
కేటీఆర్-హరీష్ భేటీకి ఈ నాలుగుపాయింట్లే కారణమా ?
ఎప్పుడూ లేనంతగా ఇంతసడెన్ గా హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్ళి గంటలకొద్ది ఏకాంతంగా చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది ?
మామూలుగా అయితే ఈఇద్దరి భేటీకి పెద్దగా ప్రాధాన్యతఇవ్వాల్సిన అవసరంలేదు. కాని పార్టీలోజరుగుతున్న పరిణామాలు, బయట జరుగుతున్న ప్రచారం కారణంగానే వీళ్ళ భేటీకి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండురోజులు అంటే శుక్ర, శనివారాల్లో మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు(Harish Rao) ఇంటికి వరుసగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వెళ్ళారు. రెండురోజులూ సుమారు రెండేసిగంటలు హరీష్ తో ఏకాంతంగా భేటీఅయ్యారు. పార్టీ ఆఫీసులోనో లేదా ఇంకెక్కడైనా కార్యక్రమంలోనో లేకపోతే నేతల ఇళ్ళల్లోనే వీళ్ళు కలుసుకుని ఉంటే ఎవరు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంతసడెన్ గా హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్ళి గంటలకొద్ది ఏకాంతంగా చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈవిషయంలో పార్టీనేతల మధ్య కూడా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతోంది.
వీళ్ళిద్దరి భేటీకి నేపధ్యముంది. అదేమిటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో హరీష్ కు గ్యాప్ వచ్చిందనేది మొదటి పాయింట్. రెండోపాయింట్ ఏమిటంటే ఈమధ్యనే జరిగిన పార్టీరజతోత్సవసభ సందర్భంగా కేసీఆర్-హరీష్ మధ్య గొడవైందని. తండ్రి, కొడుకుల వైఖరిపైన కల్వకుంట్ల కవి(Kavitha)త, హరీష్ లో బాగా అసంతృప్తి పెరిగిపోతోందన్నది మూడోపాయింట్. నాలుగోపాయింట్ ఏమిటంటే ఉద్దేశ్యపూర్వకంగానే హరీష్ కు కేసీఆర్(KCR) పార్టీలో ప్రాధాన్యత తగ్గించేస్తున్నారని. ఐదోది, చివరి పాయింట్ ఏమిటంటే హరీష్ నేతృత్వంలో 10 మంది ఎంఎల్ఏలు తిరుగుబాటు లేవదీసే ఆలోచనలో ఉన్నారని. పై ఐదుపాయింట్లు పార్టీతో పాటు అధికార కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పెద్దఎత్తున చర్చజరుగుతోంది కాబట్టి జనాల్లో కూడా ఈచర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు మద్దతుగా అన్నట్లుగా కవిత లేవనెత్తిన కొన్ని అంశాలు డైరెక్టుగా కేసీఆర్ ను తాకాయి. ఈకారణాలవల్ల బహుశా కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అందుకనే గతంలో ఎప్పుడూ లేనట్లుగా రెండురోజులు వరుసగా హరీష్ ఇంటికి వెళ్ళి కేటీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. శుక్రవారం జరిగిన భేటీలో ఏమి మాట్లాడుకున్నారన్న విషయాన్ని ఇద్దరూ బయటకు చెప్పలేదు. అయితే శనివారం ఏకాంతభేటీ తర్వాత మరికొందరు సీనియర్ నేతలు, ఉద్యోగసంఘాల నేతలతో ఇద్దరూ సమావేశమయ్యారు. సీనియర్ నేతలు, ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అన్నది కేవలం షోచేయటం కోసమే అన్నవిషయం అర్ధమైపోతోంది. భేటీతర్వాత కేటీఆర్ మాట్లాడిన మాటలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కేటీఆర్ ఏమన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. ఈ విషయమై తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. ఉద్యోగుల హక్కుల సాధనకోసం తొందరలోనే పార్టీ పోరాటాలు చేస్తుందట. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంవహిస్తున్నట్లు మండిపడిన కేటీఆర్ ఈ విషయంలో ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షంగా ఉద్యోగుల గొంతుకై తాము పోరాటాలు చేస్తామని కేటీఆర్ చెప్పటమే విడ్డూరం.
విడ్డూరమని ఎందుకు అన్నదంటే అధికారంలో ఉన్న పదేళ్ళు ఉద్యోగుల సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సమ్మెచేసినా పట్టించుకోలేదు. సమస్యల గురించి చెప్పుకోవాలని సమయం అడిగితే కేసీఆర్ ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. తాను ఎంపికచేసిన కొందరు ఉద్యోగసంఘాల నేతలతో మాత్రమే కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడేవారు. ఉద్యోగసంఘాల నేతల్లో స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, దేవీప్రసాద్ లాంటి వాళ్ళకు ప్రభుత్వంలో కీలకపదవులు ఎలాగ వచ్చాయో ఉద్యోగులందరికీ తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు గోలచేయకుండా, సమ్మెలకు దిగకుండా కొందరు ఉద్యోగసంఘాల నేతలు మిగిలిన వాళ్ళని మ్యానేజ్ చేశారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. వీళ్ళ విషయం తెలిసిన తర్వాతే ఉద్యోగసంఘాల నేతలతో విభేదించి ఆర్టీసీ ఉద్యోగులు సుమారు 50 రోజులు సమ్మెచేశారు. అధికారంలో ఉన్నపుడు ఉద్యోగుల సమస్యలపరిష్కారాన్ని పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు ఇపుడు సడెన్ గా ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి పోరాటంచేస్తామని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.
