
బనకచర్లను వదిలి భద్రాచలాన్ని పట్టుకున్న బీఆర్ఎస్..!
ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి వీటన్నింటికి కామన్ పాయింట్‌గా నిలిచే అంశం కాబట్టే ‘భద్రాచలం’ పిక్చర్లోకి వచ్చిందా..?
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బనకచర్ల అంశం రాష్ట్ర రాజకీయాలను అట్టుడికించింది. ఈ అంశంపై సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ.. బనకచర్లను వదిలేసి భద్రాచలం బాట పట్టింది బీఆర్ఎస్. భద్రాచలంలోని ఐదు గ్రామాలు, అక్కడ జరుగుతున్న అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇటీవల భద్రాచలంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్‌తో ఈ అంశం వెలుగు చూసింది. ఈ అంశాన్ని కవిత లేవనెత్తిన తర్వాత నుంచి బీఆర్ఎస్‌కు చెందిన ఇతర నేతలు కూడా భద్రాచలంపై ఫోక్స్ పెట్టారు. ఇప్పుడు తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భద్రాచలం గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామస్తులు మంగళవారం కర్రలతో దాడి చేశారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘‘భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి జరిగిన ఘటనపై బీజేపీ రాచమంద్రా నోరు తెరవరేం..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మోదీతో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. భద్రాద్రిని కాపాడండి.. ఆక్రమణల చెర నుంచి విడిపించండి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా ‘‘తెలంగాణ భద్రాచల రాముడిని పట్టించుకోవడానికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సమయమే లేదా? భద్రాచలంలో ఆక్రమణలకు గురవుతున్న భూములను కాపాడే బాధ్యత బీజేపీకి లేదా? మన భద్రచలానికి చెందిన 889.5 ఎకరాల భద్రచాల ఆలయ పరిధిలోని భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణకు గురయ్యాయి. కానీ ఈ అంశంపై బీజేపీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఏపీలో ఉన్న రాజకీయ పొత్తును కాపాడుకోవడానికే బీజేపీ మౌనం పాటిస్తుందా? మీ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ఈ అంశం గొంతు లేవనెత్తండి. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆక్రమణకు గురైన భద్రాచలం భూములను వెనక్కి తీసుకురావడం కోసం మిమ్మల్ని పోరాడనివ్వండి’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.
ఈ సడెన్ ఛేంజ్ ఎందుకో..?
మొన్నటి వరకు బనకచర్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలంతా మూకుమ్మడి దాడి చేశారు. తెలంగాణ నీటిని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు గురుదక్షిణ కింద గోదావరి నీటిని ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారని విమర్శలు గుప్పించారు. బనచర్లను అడ్డుకోవడానికి రేవంత్ కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కానీ కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. రెండు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారని విమర్శల వెల్లువెత్తించారు. అంతటి స్థాయిలో బనకచర్ల అంశంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చేసి భద్రాచలం అంశాన్ని లేవనెత్తుతుండటం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రతి విమర్శ, ఆరోపణకు కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చింది. ఆధారాలతో సహా అనేక విషయాలను రేవంత్ సహా ఆయన మంత్రి వర్గం బహిర్గతం చేసింది. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, రాయలసీమను రతనాల సీమ చేయడానికి మద్దతిస్తామంటూ కేసీఆర్ ప్రకటించడం ఇలా అన్ని విషయాలను పూర్తి ఆధారాలతో కాంగ్రెస్ చూపింది. దీంతో బీఆర్ఎస్ నాలుకర్చుకుంది. తమ ప్లాన్ బూమరాంగ్‌లా తమ మెడకే తగులుకుంటుందని కాస్తంత ముందుగానే అర్థం చేసుకుంది. అంతే వెంటనే బనకచర్ల తరహాలోనే అటు ఏపీ ప్రభుత్వం, చంద్రబాబును ఇటు రేవంత్ రెడ్డి, తెలంగాణ హక్కులకు కామన్ పాయింట్‌గా ఉండే అంశాన్ని లేవనెత్తాలని ఫిక్స్ అయింది. అదేంటా అని తెలుసుకోవడం కోసం కాస్తంత మేధోమధనం కూడా చేసిన తర్వాతనే భద్రాచలం అంశాన్ని లేవనెత్తింది.
