
Chiru
నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని చిరంజీవి ఎందుకన్నారు?
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టత ఇచ్చారు.
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టత ఇచ్చారు. తాను ఎవర్నీ కలవలేదని, తనను ఎవరూ కలవలేదని ప్రకటించారు. సినీ కార్మికులు తనను కలిశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. సినీ కార్మికుల వేతనాల పెంపు అనేది సమష్టి నిర్ణయం అని పేర్కొన్నారు.
తన మూవీ షూటింగ్ కార్మికులకు వేతనం పెంచి ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే..
‘‘ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకొంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా అసలు నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా అయినా, నేను సహా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబరే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయ సమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమష్టి బాధ్యత. అంతవరకూ అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి’’
కొలిక్కిరాని చర్చలు...
సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు - ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మికుల వేతనాల్ని 30శాతం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
Next Story