రేవంత్ కు కేసీయార్ కౌంటర్ వ్యూహమేనా ?
తెరవెనుక ఏమైందో ఏమో శనివారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఎంఎల్ఏ తాను కాంగ్రెస్ లో చేరటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.
ఎత్తుకు పై ఎత్తు, వ్యూహానికి ప్రతి వ్యూహాం రాజకీయాల్లో చాలా అవసరం. ఎత్తులు, ప్రతివ్యూహాలు సమర్ధవంతంగా అమలుచేయగలిగిన వాళ్ళదే పైచేయవుతుంది. ఇపుడు విషయం ఏమిటంటే శనివారం కాంగ్రెస్ లో చేరటానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఒకళ్ళు రెడీ అయిపోయారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో శనివారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఎంఎల్ఏ తాను కాంగ్రెస్ లో చేరటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరటానికి రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ వేదికను సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయమై శుక్రవారం రేవంత్ ను ఎంఎల్ఏ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకున్నారు.
ఇంతవరకు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయానికి ఏమి డెవలప్మెంట్ జరిగిందో ఎవరికీ సరిగా తెలీదు. నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, క్యాడర్ తో సమావేశం పెట్టుకున్న ప్రకాష్ మాట్లాడుతు కాంగ్రెస్ లో చేరే విషయాన్ని తాత్కాలికంగా వాయిదావేసుకున్నట్లు ప్రకటించారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలు ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించి తన మద్దతుదారులను గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే ఇబ్బందువుతుందని ఎంఎల్ఏనే చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీల దగ్గర నుండి ప్రతి పదవికి పంచాయితి తప్పదన్నారు. తనొక్కడి లాభం చూసుకుంటే కుదరదని తనకు మద్దతుగా ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నారు.
తనకు మద్దతుగా ఉండి నాలుగుసార్లు మంచి మెజారిటితో గెలిపించిన వాళ్ళని కాదని తనదారి తాను చూసుకుంటే రేపు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రకాష్ అన్నారు. కాబట్టి పార్టీ మారే విషయంలో తొందరపడకుండా మరోసారి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామన్నారు. పరిస్ధితుల ప్రకారం అందరి సరైన నిర్ణయమే తీసుకుంటారని అనుకుంటున్నట్లు ఎంఎల్ఏ చెప్పారు. మద్దతుదారుల ఆలోచనలను కాదని తాను ఏమి చేయనని ప్రకాష్ భరోసా ఇచ్చారు. ఎంఎల్ఏ మాటలు విన్నతర్వాత అందరికీ అర్ధమైంది ఏమిటంటే తనకు లోపల కాంగ్రెస్ లో చేరాలని ఉన్నా జరిగిన ఏవో డెవలప్మెంట్ల వల్ల వాయిదా వేసుకున్నారని. ఎందుకంటే ఏ ఎంఎల్ఏ కూడా మద్దతుదారులతో మాట్లాడుకోకుండానే సీఎంను కలవరు. పార్టీ మారాలని డిసైడ్ అయిన తర్వాతనే ముఖ్యమంత్రిని కలుస్తారని అందరికీ తెలిసిందే. ఒకసారి కలిసిన తర్వాత పార్టీ కండువా కప్పేసుకోవటమే.
అయితే ఇక్కడ ముందు ప్రకాష్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళి దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. తర్వాత ఎంఎల్ఏ రెండుసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం ప్రకాష్ కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగిన తర్వాత సడెన్ గా ఎంఎల్ఏ వెనకడుగు వేశారంటే ఏమిటర్ధం ? శుక్రవారం రాత్రినుండి శనివారం ఉదయానికి ఏదో జరిగింది. ఏమి జరిగిందనే విషయాన్ని ఆరాతీస్తే మద్దతుదారుల్లో కొందరు ఎంఎల్ఏ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. మద్దతుదారులు ఎందుకు వ్యతిరేకించారంటే అందుకు కారణం పార్టీ పెద్దలే అని సమాచారం. పార్టీ మారిపోతున్న ఎంఎల్ఏలను కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు ఎలాగూ ఆపలేకపోతున్నారు. అందుకనే తాము సీనులో లేకుండా పార్టీ నేతలు కొందరిని పార్టీ మారాలని అనుకుంటున్న ఎంఎల్ఏల మీదకు ఉసిగొల్పారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రకాష్ నిర్ణయాన్ని ఆయన మద్దతుదారుల్లో కొందరు వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రకాష్ విషయంలో సక్సెస్ అయితే బహుశా ఇదే వ్యూహాన్ని కేసీయార్ ముందుకూడా కంటిన్యు చేసే అవకాశాలున్నాయి.
పార్టీలో అల్లరైన తర్వాత తాను కాంగ్రెస్ లోకి వెళితే బాగుండదని ఎంఎల్ఏ కూడా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే రేవంత్ మెదక్ నియోజకవర్గం అభ్యర్ధి నీలంమధుకు మద్దతుగా ప్రచారంచేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రకాష్ తో మాట్లాడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలు వెనకడుగు వేయటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మరి శనివారం రాత్రి రేవంత్-ప్రకాష్ మధ్య మంతనాలు జరుగుతాయో లేదో చూడాలి.