
సెప్టెంబర్ 17తో తెలంగాణ జనాలు ఎందుకు కనెక్టు కాలేదు ?
ఆగస్టు 15, జనవరి 26వ తేదీని దేశప్రజలు ఓన్ చేసుకున్నట్లు సెప్టెంబర్ 17ను తెలంగాణలో రాజకీయపార్టీలు తప్ప మామూలు జనాలు పట్టించుకోవటంలేదు, ఎందుకని ?
ఆగస్టు 15..దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజు. ఆరోజును యావత్ దేశంలోని చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రజలంతా ఒక పండుగలాగ చేసుకుంటారు. జనవరి 26..మనదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఆరోజును కూడా దేశప్రజలు ఘనంగనే జరుపుకుంటారు. దేశమంతటికి కాకపోయినా తెలంగాణలో ప్రతిఏడాది ఒకతేదీ ప్రముఖంగా వినబడుతుంటుంది. ఆతేదీ ఏమిటంటే సెప్టెంబర్ 17(September 17th). సెప్టెంబర్ 17వ తేదీని రాజకీయపార్టీలు తెలంగాణ(Telangana Vimochanam Day) విమోచన దినోత్సవం అని, తెలంగాణ విలీన దినోత్సవం అని తాజాగా ప్రజాపాలన దినోత్సవం అని చెప్పుకుంటున్నాయి. అయితే(Independence Day) ఆగస్టు 15, జనవరి 26వ తేదీని దేశప్రజలు ఓన్ చేసుకున్నట్లు సెప్టెంబర్ 17ను తెలంగాణలో రాజకీయపార్టీలు తప్ప మామూలు జనాలు పట్టించుకోవటంలేదు, ఎందుకని ?
సెప్టెంబర్ 17వ తేదీని రాజకీయపార్టీలు తమకోణాల్లో చూస్తు తాముచెప్పిందే వాస్తవమని కీచులాడుకుంటు ప్రత్యర్ధి పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ కీచులాటల మధ్య సెప్టెంబర్ 17వ తేదీని జనాలు పెద్దగా పట్టించుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీని దేని కోణంలో అది చూస్తుండటంతో ఈ అంశం చివరకు పార్టీలకు మాత్రమే పరిమితమైపోయినట్లు అనిపిస్తోంది. పార్టీలమధ్య కీచులాటల కారణంగా సెప్టెంబర్ 17వ తేదీ రాజకీయపార్టీలకు మాత్రమే పరిమితమైపోయి మామూలు జనాలు పెద్దగా పట్టించుకోవటం మానేసినట్లున్నారు.
పైనచెప్పింది రాజకీయకోణమైతే చారిత్రక కోణం మరోటుంది. అదేమిటంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పరిపాలనపైన జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఉన్నట్లు అనిపించటంలేదు. దీనికి కారణం ఏమిటంటే 7వ నిజాం పరిపాలనాదక్షుడు కావటంతో పాటు అభివృద్ధి కాముకుడు కావటం. ప్రజలసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులు కట్టించారు. నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), నీలోఫర్ క్యాన్సర్ ఆసుపత్రి, చిన్నపిల్లల ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మించారు. అలాగే 1918లోనే ఉస్మానియా యూనివర్సిటి ఏర్పాటుచేసి అనుబంధంగా నిజాం కాలేజీలాంటి మరెన్నో డిగ్రీకాలేజీలు ఏర్పాటుచేశారు. రోడ్లు డెవలప్ చేశారు. సికింద్రాబాద్-హైదరాబాద్ మధ్య వారధిగా ట్యాంక్ బండ్ నిర్మించి డెవలప్ చేశారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయటంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి జలాశయాలను నిర్మించారు.
భూ సంస్కరణల్లో భాగంగా పట్టా భూముల విధానాన్ని రూపొందించారు. వ్యవసాయరంగాన్ని కూడా డెవలప్ చేశారు. వినోబాభావే భూదాన్ ఉద్యమానికి మద్దతుగా తన వ్యక్తిగత ఎస్టేట్ నుండి 14 వేల ఎకరాలను విరాళంగా ఇచ్చారు. సికింద్రాబాద్-హైదరాబాద్ ప్రజలకోసం రవాణాసౌకర్యాలు ఏర్పాటుచేయటంలో భాగంగా 27 సిటీబస్సులను 1932లోనే అమల్లోకి తెచ్చారు. సొంత అవసరాలకోసమే అయినా బేగంపేట విమానాశ్రయాన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాద్ ఉత్తర, దక్షిణాధి రాష్ట్రాలకు కనెక్టివిటీగా తెలంగాణ రైలుమార్గాల ఏర్పాటుకు కృషిచేశారు. విద్యుత్ రంగాన్ని కూడా బాగా డెవలప్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 1947కి ముందే విద్యుత్ వెలుగులుండేవి.
