రేవంత్ ఇంటినే ట్యాప్ చేశారు..ఎందుకు ?
x
Telangana CM reventh

రేవంత్ ఇంటినే ట్యాప్ చేశారు..ఎందుకు ?

ఇంటిని ట్యాపింగ్ చేయటం అంటే రేవంత్ ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలోని అనుమానితుల ఫోన్లన్నింటినీ వినటమే.


తెలంగాణాలో టెలిఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పోలీసు అధికారుల్లో కొందరు ఇపుడు అరెస్టయ్యారు. విచారణలో సస్పెండెడ్ పోలీసు అధికారులు చెబుతున్న విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇపుడు తాజాగా బయటపడిన అంశం ఏమిటంటే రేవంత్ రెడ్డి ఫోన్ను కాకుండా ఇంటినే అప్పటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం(ఎస్ఐబీ) ట్యాప్ చేసిందని. మామూలుగా నిఘాసంస్ధలు ఫోన్లను ట్యాపింగ్ చేయటం సహజం. కాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటినే ట్యాప్ చేశారన్న విషయం సంచలనంగా మారింది.

ఫోన్ను ట్యాపింగ్ చేయటం అంటే సదరు వ్యక్తికి వచ్చే ఫోన్లు, వ్యక్తిచేసే ఫోన్లను నిఘాబృందాలు రహస్యంగా వినటం. కాని ఇంటిని ట్యాపింగ్ చేయటం అంటే రేవంత్ ఇంట్లోకి వచ్చేవాళ్ళు, ఇంట్లో నుండి వెళ్ళేవాళ్ళతో పాటు రేవంత్ ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలోని అనుమానితుల ఫోన్లన్నింటినీ వినటమే. రేవంత్ ఇంటిపైన మాత్రమే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎందుకు అంతగా నిఘాపెట్టినట్లు ? ఎందుకంటే కేసీయార్-రేవంత్ మధ్య ఉన్న వైరం అలాంటిది. వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షవైరం ఓటుకునోటు వ్యవహారంతో మొదలైంది. చంద్రబాబునాయుడు తరపున రేవంత్ తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటను కొనుగోలు చేయటానికి రు. 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చేక్రమంలో ఏసీబీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

ఆ వ్యవహారంలో రేవంత్ సుమారు నెలరోజులు జైలులో ఉన్నారు. తర్వాత బెయిల్ పైన బయటకువచ్చారు. ఇప్పటికీ రేవంత్ బెయిల్ పైనే ఉన్నారు. అప్పుడు మొదలైన వైరం తర్వాత బాగా పెరిగిపోయింది. అసెంబ్లీలో రేవంత్ వాగ్ధాటిని తట్టుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలోకి రానీయకుండా చాలాసార్లు అడ్డుకున్నది. తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో రేవంత్ నుండి రాజకీయంగా తనకు ముప్పుందని బీఆర్ఎస్ పెద్దలు గ్రహించినట్లున్నారు. అందుకనే రేవంత్ ఫోన్ను కాకుండా ఏకంగా ఇంటినే ట్యాపింగ్ చేశారని తెలుస్తోంది. రేవంత్ కు పార్టీలోని సీనియర్లలో చాలామందితో పడదు. అయితే రేవంత్ తో కలిసి పనిచేయని అనివార్య పరిస్ధితులు సీనియర్లకు ఎదురైంది. అందుకనే రేవంత్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఫోన్లన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించింది.

ట్యాపింగ్ తీగ ఎలా కదిలింది ?

తెలంగాణా రాజకీయాల్లో ఇంతటి సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎలా బయటపడింది ? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ శాఖలను ప్రక్షాళన చేశారు. ఇందులో భాగంగా పోలీసు శాఖలోని అనేక విభాగాల అధికారులను కూడా మార్చేశారు. ఈ నేపధ్యంలో మార్చి 10వ తేదీన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) అడిషినల్ సూపరెండెంట్ డీ రమేష్ ఒక ఫిర్యాదుచేశారు. కొంతమంది వ్యక్తుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ జరిగినట్లు అనుమానంగా ఉందని ఫిర్యాదులో చెప్పారు. దాంతో విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు మరి కొన్ని విషయాలు బయటపడ్డాయి. దాంతో మరింత లోతుగా విచారించినపుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ బయపడింది. దాంతో అప్పట్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావుపైన అనుమానాలు వచ్చాయి. ప్రణీత్ రావును విచారించినపుడు అడిషినల్ ఎస్పీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న వ్యవహారం వెలుగుచూసింది. వీళ్ళని కూడా అవుపులోకి తీసుకుని విచారించినపుడు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు విషయం తెలిసింది. అలా తీగలాగితే డొంకంతా బయటపడుతోంది.

రేవంత్ వ్యతిరేకుల ఫోన్లను ట్యాప్ చేయించటం ద్వారా ఏదైనా విలువైన(లొసుగులు) సమాచారం దొరికితే దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చన్నది బీఆర్ఎస్ పెద్దల ఆలోచన అయ్యుండచ్చు. అలాగే మద్దతుదారుల ఫోన్లను ట్యాప్ చేయటం ద్వారా రేవంత్ వ్యూహాలు తెలుసుకోవచ్చన్న ఆలోచన ఉందేమో. నిజంచెప్పాలంటే రేవంత్ ప్రెసిడెంట్ అయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది. జనాల్లో మంచి జోష్ కూడా పెరిగింది. దాంతో రేవంత్ వల్లే తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన అప్పటి ప్రభుత్వ పెద్దల్లో పెరిగిపోయుండచ్చు. అందుకనే రేవంత్ వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికే ఏకంగా ఇంటిమొత్తాన్ని ట్యాప్ చేశారని ఇపుడు విశ్లేషణలు వినబడుతున్నాయి.

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి ఫెడరల్ తో మాట్లాడుతు ట్యాపింగ్ చేయించటం దుర్మార్గమైన చర్యన్నారు. ప్రత్యర్ధులంటే భయపడుతున్న వాళ్ళే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడతారని చెప్పారు. వందలమంది ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందన్న విషయం షాకింగ్ గా ఉందన్నారు. ప్రత్యర్ధులను టెర్రరైజ్ చేయటమే అప్పటి ప్రభుత్వ పెద్దల ఉద్దేశ్యంగా మండిపడ్డారు. సమాచార సేకరణకు కాకుండా భయపెట్టడం కోసం పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవటం తీవ్ర అభ్యంతరకరమన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినట్లు కాకుండా ఏదో మాఫియా పద్దతిలో పోలీసులు యంత్రాంగాన్ని వాడుకోవటం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్ధులందరినీ బెదిరించి లొంగదీసుకోవటం కోసమే ట్యాపింగ్ చేయించినట్లుగా ఉందని అనుమానం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కళ్ళే తనకు థ్రెట్ గా కేసీయార్ భావించటం వల్లే ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్లు తెలకపల్లి అభిప్రాయపడ్డారు. ట్యాపింగ్ చేసిన వాళ్ళే కాకుండా చేయించిన వాళ్ళ వివరాలను కూడా ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విచారణలోని అంశాలను లీకుల రూపంలో కాకుండా అధికారికంగా ప్రభుత్వం బయటపెట్టాలన్నారు

Read More
Next Story