యమపాశమవుతున్న చైనా మాంజా !
x

యమపాశమవుతున్న చైనా మాంజా !

సంక్రాంతి ఇంకా రాలేదు కానీ.. ప్రమాదాలు మాత్రం మొదలైపోయాయి.


రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయమేస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని కాదు.. ఎటు నుంచి చైనా మాంజా వచ్చి మెడకు చుట్టుకుంటుందో అని. సంక్రాంతి పండగ వచ్చిందంటే.. గాలి పటాలు ఎగరేయడం మామూలు విషయమే. కానీ దానికి చాలా మంది చైనా మాంజా వాడటం ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఈ ప్రమాదం అత్యధికంగా ద్విచక్ర వాహనదారులకు ఉంది. బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి ఇంకా రాలేదు కానీ.. ప్రమాదాలు మాత్రం మొదలైపోయాయి. చిన్నారులు కూడా చైనా మాంజా భారిన పడ్డారు. ఇక వన్యప్రాణుల విషయానికి వస్తే.. ఇప్పటికే ఎన్నో పక్షులు ప్రాణాలను పోగొట్టుకున్నాయి.

హైదరాబాద్‌లో తాజాగా నిర్మించిన అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై చైనా మాంజా వల్ల ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరయ్య అనే వ్యక్తి గోల్నాక నుంచి రామాంతపూర్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో చైనా మాంజా అతడి మెడకు తగిలింది. దాంతో అతడి మెడ లోతుగా కట్ అయింది. తీవ్ర రక్తస్రాం అవుతున్న వీరయ్యను చుట్టుపక్కల ఉన్నవారు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదొక్కటే కాదు.. నిజామాబాద్ జిల్లా మెట్‌పల్లిలో నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఈ చైనా మాంజా బాధితుడయ్యాడు. నాలుగేళ్ల శ్రీహాస్.. సంక్రాంతి సెలవులకని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటున్న సమయంలో బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. బాలుడి మెడ లోతుగా కట్ అయింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. బాలుడి మెడకు దాదాపు 20 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ఇటువంటి ఘటనలు మరెన్నో జరిగాయి. నగర వాసులను ఇంతలా భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ చైనా మాంజా నిజంగా చైనాదేనా?

చైనా మాంజా అసలెందుకు అంత డేంజర్

సన్నగా కనిపించే దీని రూపంలో ప్రమాదం లేదు.. కానీ దీని బలం, పదునే దీనిని ప్రాంణాంతక ఆయుధంలా మారుస్తుంది. సాధారణంగా గాలిపటాలు ఎగరేయడానికి వాడే సాంప్రదాయ మాంజాతో ప్రమాదం పెద్దగా ఉండదు. అది కాటన్‌తో తయారవుతుంది. మరీ తేలికగా కాకపోయినా తెగుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న చైనా మాంజా అలా కాదు. ఇది చాలా గట్టిగా ఉంటుంది. దానికి కారణం.. దానిని తయారు చేసే వస్తువులు. సింథటిక్ మెటీరియల్‌తో తయారవడం వల్ల.. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. వాటిపై వేసే రసాయనిక పూతలు దానికి మరింత బలంగా, పదునుగా మారుస్తాయి. గాలిపటాల పోటీల్లో గెలవాలన్న ఉద్దేశంతో వీటిలో ఈ సింథటిక్ మాంజాను వాడుతున్నారు. అలా వాడి.. ప్రత్యర్థి గాలిపటాల దారాలను తెంచుతుంటారు పోటీ దారులు. అలా చైనా మాంజా వాడిన గాలి పటాల ద్వారా గాలికి ఎగురుకుని వచ్చి.. ఎక్కడపడితే అక్కడ పడతాయి. అవి మన కంటికి వెంటనే కనిపించవు. రోడ్లపై, చెట్లపై, కరెంట్ పోల్స్‌పై పడి వేలాడుతూ ఉంటాయి. ప్రయాణికులు బైక్‌లపై ప్రయాణించే సమయంలో అవి వారి మెడకు చుట్టుకుని ప్రాణాలను ఆపదలో పడేస్తున్నాయి. వాటి గట్టితనం, తెగని తనం, పదునే వాటిని మరింత డేంజర్‌గా మారుస్తున్నాయి. ఈ దారాలకు ప్రజలే కాదు పక్షులు కూడా భారీగానే బలవుతున్నాయి.

పక్షులకు కనిపించని ఉచ్చు

ఈ మాంజా పక్షులకు మరింత ప్రాణాంతకం. చెట్లపై చిక్కుకున్న దారాలు కనిపించని వలలా మారుతాయి. పక్షులు అందులో చిక్కుకుని తప్పించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో ఆ దారం వాటికి మరింత బిగుతుగా మారి.. పక్షుల రెక్కలు, కాళ్లను కోసేస్తుంది. ఈ క్రమంలో చాలా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వేలాది పక్షులు ఈ మాంజా దారం వల్ల గాయాలపాలయ్యాయి. అనేక పక్షులు మృతి చెందాయని అధికారులు కూడా చెప్తున్నారు.

చైనా మాంజా నిజంగా చైనాదేనా?