సిర్పూర్ పేపర్ మిల్స్, బోధన్ చక్కెర ఫ్యాక్టరి, అజంజాహి నూలు మిల్లు, చార్మినార్ సిగిరెట్స్ లాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటుచేశారు. 1911లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటుచేశారు. 1960ల్లో ఈ బోర్డే హౌజింగ్ బోర్డుగా మారింది. 1920ల్లో హైకోర్టు, 1940లో చిరాన్ ప్యాలెస్, రాజ్ భవన్, మూసీనది తీరంలో ఆజాహనా ఎ జహ్ర ప్రార్ధనామందిరం కూడా నిర్మించారు. నిజాంకాలంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే హిందు-ముస్లింల మధ్య ఎప్పుడూ కలహాలు జరగలేదు. దేవాలయాల నిర్మాణాలకు కూడా విరాళాలు అందించారు. ఉస్మానియా యూనివర్సిటిలో ప్రత్యేకించి ఉర్దు భాషాభివృద్ధికి విభాగాన్నే ఏర్పాటుచేశారు.
రాజ్యాంగ నిర్మాతల్లో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి గౌరవించారు. ప్రపంచప్రఖ్యాత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కూడా నిజాం ఉపయోగంచుకున్నారు. 1908లో మూసీనదికి వరద వచ్చి వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నది. భవిష్యత్తులో ఇలాంటి ఉపధ్రవం మళ్ళీ జరగకుండా మోక్షగుండంను నిజాం పిలిపించారు. ఫలితంగా మూసీనది వరద నుండి రక్షణగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను మోక్షగుండం నిర్మించారు. బెనారస్ యూనివర్సిటి ఏర్పాటుకు అప్పట్లోనే నిజాం రు. 5 లక్షల విరాళం అందించారు. రాజుల పాలనలో మెరుపులే కాదు మరకలు కూడా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే 7వ నిజాం ఎన్ని ప్రజోపయోగ పనులు చేసినా, ఎన్నిసంస్కరణలు తెచ్చినా పాలనలో మరకలు కూడా ఉన్నాయి.
నిజాంపై మరకలు
వ్యక్తిగతంగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా రజాకర్ల(కిరాయి సైన్యం)వ్యవస్ధాపకుడు ఖాసింరజ్వి దురాగతాలు, అరాచకాలను కంట్రోల్ చేయలేకపోవటం వల్ల నిజాం పాలనపై అప్పటి జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. నిజాంసైన్యంతో సంబంధంలేకుండా ఖాసింరజ్వి సొంతసైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడ్డాడు. చరిత్రకారుల ప్రకారం రజాకర్ సైన్యం సుమారుగా 250 గ్రామాలపైన దాడులుచేసి అందినదంతా దోచుకున్నారు. వేలాదిమందిని చంపేశారు. ఎంతోమంది మహిళలను చెరబట్టారు. రజాకార్ల దురాగతాలు నిజాంకు తెలిసినా ఖాసింరజ్వీని కంట్రోల్ చేయలేకపోవటం నిజాం తప్పే అనటంలో సందేహంలేదు. నిజంగానే నిజాం వ్యక్తిగతంగా దురాగతాలకు పాల్పడుంటే తెలంగాణ స్టేట్ విలీనం తర్వాత భారత ప్రభుత్వం నిజాంనే తెలంగాణ స్టేట్ కు గవర్నర్ జనరల్(రాజ్ ప్రముఖ్)గా నియమించిన విషయాన్ని మరచిపోకూడదు.
సెప్టెంబర్ 17కు జనాల్లో స్పందన తక్కువే: అశోక్
గీతం యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గుర్రం అశోక్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు‘‘ సెప్టెంబర్ 17 తేదీకి జనాల్లో ఉండాల్సినంత బాండింగ్ లేద’’న్నారు. ‘‘సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనమా ? విలీనమా ? అనే అంశంపై రాజకీయపార్టీల మధ్య కీచులాటలు కూడా ఒక కారణం’’గా చెప్పారు. ‘‘పార్టీల కీచులాటల కారణంగా సెప్టెంబర్ 17వ తేదీని మామూలు జనాలు రాజకీయపార్టీలకు చెందిన అంశంగా మాత్రమే చూస్తున్నార’’ని అశోక్ అభిప్రాయపడ్డారు. అలాగే సెప్టెంబర్ 17వ తేదీకి చరిత్రలో సరైన ప్రాధాన్యత దక్కకపోవటానికి సమైక్య రాష్ట్రంలో పాలకులు కూడా మరో కారణమన్నారు.
