గుత్తా కెసిఆర్ ను బాగా డామేజ్ చేశాడుగా,  ఇక గుడ్ బై తప్పదా?
x
Council Charman Gutha Sukhendar reddy

గుత్తా కెసిఆర్ ను బాగా డామేజ్ చేశాడుగా, ఇక గుడ్ బై తప్పదా?

అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందునుండే తాను అపాయింట్మెంట్ అడుగుతున్నా కేసీయార్ ఇవ్వటంలేదని మండిపోయారు. కేసీయార్ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు ఈ స్ధితి వచ్చిందన్నారు


బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్ధిపార్టీల మీద కాదు సొంతపార్టీ మేదే. గుత్తా వ్యాఖ్యలు కేసీయార్ను టార్గెట్ చేయటంతో పార్టీలో కలకలం మొదలైంది. ఒక టీవీ చానల్ తో ఛైర్మన్ మాట్లాడుతు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణాలను వివరించారు. కేసీయార్ టార్గెట్ గా గుత్తా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ అనుమానాలు ఏమిటంటే తొందరలోనే గుత్తా కారుపార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారా అని. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఏమిటంటే మండలి ఛైర్మన్ గా గుత్తాకు ఇంకా మూడున్నరేళ్ళ పదవీకాలముంది. ఇదే సమయంలో పదవికన్నా కొడుకు అమిత్ రెడ్డి ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనే ప్రచారం పెరిగిపోతోంది.

ఇంతకీ గుత్తా చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే జనాల్లో పార్టీపైన విశ్వాసం తగ్గిపోవటంతోనే ఓడిపోయిందన్నారు. కేసీయార్ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు ఈ స్ధితి వచ్చిందన్నారు. కేసీయార్ నాయకత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే నాయకులందరు పార్టీని వదిలేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందునుండే తాను అపాయింట్మెంట్ అడుగుతున్నా కేసీయార్ ఇవ్వటంలేదని మండిపోయారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళల్లో చాలామంది బచ్చాలు కోట్లరూపాయలు సంపాదించుకున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు, నేతల సహాయనిరాకరణతోనే తన కొడుకు అమిత్ రెడ్డి పోటీనుండి తప్పుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నేతలు అహంకారంగా వ్యవహరించటంతోనే జనాలకు పార్టీ దూరమై ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు.

గుత్తా ఇపుడు చేసిన వ్యాఖ్యలు కొంతకాలంగా పార్టీలో వినబడుతున్నవే. అయితే మిగిలిన నేతలు చేయటంవేరు స్వయంగా శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చేయటంవేరు. ఇక్కడ విషయం ఏమిటంటే కొంతకాలంగా కేసీయార్ పైన గుత్తా బాగా అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ తరపున కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వమని అడిగితే కేసీయార్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే నల్గొండ నియోజకవర్గంలో కొడుకును పోటీచేయించాలని గుత్తా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కేసీయార్ అంగీకరించలేదు. ఇదే సమయంలో గుత్తాఅమిత్ కు టికెట్ ఇస్తే సహకరించేదిలేదని చాలామంది నేతలు తెగేసిచెప్పారు. దాంతో ఏమిచేయలేక కొడుకు టికెట్ రేసులో నుండి గుత్తా పక్కకు తప్పుకున్నారు. ఇదే సమయంలో గుత్తా అనుచరుల్లో కొందరు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. గుత్తానే తన అనుచరుల్లో కొందరిని కాంగ్రెస్ లోకి పంపారని కొందరు జిల్లా నేతలు కేసీయార్ కు చెప్పారు. దాంతో కేసీయార్ తో గుత్తా గ్యాప్ మరింత పెరిగిపోయింది.

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో అయినా టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. నల్గొండ లేదా భువనగిరి ఎంపీగా టికెట్ ఇవ్వమని కేసీయార్ ను ఎంత రిక్వెస్టుచేసినా కుదరలేదు. కేసీయార్ ను కలవటం కుదరని కారణంగానే కేటీయార్, హరీష్ ద్వారా కూడా ట్రై చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. కారణాలు తెలీదుకాని గుత్తా విషయంలో కేసీయార్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ దక్కదని తేలిపోవటంతో కాంగ్రెస్ లో అయినా టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అదికూడా సాధ్యంకాలేదు. కొడుకు అమిత్ రెడ్డి వరంగల్ నేత, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన విషయం కేసీయార్ దృష్టికి వెళ్ళిందట. గుత్తా ఎప్పటికైనా పార్టీని వదిలేస్తారని కేసీయార్ ఫిక్సయినట్లున్నారు. అందుకనే అప్పటినుండి గుత్తాను కేసీయార్ పూర్తిగా దూరంపెట్టేశారు.

కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కోసం తీవ్రమైన పోటీకారణంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. దాంతో చప్పుడుచేయకుండా గుత్తా పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. కొడుక్కి కాంగ్రెస్ లో టికెట్ వచ్చుంటే బహుశా సుఖేందర్ కూడా ఏదోరోజు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయుండేవారే అని బీఆర్ఎస్ లో చర్చలు జరుగుతున్నాయి. కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమే గుత్తా సుఖేందర్ ఈ ప్రయత్నాలు చేశారు. అయితే ఏ ఒక్కటీ వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలోనే తాజాగా కేసీయార్ ను ఉద్దేశించి సుఖేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Read More
Next Story