ఓవైపు గెలుపు ధీమా.. అయినా పొత్తుల కోసం బీజేపీ ఆరాటం ఎందుకో?
x
Source: Twitter

ఓవైపు గెలుపు ధీమా.. అయినా పొత్తుల కోసం బీజేపీ ఆరాటం ఎందుకో?

లోక్‌సభ ఎన్నికల్లో 370కిపైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీకి రాష్ట్రాల్లో పొత్తులెందుకో..



లోక్‌సభ ఎన్నికల వేడి దేశమంతా పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ ఆధిపత్యం కనబరచాలని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు సైతం జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో పొత్తులకు తెరలేపుతోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి కలిసి కట్టుగా లోక్‌సభ బరిలో నిలబడాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో టీడీపీ-జనసేనతో పొత్తుకు కూడా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ పొత్తుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కచ్ఛితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్న బీజేపీకి పొత్తుల అవసరం ఏంటని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తులు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఎందుకు యోచిస్తోందని విమర్శించారు.

బీజేపీకి పొత్తులెందుకు!

హైదరాబాద్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వీటిలో ప్రసంగిస్తూ బీజేపీ పొత్తులపై మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టి వారిని బీజేపీ తమతో కలుపుకుంటుందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయడానికి బీజేపీకి వచ్చిన బాధ ఏంటని, పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి.



బీఆర్ఎస్‌పైనా విమర్శలు

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. బీజేపీతో పాటు బీఆర్ఎస్‌పైన కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉందని దుయ్యబట్టారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసింది. స్వపరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్వప్రయోజనాలకే పెద్దపీట వేసింది. వారి తీరుతో విసుగెత్తిన ప్రజలు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీని అందించి అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీఆర్ఎస్ చెబుతోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే వారు ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే పక్కనే ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌లో ఒక్క ఇటుకైనా మిగులుతుందా? ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఎవరినైనా కొనాలని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు’’అని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు ఇలా

దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పొత్తు రాజకీయాలు చేస్తోంది. గత ఎన్నికల వరకు బద్ద శత్రువుల్లా ఉన్న పార్టీలతో కూడా ఇప్పుడు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఏపీలో చంద్రబాబు నాయుడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవెగౌడ, బీహార్‌లో నితీశ్ కుమార్‌తో పొత్తులు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో నిలబడటానికి రెడీ అవుతోంది. కాగా పలు సభల్లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 ప్లస్ స్థానాలు వస్తే మొత్తం ఎన్‌డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయని బీజేపీ పెద్దలు కూడా ధీమా వ్యక్తం చేశారు.

విజయాన్ని ఖరారు చేసుకోవడానికే పొత్తులు

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఉన్నా వాటిని మరింత పటిష్టం చేసుకోవడానికే కమలం పార్టీ పొత్తుల దారిలో నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సహకారం కావాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ వస్తుందన్న సూచనలు చేస్తున్నాయని, కాకపోతే ఆ విజయాన్ని గతంలో కన్నా మరింత బలపరచడానికే బీజేపీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పొత్తులకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు వివరించారు.


Read More
Next Story