‘‘1948-2014 వరకు పాలించిన పాలకులు సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను స్కూళ్ళు, కాలేజీల్లో పాఠ్యాంశంగా చేర్చలేదన్నారు. సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాధాన్యత ఉందని స్కూళ్ళల్లో విద్యార్ధులకు చెప్పలేదని వాపోయారు. నిజాం పాలన నుండి తెలంగాణకు ఎలా విమోచనం దక్కిందన్న ఘట్టాన్ని పుస్తకాల్లో ఎక్కడా వివరంగా చెప్పలేద’’న్నారు. ‘‘సెప్టెంబర్ 17ను రాజకీయపార్టీలు ఒక్కరోజు అంశంగా చూస్తే ప్రజాసంఘాలు, జేఏసీలు, విద్యార్ధి సంఘాల్లాంటి సివిల్ సొసైటీల వల్లే ఈరోజు ప్రాధాన్యత గురించి జనాల్లో కొంతైనా చర్చ జరుగుతోంద’’ని చెప్పారు. ‘‘ పాలనలో నిజాం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారనటంలో సందేహంలేద’’ని కూడా అశోక్ అంగీకరించారు.
‘‘భూసంస్కరణలను ప్రవేశపెట్టడం, రోడ్లనిర్మాణం, ప్రజారవాణకోసం 27సిటీ బస్సులను ఏర్పాటుచేయటం, ఆసుపత్రులు, విద్యాసంస్ధలను కూడా నిజాం నిర్మించార’’ని చెప్పారు. ‘‘వ్యవసాయరంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను తవ్వించార’’ని గుర్తుచేశారు. ‘‘ఖాసింరజ్వీ ప్రైవేటు సైన్యమైన రజాకర్లను కంట్రోల్ చేయలేకపోవటం నిజాం ఫైయిల్యూరుగా చరిత్రలో నిలిచిపోయింద’’న్నారు.
రజాకర్లను పోషించాడు : పులకంటి
‘‘తనపాలనలో ఎవరూ ఎదురు తిరగకూడదన్న ఉద్దేశ్యంతో రజాకర్లను 7వ నిజాం పెంచిపోషించార’’ని రైల్వే కాలేజీ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు పులకంటి మోహన్ రావు ఆరోపించారు. ‘‘రజాకర్లకు తుపాకులు ఇచ్చి జనాలను భయభ్రాంతులకు నిజాం గురిచేసి’’నట్లు మండిపడ్డారు. ‘‘రజాకర్లు 1947లో 250 గ్రామాల్లోని 5000 ఇళ్ళు తగలబెట్టి, 500 మందిని చంపేసినట్లు చరిత్రలో నిలిచిపోయింద’’న్నారు. ‘‘నిజాం పాలననుండి విమోచన జరిగింది కాబట్టి సెప్టెంబర్ 17ను విమోచనదినోత్సవంగా జరుపుకోవటంలో తప్పులేద’’న్నారు. ‘‘రాజకీయ కారణాలవల్లే సెప్టెంబర్ 17 విమోచనదినోత్సవానికి రావాల్సినంత గుర్తింపు రాలేద’’న్నారు. ‘‘ప్రజల్లో కూడా సెప్టెంబర్ 17కి ఉండాల్సినంత స్పందన కనబడలకపోవటమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి సరైన ప్రచారం రాలేద’’ని చెప్పారు.
తెలంగాణ విమోచనం జరపాల్సిందే: కూరపాటి
రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతు ‘‘నిజాం పాలన నుండి తెలంగాణకు విమోచనం జరిగింద’’న్నారు. ‘‘ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగం ఫలితంగానే తెలంగాణ స్టేట్ ఏర్పడి’’నట్లు చెప్పారు. ‘‘నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసింరజ్వి దురాగతాలపై తిరుగుబాటు, ప్రాణాల త్యాగాల ఫలితంగా ఏర్పాడిన తెలంగాణ కాబట్టి కచ్చితంగా విమోచన దినోత్సవం జరగాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణ బీజేపీలో చిత్తశుద్ది లేద’’ని ఆరోపించారు. ‘‘ఓట్ల పోలరైజేషన్, జనాలను చీల్చటం, అధికారంలోకి రావటమే టార్గెట్ గా బీజేపీ రాజకీయం చేస్తోంద’’ని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమం గురించి విద్యాసంస్ధల ద్వారా రావాల్సినంత ప్రాముఖ్యత దక్కలేద’’ని అంగీకరించారు. రాజకీయ కారణాలవల్లే మామూలు ప్రజల్లో తెలంగాణ విమోచన దినోత్సవంపై భావోద్వేగం కనబడటంలేద’’ని కూరపాటి అంగీకరించారు.