చావుడప్పు బీఆర్ఎస్ కు ఇపుడే గుర్తుకొచ్చిందా ?
ఎంఎల్ఏలను కాపాడుకోకపోతే అసెంబ్లీలో గట్టి దెబ్బపడటం ఖాయమని కారుపార్టీ నేతలు డిసైడ్ అయిపోయినట్లుంది. అందుకనే చావుడప్పని గోల మొదలుపెట్టారు.
ఎంఎల్ఏలను కాపాడుకునే విషయంలో బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. కాంగ్రెస్ పార్టీ జోరుచూస్తుంటే బీఆర్ఎస్ ను నిట్టనిలువుగా చీల్చేసేట్లుగా కనబడుతోంది. ఎంఎల్ఏలను కాపాడుకోకపోతే బయటేకాదు చివరకు అసెంబ్లీలో కూడా గట్టి దెబ్బపడటం ఖాయమని కారుపార్టీ నేతలు డిసైడ్ అయిపోయినట్లుంది. అందుకనే చావుడప్పని, ఆందోళనలని, ఫిరాయింపు ఎంఎల్ఏలపై తక్షణమే అనర్హత వేటు వేయాలనే డిమాండ్లు చేస్తు కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నెగ్గిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వీరిబాటలోనే మరికొందరు ఎంఎల్ఏలు కూడా ఉన్నారనే ప్రచారం బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకును దూరం చేస్తున్నట్లుంది. తొందరలోనే 25 మంది ఎంఎల్ఏలు కారుపార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మంత్రులు, అధికారపార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.
అందుకనే కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ కేపీ వివేకానంద గౌడ్ ఇదే విషయమై మాట్లాడుతు ఫిరాయింపు ఎంఎల్ఏల ఇంటిముందు చావుడప్పు కొట్టబోతున్నట్లు హెచ్చరించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎంఎల్ఏలు వెంటనే ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రం. ఎందుకంటే ఇపుడు చావుడప్పు కొడతామని హెచ్చరిస్తున్న వివేకానంద్ గౌడ్ కూడా 2014లో టీడీపీ తరపున గెలిచి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. బహుశా ఆ విషయాన్ని వివేకా మరచిపోయారేమో. 2014,18 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన చాలామంది ఎంఎల్ఏలను కేసీయార్ ఏదోరూపంలో బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. అప్పట్లో వివేకా చావుడప్పు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.
విచిత్రం ఏమిటంటే ఇఫుడు పార్టీ అధినేత కేసీయార్ తో పాటు కేటీయార్, హరీష్ రావులు కూడా ఫిరాయింపు ఎంఎల్ఏల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రోత్సహించిన ఫిరాయింపుల విషయాన్ని వీళ్ళందరు మరచిపోయినట్లు నటిస్తున్నారు. 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో కేసీయార్ ఆదర్శవంతమైన పాలన అందిస్తారని ఆశించిన వారికి తీవ్ర నిరాస ఎదురైంది. పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడే కేసీయార్ అన్న విషయాన్ని అందరు చెప్పుకుంటున్నారు. ఇతర పార్టీల్లో గెలిచి కారుపార్టీలోకి వచ్చినపుడేమో నియోజకవర్గాల అభివృద్ధి కోసం, కేసీయార్ పాలసీలు నచ్చి వచ్చారని చెప్పుకున్నారు. ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి వెళుతుంటేనేమో ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారంటు కేటీయార్, హరీష్ గగ్గోలు పెట్టేస్తున్నారు.
ఇదే విషయమై రచయిత, రాజకీయ విశ్లేషకుడు నర్సన్ బద్రి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ఇపుడు కొడతామని చెబుతున్న చావుడప్పు 2014లో టీఆర్ఎస్ ఆఫీసుముందే కొట్టుండాలన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఫిరాయింపులు మొదలుపెట్టిందే కేసీయార్ అన్న విషయం అందరికీ తెలుసన్నారు. చావుడప్పు కొడతామని హెచ్చరిస్తున్న కేపీ వివేకానంద గౌడ్ 2014లో టీడీపీ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరినపుడు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. రాజకీయాలు నికృష్టంగా మారిపోయినట్లు బాధపడ్డారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా చావుడప్పు కొట్టాల్సొస్తే అన్నీ పార్టీ ఆపీసుల ముందే కాకుండా కేసీయార్ ఇంటిముందు కూడా కొట్టాలన్నారు.
కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ రెడ్డి మాట్లాడుతు చావుడప్పు కొడతామని చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. 2014, 18 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లోకి ఎలా లాక్కున్నారో వివేకానంద్ గౌడ్ సమాధానం చెప్పాలన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలతో కేసీయార్ ఎందుకు రాజీనామాలు చేయించలేదో కేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని తాము స్పీకర్ ను ఎన్నిసార్లు కోరినా ఉపయోగం లేకపోయిందని గోపిశెట్టి గుర్తుచేశారు. అప్పుడు వాళ్ళు చేసిందే ఇఫుడు బీఆర్ఎస్ కు ఎదురు తిరుగటాన్ని కారుపార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నట్లు నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.