ మాసం మొదటి 15 రోజులు మూఢంగా భావించి ఒకప్పుడూ వివాహాలు జరిపేవారు కాదు. చప్పట్ల ముందు తప్పెట్లు మోగవని ఓ వాడుక సామెతను కూడా కొంతమంది గ్రామీణులు ఉపయోగించేవారు.
ఆ తరువాతే మంచి రోజు చూసుకుని వివాహాలు నిర్ణయించేవారు. ముఖ్యంగా పెద్ద కొడుకుకి ఉగాది లోపు పెళ్లి చేయాలని భావించేవారు. ఉగాది తరువాత మిగిలిన సంతానానికి పెళ్లిలు చేయాలని ఆరాటపడేవారు. కానీ ప్రస్తుతానికి ఈ ఆచారాన్ని సమాజం పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.
గత నాలుగు రోజుల నుంచి అనేక వివాహాలు జరగుతున్నాయి. అందులో ముఖ్యంగా అష్టమి, నవమి లాంటి తిథుల్లో సైతం పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఏదైన మధ్యస్థాయి, చిన్న పనులు, కార్యక్రమాలు చేయాలనుకున్న సమయంలో కూడా తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం చూసి చేసేవారు.
కానీ పెళ్లి వేడుకలు సైతం ఎలాంటి సమయం చూడకుండా ఆడంబరంగా నిర్వహిస్తుండటంపై కొంతమంది పెద్దవారు ముఖ్యంగా ముదుసలి గ్రామీణులు పెదవి విరుస్తున్నారు. ‘‘ అష్టనాగళ్ల’’ నాడు పెళ్లి ఏందీ? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.
సంక్రాంతికి ముందు కూడా..
అలాగే సంక్రాంతికి ముందు ఒకప్పుడూ పెళ్లిలూ జరిగేది కావు. కానీ ఈ మధ్య సంక్రాంతి సమయంలో కూడా ‘‘పెట్టుడు ముహూర్తాలు’’ అంటూ వివాహాలు జరిపిస్తున్నారు.
ముఖ్యంగా విదేశీ అల్లుల్ల మోజులో ఉంటున్న చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాల్లో ముందున్నారు. అలాగే ఇంటిలో ఉన్న పెద్దవారు కాలం చేయడానికి సిద్దంగా ఉంటే.. వారి కళ్ల ముందు పెళ్లి చేయాలనే లక్ష్యంతో కూడా ఎక్కువగా పెట్టుడు ముహూర్తాలతో శుభాకార్యాలు జరిపిస్తున్నారు.
రాత్రి వివాహాలకు తెర..
ప్రస్తుత కాలంలో పెళ్లిలన్నీ కూడా ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు రాత్రి పూట ఎక్కువగా పెళ్లిళ్లు జరిగేవి. రోజంతా వ్యవసాయ పనులు చేసుకుని రాత్రి సమయంలో ఎడ్లబండి కట్టుకుని పెళ్లి వేడుకలకు వెళ్లేవారు.
అప్పట్లో కుటుంబ గౌరవం అనేది పెళ్లికి వచ్చిన ఎడ్లబండి ఆధారంగానే లెక్కకట్టేవారు. ‘‘మా పెళ్లికి 20 బండ్లు వచ్చాయి.. మా పెళ్లి 50 బండ్లు( ఎద్దుల బండి) వచ్చాయి’’ అని గర్వంగా చెప్పుకునే వాళ్లమని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోనికి చెందిన ఓ వృద్దురాలు చెప్పిన మాట.


ముఖ్యమైన బంధువులు కనీసం పది రోజుల ముందు పెళ్లికి వెళ్లేవాళ్లు. పదహారు రోజుల పండగ అయిపోయాక తిరుగుప్రయాణం అయ్యేవారు. కానీ ఇప్పుడంతా 20-ట్వంటీ లీగ్ లా అలా వచ్చి, ఇలా తిని వెళ్లిపోతున్నారు. పట్టుమని నాలుగు గంటలు కూడా మండపం దగ్గర ఉండటం లేదు.
పండితుల అభిప్రాయం..
ఈ అంశానికి సంబంధించి హుజురాబాద్ లోని అయ్యప్ప దేవాలయ పురోహితుడు కిరణ్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘వివాహ ముహుర్తాలకు తిథులతో సంబంధం లేదు. మంచి ముహూర్తం ఉంటే చాలు వివాహం జరిపించవచ్చు.
అయితే గ్రామీణ ప్రాంతంలో అష్టమి, నవమి తిథులపై కొన్ని అపొహలు ఉన్నాయి. కొన్ని పనులు విషయంలో మాత్రమే ప్రారంభించకూడదనే నియామాలు ఉన్నాయి’’ అన్నారు.
శాస్త్రంలో పుట్టు ముహూర్తాలు, పెట్టు ముహూర్తాలు ఉన్నాయన్నారు. పంచాంగం ప్రకారం గ్రహగతులను అనుసరించి, వధూవరుల జాతక ప్రకారం వచ్చే ముహుర్తాలను పుట్టు ముహుర్తాలంటారని చెప్పారు. అవి కాకుండా తల్లిదండ్రుల కోరిక మేరకు పెట్టే ముహూర్తాలను పెట్టు ముహూర్తాలంటారని వివరించారు.
అయితే సుముహూర్తం బలంగా లేకపోతే కళత్ర దోషం వచ్చి భార్యాభర్తల మధ్య అనవసర వివాదాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చప్పట్ల కాలంలో కూడా వివాహాలు జరపవద్దని అనే అంశాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
‘‘ హోలీ పండగ తరువాత జరిగే కాలాన్ని చప్పట్లుగా పిలుస్తారు. కానీ ఇప్పుడు సమాజం దాన్ని కూడా ముందుకు జరిపింది. నిజానికి భజన సందర్భంగా కూడా చప్పట్లు కొడతారు. ఏదైన సన్మాన కార్యక్రమంలో కూడా చప్పట్లు కొడతారు. కానీ ఇంటి ముందు చప్పట్లు కొట్టడం శాస్త్రం అరిష్టంగా చెబుతుంది. కాబట్టి అప్పుడు ముహూర్తాలు ఉండవు’’ అని చెప్పారు.
అలాగే సోమవారం, మంగళవారం కూడా వివాహాలు జరపరు. సోమవారం ఎక్కువగా కళత్ర దోషాలు వస్తాయనే అభిప్రాయం ఉండటం మరొక కారణం. ఇక మంగళవారం కూడా శుభకార్యాలు నిర్వహించరు.
ఆ రోజు ఏ పని చేసిన ‘రిపీట్’ అవుతుందని అభిప్రాయం ఉంది. ఆ రోజు అప్పులు తీర్చుకోవచ్చు. బంగారం కొనుగోలు చేయవచ్చు. కానీ పెళ్లిలు మాత్రం జరపరని పురోహితులు చెప్పారు. అలాగే శనివారం కూడా పెళ్లిలు వద్దంటున్నారని, ఆ రోజు ఎక్కువ మంది వేంకటేశ్వర స్వామి ఉపవాసాలు ఉంటారనే నెపంతో వద్దంటున్నారని అన్నారు.
Read More
Next Story