చైనా మాంజా.. అని మనం ఎక్కువగా వింటున్నాం. నిజంగా ఈ మాంజా చైనా నుంచే వస్తుందా? దీనిని చైనానే తయారు చేసి విక్రయిస్తుందా? అంటే కాదు. ఇండియాలో సింథటిక్, గ్లాస్‌ కోటెడ్ దారాలను సాధారణంగా చైనా మాంజా అని పిలుస్తుంటారు. వీటిలో స్థానకంగా తయారయ్యే చాలా ఇతర రకాల దారాలు కూడా ఉన్నాయి. ఈ మాంజా దారాన్ని తయారు చేస్తుంది ఇండియాలోనే. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇది తయారవుతుంది. మరి దీనికి చైనా మాంజా అని పేరు ఎలా వచ్చిందంటే.. అందులో వాడే రసాయనాల వల్ల.

సింథటిక్ మాంజా తయారీ కోసం పోలిప్రొపైలేన్(Polyproylene) అనే సింథటిక్ పాలిమర్‌ను వినియోగిస్తారు. దీనిని అత్యధికంగా చైనా, తైవాన్‌ల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. దాంతో ఇక్కడే స్థానికంగా తయారు చేసి.. చైనా మాంజా అని పేరు పెట్టి విక్రయిస్తుటారు. వ్యాపార వర్గాలు కూడా చైనీస్ మాంజాకు చైనాతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి.

బెంగళూరుకు చెందిన మాంజా తయారీ సంస్థ ప్రతినిధి మోహిత్ కార్తికేయన్ ఇదే విషయాన్ని వివరంగా తెలిపారు. ఇది కేవలం మార్కెటింగ్ వ్యూహమేనన్నారు. అన్ని మాంజాలు స్థానికంగానే తయారవుతున్నాయని చెప్పారు. అధిక టెన్సైల్ బలం గాజు లోహ కణాల ఉనికే అసలు ప్రమాదానికి కారణమన్నారు. ఓల్డ్ ఢిల్లీ లాల్ కువాన్ గాలిపటాల మార్కెట్ వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షుడు సచిన్ గుప్తా మాట్లాడుతూ.. తక్కువ ధర కారణంగానే ఈ మాంజాలకు డిమాండ్ పెరిగిందన్నారు. నోయిడా సోనేపట్ బెంగళూరు ప్రాంతాల నుంచే దారాలు సరఫరా అవుతున్నాయని తెలిపారు.

అంతేకాకుండా అసలు ఈ సింథటిక్ మాంజాను ఎవరు తయారు చేస్తున్నారన్నది మాత్రం ఒక రహస్యంలానే ఉంది. అసలు దీనిని ఎవరు విక్రయిస్తున్నారని.. హైదరాబాద్ కైట్ క్యాపిటల్ ధూల్‌పేటలోని కొందరు గాలిపటాల వ్యాపారులను ఫెడరల్ తెలంగాణ అడిగగా.. ‘దీనిని ఎవరు అమ్ముతున్నారు. ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా తెస్తున్నారు? అనేది మాకు తెలియదు. ఎవరో ఒకరు వచ్చి అమ్మేసి వెళ్లిపోతారు’’ అని వాళ్లు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

ఎందుకు అంత డిమాండ్ !

చైనా మాంజాకు అంత డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం సచిన్ గుప్తా చెప్పినట్లు తక్కువ ధరే. మామూలు కాటన్‌తో ఇంత బలమైన దారం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. సాంప్రదాయ మాంజా తయారీకి.. పత్తి దారం, చెట్ల జిగురు, మైదా జిగురు వంటి వాటిని వాడతారు. ఇవి సింథటిక్ మాంజా అంత బలంగా ఉండవు. అదే విధంగా ఈ సాంప్రదాయ దారం వల్ల మనుషులకు, జంతువులకు గాయాలు కూడా కావు. అయితే ఈ సాంప్రదాయ మాంజాను ఇంకా బలంగా మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీంతో పోలిస్తే సింథటిక్ మాంజా చాలా చీప్. పత్తి మాంజా ధరతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఖర్చవుతుంది. అదే సమయంలో ఇది అనేక రెట్లు ఎక్కువ బలం కలిగి ఉంటుంది. అందుకే చాలా మంది ఈ చైనా మాంజా వాడకానికే ఆసక్తి చూపుతున్నారు.

భారత్‌లోనే కాదు.. పాక్‌లో కూడా..

ఈ చైనా మాంజా తిప్పలు భారత్‌లోనే కాకుండా పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా ఉంది. అందుకే అక్కడి స్థానిక ప్రభుత్వం.. దారాలపై నిషేధం విధించకుండా.. పూర్తిగా గాలిపటాలను ఎగరవేయడాన్నే బ్యాన్ చేసింది. పాక్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా చైనా మాంజా తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది రావల్పిండి జిల్లాలో 18 మంది బాలురను అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.

భారత రాష్ట్రాల నిషేధాలు

గుజరాత్ 2009లో చైనీస్ మాంజాపై నిషేధం విధించింది. మహారాష్ట్ర 2015లో ఆంధ్రప్రదేశ్ 2016 మేలో కర్ణాటక 2016 జూలైలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆగస్టు 16న నిషేధం ప్రకటించింది. అంతకు ముందు రోజు ముగ్గురు మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నిషేధాలు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద అమలయ్యాయి. అయినప్పటికీ అమలు ప్రభావంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు డజనుకు పైగా మనుషులు వేలాది పక్షులు మాంజా కారణంగా మృతి చెందాయి లేదా గాయపడ్డాయి.

Read More
Next Story