భద్రాచలమే ఎందుకు..?
పైన చెప్పుకున్నట్లే ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి వీటన్నింటికి కామన్ పాయింట్‌గా నిలిచే అంశం భద్రాచలం. దాంతో పాటుగా అతిపెద్ద ప్లస్ పాయింట్.. దేవుడు అని ప్రజల్లో ఉండే సెంటిమెంట్. బనకచర్ల పేరుతో తెలంగాణ ప్రయోజనాలు అన్న సెంటిమెంట్‌తో రేవంత్ సర్కార్‌ను దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచించినా.. అవి ఆశించినంతగా పారలేదు. దీంతో ఇప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్‌ను కాకుండా దేవుడు అనే సెంటిమెంట్ ఆధారంగా ముందుకు వెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకే ఇన్నాళ్లూ భద్రాచలం గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారిగా ఇప్పుడు ఆ ప్రాంతంపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు.
కవితతో మొదలు..!
మొదట రాష్ట్ర విభజన సమయంలో ఉద్భవించిన ఐదు గ్రామాల సమస్యను కవిత లేవనెత్తారు. పది సంవత్సరాల తర్వాత మరోసారి ఆ గ్రామాల అంశాన్ని కవిత లేవనెత్తడమే కాకుండా.. వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. పదేళ్ల తర్వాత మళ్లీ కవిత నోటి నుంచి భద్రాచలం అని రావడమే తప్ప.. అప్పటి వరకు ఎవరూ ఈ అంశాలను పట్టించుకోలేదు. కవిత తర్వాత బీఆర్ఎస్ నేతలు ఒకరొకరుగా భద్రాచలం అంశాన్ని అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి కేటీఆర్ కూడా చేరారు.
తెలంగాణలో సమస్యలు లేకనా..!
భద్రాచలంలో జరిగిన భూముల ఆక్రమణలపై కేటీఆర్ ప్రశ్నించడం మరో కీలక చర్చకు దారితీస్తోంది. అక్కడ భూ ఆక్రమణలు అన్నవి ఇప్పటికిప్పుడు జరిగినవి కాదని, కేటీఆర్ చెప్పిన 889.5 ఎకరాల భూమి బీఆర్ఎస్ హయాం నుంచే ఆక్రమణకు గురవుతున్న భూమి అని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. భద్రాచల రాముడిపై ఈ తారకరాముడికి అప్పుడు ఎందుకు ఈ ప్రేమ కలుగలేదని ప్రశ్నిస్తున్నారు. భద్రాచల రాముడి భూములు ఆక్రమించబడుతున్నాయని కేటీఆర్‌కు ఇప్పుడే కనిపించాయా? బీఆర్ఎస్ హయాంలో ఎందుకు వీటిపై దృష్టి పెట్టలేదు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల వల్లే రాముడు గుర్తొచ్చాడా..?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎప్పుడు షెడ్యూల్ వస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆఖరికి అధికారపక్షం కూడా ఈ విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని ప్రతి పార్టీ భావిస్తోంది. కాగా ఈసారి సత్తా చాటుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ సహా పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలంతా మూకుమ్మడిగా బీఆర్ఎస్‌ను పక్కనబెట్టారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పనయిపోయిందన్న వాదన మొదలైంది. దానిని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని, విజయం సాధించాలని బీఆర్ఎస్ చూస్తోంది. అందుకోసమే ఇప్పుడు భద్రాచల రాముడి సెంటిమెంట్‌ను వాడుకోవాలని వ్యూహాలు రచిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బీఆర్ఎస్ రచిస్తున్న ఈ వ్యూహమైనా పారుతుందా? లేదా ఇది కూడా మరో బూమరాంగ్ అవుతుందా? అనేది చూడాలి.