హైడ్రాను ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ?
x
KTR

హైడ్రాను ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ?

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. మెజారిటి జనాలు మద్దతు పలుకుతున్న హైడ్రా కూల్చివేతలను మొదటినుండి పూర్తిగా వ్యతిరేకిస్తోంది.


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. మెజారిటి జనాలు మద్దతు పలుకుతున్న హైడ్రా కూల్చివేతలను మొదటినుండి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు హైడ్రా చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తు మాట్లాడుతున్నారు. పేదల ఇళ్ళును కూల్చేసేట్లయితే బుల్డోజర్లకు అడ్డం పడైనా సరే హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటామనే స్టాక్ ప్రకటనలు చేస్తు పార్టీ నేతల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి కేటీఆర్ క్షేత్రస్ధాయిలో కన్నా మీడియాలోను, సోషల్ మీడియాలోనే ఎక్కువ కనబడుతున్నారు. మధ్య మధ్యలో కొద్దిరోజులు పార్టీలో ఎవరికీ అందుబాటులో కూడా ఉండటంలేదు. జిల్లల వారీగా నేతలు, క్యాడర్ తో సమీక్షలను కూడా పెద్దగా జరపటంలేదు.

పార్టీ బలోపేతం మీద దృష్టిపెట్టి జిల్లాల పర్యటనలు చేయటం, నేతలు, క్యాడర్ తో సమావేశాలు, సమీక్షలు మానేసి కేవలం ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక్కడే కేటీఆర్ వైఖరి ఏమిటో పార్టీలోనే చాలామందికి అర్ధంకావటంలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని జిల్లాల నేతలు, క్యాడర్ తో సమీక్షలు పెట్టారు. ఓటమికి దారితీసిన పరిస్ధితులను చర్చించారు. అందులో చాలామంది ఓటమికి నాయకత్వానిదే బాధ్యతగా మాట్లాడారు. పార్టీలో మెజారిటి నేతలు, క్యాడర్ వ్యతిరేకించిన వారికే టికెట్లిస్తే జనాలు ఎందుకు ఓట్లేస్తారని కేటీఆర్ ను నిలదీశారు. మెజారిటి నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించిన వారికే టికెట్లు ఎలా ఇచ్చారని గట్టిగానే తగులుకున్నారు. సమీక్షలు పెట్టిన నియోజకవర్గాలన్నింటిలో ఇదే పరిస్ధితి కనిపించగానే కేటీఆర్ సమీక్షలను రద్దు చేశారు.

అప్పటినుండి పార్టీ బలోపేతంపై నేతలు, క్యాడర్ తో కేటీఆర్ పెద్దగా సమీక్షలు చేసింది లేదు. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలుపుపైన కూడా ఎలాంటి సమావేశాలు, సమీక్షలు పెట్టలేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌసుకు మాత్రమే పరిమితమైపోవటం, కేటీఆర్ కూడా పెద్దగా ప్రజాసమస్యలపై క్షేత్రస్ధాయిలో తిరగకపోవటంతో పార్టీ నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకనే నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై నేతలు పెద్దగా పట్టించుకోవటంలేదు. వాస్తవ పరిస్ధితులను గమనించిన కేటీఆర్ హైడ్రాను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించేసి నిర్మాణాలు చేసిన బిల్డర్లు, రియల్టర్లకు రాజకీయపార్టీల దన్ను ఉందన్నది వాస్తవం. ఇందులో కూడా బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలోనే ఎక్కువ కబ్జాలు జరిగినట్లు ప్రచారంలో ఉంది.

హైడ్రా ఏర్పాటైనదగ్గర నుండి జలవనరుల రక్షణ విషయంలో దృష్టిపెట్టి కూల్చివేతలు మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా జన్వాడ గ్రామంలోని కేటీఆర్ ఫాంహౌస్ కూడా కాల్వను ఆక్రమించి నిర్మించారని తేలటంతో దాన్ని కూల్చేయటంపై హైడ్రా దృష్టిపెట్టింది. అందుకనే వెంటనే కేటీఆర్ ఫాంహౌసును ఖాళీ చేసేశారు. హైడ్రా కూల్చివేతల్లో మధ్య, ఎగువమధ్య తరగతి జనాలు నష్టపోతున్నా మెజారిటి జనాలైతే హ్యాపీగా ఉన్నారు. కూల్చివేతల్లో హైడ్రా కొన్ని చోట్ల దూకుడుగా వెళుతున్నా హోలు మొత్తంమీద సమాజానికి మంచే జరుగుతోందన్నది వాస్తవం. మెజారిటి జనాలు మద్దతుగా నిలబడుతున్న హైడ్రాను కేటీఆర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఆక్రమణల్లో మంత్రులు, ఇతర నేతల ఫామ్ హౌసులు ఉంటే వాటిని కూడా కూల్చేయమని కేటీఆర్ డిమాండ్ చేయాలి. ఎంతసేపు మంత్రుల ఫామ్ హౌసుల ఫొటోలు, వీడియోలను బయటపెడతామని చెప్పటమే కాని ఆపనిచేసింది లేదు.

ఆక్రమణలు కూల్చేయాలని డిమాండ్ చేసి ఎన్నెన్ని చెరువలు ఆక్రమణలకు గురయ్యాయి ? కబ్జాలు చేసిన వాళ్ళెవరు అన్న జాబితాలను కేటీఆర్ ఆధారాలతో సహా రిలీజ్ చేసుంటే బాగుండేది. అప్పుడు జనాలు బీఆర్ఎస్ కు కూడా మద్దతుగా ఉండేవారు. అయితే కేటీఆర్ ఆపని చేయకుండా కేవలం ఆరోపణలు, విమర్శలకే పరిమితమవుతున్నారు. ఒకవేళ కబ్జాలు, అక్రమనిర్మాణాల జాబితాను రిలీజ్ చేస్తే అందులో తమ పార్టీ నేతలే ఎక్కువమంది ఉన్నారన్న ఉద్దేశ్యంతో కేటీఆర్ జాబితాను రిలీజ్ చేయటంలేదా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

Read More
Next Story