పార్టీలో నాయకత్వ వివాదం పెరిగిపోతోందన్న ప్రచారంతో జరుగుతున్న డ్యామేజి కంట్రోల్ చేయటమే కేటీఆర్ లక్ష్యంగా కనబడుతోంది. ఇందులో భాగంగానే వరుసగా రెండురోజులు హరీష్ తో కేటీఆర్ ఏకాంత భేటీ. కేసీఆర్-హరీష్ మధ్య, కేటీఆర్-హరీష్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని చెప్పటానికి ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. దేశపతి అంటే కేసీఆర్ కు అత్యంత సన్నితుల్లో కీలక నేతన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్య ఒక టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతు కేసీఆర్-హరీష మధ్య గ్యాప్ కు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగసభ కారణమని చెప్పిన విషయం పార్టీలో సంచలనమైంది. కేసీఆర్ మీద హరీష్ అలిగారని దేశపతి డైరెక్టుగానే చెప్పేశారు.
బహిరంగసభకు రెండునెలల ముందు జరిగిన సీనియర్ నేతల భేటీలో రజతోత్సవ సభ ఏర్పాట్లు చూడమని హరీష్ ను కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హరీష్ ఏర్పాట్లనుండి దూరం జరిగిపోయి కేటీఆర్ యాక్టివ్ అయినట్లు దేశపతి వివరించారు. తనపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేయటాన్ని తట్టుకోలేకపోయిన హరీష్ కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు దేశపతి మాటల్లో బయటపడింది. బహింగసభలో కేసీఆర్ స్పీచ్ పాయింట్లపైన కూడా హరీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు ఎంఎల్సీ చెప్పారు. కేసీఆర్-హరీష్ మధ్య గ్యాప్ కు దేశపతి చేసిన వ్యాఖ్యలే సాక్ష్యంగా నిలిచాయి. దేశపతి బహిరంగంగా చెప్పిన కారణాలు కొన్నిమాత్రమే చెప్పని విషయాలు ఇంకా ఎన్నున్నాయో తెలీదు. ఈ విషయాలు ఇలాగుండగానే కేసీఆర్ గారాలపట్టి కల్వకుంట్ల కవితలో కూడా అసంతృప్తి పెరిగిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము కాని సామాజికతెలంగాణ సాధించుకోలేకపోయామని కవిత చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఉద్దేశించినవే అని అర్ధమైపోయింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్నది కేసీఆరే.
ఆస్తులు, పార్టీ ఆధిపత్యం అంతా కేటీఆర్ ఒక్కరికే కట్టబెడుతున్నారన్న మంట కవితలో పెరిగిపోతోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి(Alleti Maheswar Reddy) బయటపెట్టారు. తండ్రి, కేటీఆర్ వైఖరితో విభేదించిన కవిత కేసీఆర్ కు లేఖలు రాసినట్లు కూడా ఏలేటి చెప్పారు. ఇద్దరి వైఖరి నచ్చకే కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు జాగృతి పేరుతో వ్యవహారాలు నడుపుతున్నట్లు ఎంఎల్ఏ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేటీఆర్ కు ఎంఎల్ఏ టికెట్ ఇవ్వటం, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటును చేయటం కేసీఆర్ చేతిలోని పని. ఓట్లేసి గెలిపించాల్సింది జనాలు, కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదించాల్సింది పార్టీ నేతలు. అయితే పార్టీలో మెజారిటి నేతల మద్దతు హరీష్ కే ఉందన్న విషయం ఎప్పటినుండో చర్చజరుగుతోంది. తొందరలోనే బీఆర్ఎస్ చీలిపోతుందని ఏలేటి జోస్యం చెప్పటమే కాకుండా అందుకు ముహూర్తంకూడా పెట్టేశారు. కేటీఆర్ విదేశీ ప్రయాణానికి వెళ్ళగానే ఇక్కడ పార్టీ చీలిపోతుందని చెప్పారు. ఇలాంటి అనేక ప్రచారాలు, డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే హరీష్ పార్టీలో కీలకనేత అని చాటిచెప్పటానికే కేటీఆర్ రెండురోజుల్లో రెండుసార్లు ఏకాంతంగా భేటీ అయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. కేటీఆర్ అమెరికా ప్రయాణంలో ఉన్నపుడు ఇక్కడేమి జరుగుతుందో చూడాల్సిందే.