పోచారంను బీఆర్ఎస్ ఎందుకు టచ్ చేయటంలేదు ?
x
Pocharam Srinivasula reddy

పోచారంను బీఆర్ఎస్ ఎందుకు టచ్ చేయటంలేదు ?

సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డిని టచ్ చేసే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు లేకపోయింది.


సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డిని టచ్ చేసే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు లేకపోయింది. దీంతో ఎంఎల్ఏని బట్టి కారుపార్టీ నేతలు రెచ్చిపోతున్నారనే విషయం బయటపడింది. ఇదంతా ఎందుకంటే గడచిన నాలుగురోజులుగా శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ విషయంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఎలా వ్యవహరించింది అందరు చూసిందే. గాంధీపై కారుపార్టీ ఎంఎల్ఏలు, నేతలు ఎందుకు రెచ్చిపోయారంటే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గాంధీని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ గా నియమించటమే.



పీఏసీ ఛైర్మన్ పదవి తనకు వస్తుందని హరీష్ రావు ఆశించారు. ప్రతిపక్షాలకు దక్కే పీఏసీ ఛైర్మన్ పదవి చాలా కీలకమైనది. ప్రతిశాఖలోని జమా, ఖర్చులను ఈ కమిటి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలచుకుంటే పీఏసీ ఛైర్మన్ కు కావాల్సినంత అవకాశం ఉంటుంది. ఇంతటి కీలకమైన పదవికి ఛైర్మన్ గా కేసీఆర్ మాజీమంత్రి హరీష్ పేరును సూచించారు. అయితే వీళ్ళు ఊహించనివిధంగా స్పీకర్ గాంధీని నియమించారు. దాంతో కారుపార్టీ నేతలకు బాగా మండిపోయింది. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాంధీకి ఎలా ఇస్తారంటు ప్రశ్నించారు. అందుకు గాంధీ సమాధానమిస్తు తాను కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే తనను స్పీకర్ పీఏసీ ఛైర్మన్ గా నియమించినట్లు ప్రకటించటంతో పార్టీ మూడు రోజుల పాటు నానా గోలచేసింది.



సీన్ కట్ చేస్తే తాజాగా అంటే శనివారం పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రప్రభుత్వ సలహాదారు(వ్యవసాయ)గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవికి ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఇంతటి కీలకమైన పదవిని స్వీకరించిన పోచారం విషయంలో బీఆర్ఎస్ నేతలు నోరిప్పటంలేదు. ఎందుకంటే పోచారం కూడా బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అన్న విషయం అందరికీ తెలిసిందే. గాంధీ గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి నుండి గెలిస్తే పోచారం నిజామాబాద్ లోని బాన్సువాడ నుండి గెలిచారు. న్యాయంగా ఆలోచిస్తే ఇద్దరూ ఫిరాయింపు ఎంఎల్ఏలే. ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది.



గాంధీ విషయంలో నాలుగురోజుల పాటు నానా రచ్చచేయటానికి కారణం పీఏసీ ఛైర్మన్ గా అపాయింట్ అవటమేనా ? పోచారంను టచ్ చేయకపోవటానికి కారణాలు ఏమిటి ? పోచారం బ్యాక్ గ్రౌండ్ చాలా పవర్ ఫుల్. గాంధీ విషయంలో చేసినట్లుగా గోల చేసేందుకు లేదు. గుడివాడ నుండి తెలంగాణాకు బతకటానికి వచ్చాడంటు గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చాలా తేలిగ్గా అనేశాడు. అదే పోచారం విషయంలో అలా అనేందుకు లేదు. ఎందుకంటే పోచారంది తెలంగాణానే. ఎంతో పటిష్టమైన క్యాడర్ బేస్డ్ లీడర్ అవటంతో పాటు పెద్దమనిషిగా పేరున్న నేత. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఏడుసార్లు అసెంబ్లీకి గెలిచిన నేత. గాంధీతో పోల్చుకుంటే పోచారం బ్యాక్ గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకనే పోచారంను టచ్ చేసే ధైర్యం బీఆర్ఎస్ చేయలేకపోయింది.



తాజా ఘటనలతోనే ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో విభజించు పాలించు సూత్రాన్ని బీఆర్ఎస్ అమలుచేస్తున్నట్లు అర్ధమైంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గాంధీ లాగ పోచారం రెచ్చగొడితే రెచ్చిపోయే నేత కాదు. తనను ఎవరైనా చిన్నగా గోకినా సరే గాంధీ వెంటనే రెచ్చిపోతారు. అదే పోచారం అలాకాదు. చాలా జాగ్రత్తగా బ్యాలెన్సుడుగా ఉంటారు. గాంధీని రెచ్చగొట్టినట్లుగా పోచారంను రెచ్చగొట్టడం, గొడవ చేసి ఇబ్బంది పెట్టడం అంత సులభంకాదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ పోచారంకు క్యాబినెట్ మంత్రి హోదా పదవిని ఎలా ఇచ్చిందని బీఆర్ఎస్ నేతల్లో ఒక్కళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేదు.



ఎందుకంటే తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నుండి రియాక్షన్ చాలా స్పీడుగా వస్తుందని ఊహించుంటారు. బీఆర్ఎస్ హయాంలో టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాక్కుని మంత్రిపదవులను కేసీఆర్ కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని అడిగితే బీఆర్ఎస్ నుండి సమాధానం ఉండదు. అందుకనే పోచారం విషయాన్ని కెలకటానికి బీఆర్ఎస్ ధైర్యం చేయటంలేదని అర్ధమైపోతోంది.

Read More
Next Story