గ్రూప్-1 అభ్యర్ధుల అడ్డాగా అశోక్ నగరే ఎందుకయ్యింది ?
ఎప్పుడు ఈ అభ్యర్ధులు ఆందోళనలు చేయాలన్నా నిముషాల వ్యవధిలో వేలాదిమంది అభ్యర్ధులు ఎలా జమవ్వగలుగుతున్నారు ? గ్రూప్స్ అభ్యర్ధుల ఆందోళనలకు ప్రభుత్వమే షేకైపోతోంది.
చాలామందిని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఒకటుంది. అదేమిటంటే గ్రూప్-1,2 పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు ఆందోళనలు చేయాలంటే అశోకనగర్ అడ్డాగా పాపులరైపోయింది. ఎప్పుడు ఈ అభ్యర్ధులు ఆందోళనలు చేయాలన్నా నిముషాల వ్యవధిలో వేలాదిమంది అభ్యర్ధులు ఎలా జమవ్వగలుగుతున్నారు ? గ్రూప్స్ అభ్యర్ధుల ఆందోళనలకు ప్రభుత్వమే షేకైపోతోంది. ప్రతిపక్షాలు తప్పనిస్ధితిలో వీళ్ళకు మద్దతుగా నిలవాల్సొస్తోంది. దీనికి కారణం ఏమిటంటే చాలా సింపుల్ నిముషాల వ్యవధిలోనే వేలదిమంది జమైపోవటం. ఇంత తొందరగా అన్ని వేలమంది ఎలా అశోక్ నగర్లో జమవుతున్నారు ?
దీనికి కారణం ఏమిటంటే అశోక్ నగర్ గ్రూప్-1,2 పరీక్షలు రాసే అభ్యర్ధుల కోచింగ్ సెంటర్లకు బాగా పేరుపడింది. చిన్నా, పెద్దా కోచింగ్ సెంటర్లు అశోక్ నగర్లో సుమారు 150 దాకా ఉన్నాయి. ఒక్కో సెంటర్లో తక్కువలో తక్కువ 400 మంది కోచింగ్ తీసుకుంటుంటారు. కోచింగ్ సెంటర్లలో చదువుతున్న వాళ్ళు కాకుండ చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి గ్రూప్స్ పరీక్షల మెటీరియల్ చదువుకునేందుకు ప్రతిరోజు కొన్ని వందలమంది వస్తుంటారు. గ్రూప్-1,2 కోచింగ్ విద్యార్ధులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి యూపీఎస్సీ రాసే విద్యార్ధులు కూడా కొన్ని వేలమంది ఉంటారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతునే గ్రూప్-1 పరీక్షలు రాసే విద్యార్ధులు వేలల్లో ఉంటారు. యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే పరీక్షల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అభ్యర్ధులు అనుకుంటే, ఆందోళనలు చేయాలని నిర్ణయిస్తే ఒకచోట కలవటం వీళ్ళకు చాలా తేలికవుతోంది.
బయటప్రాంతాల నుండి వచ్చే అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి, ఎంజీబీఎస్ నుండి అశోక్ నగర్ చేరుకోవటం చాలా తేలిక. పైగా గ్రూప్స్ పరీక్షలు రాసేవారికి ఎలాగూ మొబైల్ ఫోన్లుంటాయనటంలో సందేహంలేదు. కాబట్టి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఈజీ అయిపోయింది. వాట్సప్, టెలిగ్రామ్ యాప్ ద్వారా గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవటం, మెసేజీలు పంపుకోవటం తేలికైపోయింది. దాంతో ఏ సమాచారమైనా నిముషాల్లో అభ్యర్ధుల మధ్య చాలా తేలికగా సర్క్యలేట్ అయిపోతోంది. సమాచారం అందటమే ఆలస్యం నిముషాల వ్యవధిలో కొన్నివేలమంది ముందుగా నిర్ణయించుకున్న సెంటర్ దగ్గరకు చేరుకునేస్తున్నారు.
సాఫ్ట్ వేర్ కోర్సులు చేయాలంటే అమీర్ పేట, డీఎస్సీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలంటే దిల్ షుఖ్ నగర్ ఎంతటి పాపులరో గ్రూప్స్ పరీక్షల కోచింగ్ సెంటర్లకు అశోక్ నగర్ అంతే పాపులర్. ఇదే విషయాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగరాజు ‘ది తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు హైదరాబాద్ మొత్తంమీద గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు అంటేనే అశోక్ నగర్ చాలా పాపులరని చెప్పారు. ‘ఇక్కడ సుమారు 100 కు పైగా కోచింగ్ సెటర్లున్నాయని అందులో లక్షమందికి తక్కువలేకుండా విద్యార్ధులు కోచింగ్ తీసుకుంటు’న్నట్లు చెప్పారు. ‘అశోక్ నగర్లో కోచింగ్ తీసుకోవటమే కాకుండా అశోక్ నగర్, చిక్కడపల్లి ఏరియాల్లోని హాస్టళ్ళల్లోనే వేలాదిమంది విద్యార్ధులు ఉంటున్నార’ని నాగరాజు చెప్పారు.
ఇదే విషయమై బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు ‘అశోక్ నగర్ ఏరియాలోనే సుమారు 200 కోచింగ్ సెంటర్లున్నాయ’న్నారు. ‘ఈ సెంటర్లలో 50వేల నుండి 60 వేలమంది విద్యార్ధులు కోచింగ్ తీసుకుంటున్నార’ని చెప్పారు. మొదటినుండి కూడా గ్రూప్స్ రాస్తున్న అభ్యర్ధుల ఆందోళనలకు అడ్డాగా అశోక్ నగర్ చాలా పాపులరన్నారు. ‘కోచింగ్ సెటర్లే కాకుండా హాస్టళ్ళు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల తక్కువ సమయంలోనే వేలాదిమంది అభ్యర్ధులు ఒకచోట చేరుతున్న’ట్లు చెప్పారు.