Pawan and Chandrababu| పవన్ ఎందుకు రెచ్చిపోతున్నాడు ?
తొక్కిసలాట ఘటనే కాదు వేర్వేరు అంశాల్లో కూడా పవన్ ఇలాగే రెచ్చిపోయారు.
జరిగింది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం చూసిన తర్వాత డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒత్తిడి ఏ స్ధాయిలో పనిచేసిందో అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు టీటీడీ(TTD) టోకెన్లు జారీచేసింది. ఈ నేపధ్యంలో బైరాగిపట్టెడలో ఏర్పాటుచేసిన కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మీద పెద్ద దుమారమే రేగుతోంది. దేవాదాయశాఖమంత్రి కాకపోయినా, చివరకు జిల్లా ఇన్చార్జి మంత్రి కాకపోయినా పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణచెప్పారు. ఒకవైపు ఘటనకు నైతికబాధ్యత వహించాల్సిన ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్యచౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Board Chairman BR Naidu) నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు.
ఘటనాస్ధలాన్ని పరిశీలించి, తర్వాత సమీక్ష నిర్వహించిన చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా బాధితకుటుంబాలకు ఊరటగా ఒక్కప్రకటన కూడా చేయలేదు. ఘటనకు బాధ్యులను చేస్తు కిందస్ధాయి అధికారులను సస్పెండ్ చేసి, బదిలీ చేస్తున్నట్లు ప్రకటించి తిరుపతి నుండి వెళిపోయారు. అయితే చంద్రబాబు వెళిపోగానే ఆగమేఘాల మీద తిరుపతిలో పర్యటించిన పవన్ బాధితకుటుంబాలకు క్షమాపణచెప్పారు. అసలు తనకు ఎలాంటి సంబంధంలేని ఘటనకు పవన్ ఎందుకు క్షమాపణ చెప్పారో ఎవరికీ అర్ధంకాలేదు. పైగా తాను క్షమాపణ చెప్పటమే కాకుండా ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్యచౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే అని బహిరంగంగా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఏమీ మాట్లడకపోయినా పవన్ క్షమాపణలు డిమాండ్ చేయటం పెద్ద వివాదంగా తయారైంది. తాజా ఘటనతో పవన్ బాగా రెచ్చిపోతున్నాడనే విషయం అందరికీ అర్ధమైపోయింది.
పవన్ ఎందుకు రెచ్చిపోతున్నాడు ?
పవన్ ఇంతలా రెచ్చిపోవటానికి కారణం ఏమిటి ? తొక్కిసలాట ఘటనే కాదు వేర్వేరు అంశాల్లో కూడా పవన్ ఇలాగే రెచ్చిపోయారు. కాకినాడ పోర్టులో 31 వేల టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికాదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉందని తెలిసి పవన్ ఆకస్మిక తనిఖీచేశాడు. తనిఖీల తర్వాత సీజ్ ది షిప్ అని ఆదేశించాడు. అయితే అధికారులు షిప్పును సీజ్ చేయలేదు. దాంతో పవన్ కు బాగా మండింది. తాను షిప్పును సీజ్ చేయమని ఆదేశించినా అధికారులు ఎందుకు ఆదేశించలేదు ? ఎందుకంటే షిప్పును సీజ్ చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. అలాగే షిప్పును సీజ్ చేయమనే అధికారం డిప్యుటీ సీఎంకు లేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే. చంద్రబాబు మాత్రం తనకేమీ పట్టనట్లుగానే ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే అదే షిప్పులో మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సరుకు కూడా ఉంది. షిప్పును సీజ్ చేస్తే మొత్తం సరుకు రవాణా ఆగిపోతుంది. అదే జరిగితే కేశవ్ వియ్యంకుడికి బాగా నష్టంవస్తుంది. అందుకనే పవన్ బహిరంగంగా సీజ్ ది షిప్పని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ విషయంలో పవన్ బాగా అవమానం జరిగినట్లుగా ఫీలయ్యారని సమాచారం.
అలాగే శాంతిభద్రతల రక్షణలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఫెయిలయ్యారని పవన్ బహిరంగంగా ప్రకటించినవిషయం గుర్తుండేఉంటుంది. హోంశాఖ వ్యవహారాలతో తనకు సంబంధంలేకపోయినా పవన్ జోక్యంచేసుకోవటమే కాకుండా బహిరంగంగా టీడీపీ మంత్రిని తప్పుపట్టడం చంద్రబాబుకు నచ్చలేదు. ఇక్కడే పవన్-లోకేష్ మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగంటే లోకేష్ అన్నీ శాఖల్లోను జోక్యం చేసుకుంటున్నారు. మంత్రవర్గంలో సగానికిపైగా లోకేష్ మద్దతుదారులే ఉన్నారు. అందుకనే తమ శాఖల్లో లోకేష్ జోక్యంచేసుకుంటున్నా ఆ మంత్రులు నోరెత్తటంలేదు. ఇదేసమయంలో పవన్ కూడా పెత్తనంచేస్తున్నారు. దాంతో సకలశాఖల మంత్రులుగా లోకేష్, పవన్ మధ్య పోటీ పెరిగిపోతోంది. లోకేష్ తో పవన్ పోటీపడటాన్ని సహజంగానే చంద్రబాబు అంగీకరించరు. అందుకనే పవన్ శాఖలు మినహా మిగిలిన శాఖల్లో పవన్ ఆదేశాలు అమలుకావటంలేదు. ఎప్పుడైతే తన ఆదేశాలు అమలుకావటంలేదో పవన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.
అందుకనే ఏ ఘటనజరిగినా చంద్రబాబుతో సంబంధంలేకుండా పవన్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు పరిస్ధితి ఎలాగ తయారైందంటే మంత్రివర్గంపై చంద్రబాబు తర్వాత ఆధిపత్యం లోకేష్ దా లేకపోతే పవన్ దా అన్నట్లుగా తయారైందని పార్టీవర్గాల సమాచారం. పవన్ ఇంతలా రెచ్చిపోతుండటానికి బహుశా తెరవెనుక బీజేపీ పెద్దలున్నారనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. బీజేపీ పెద్దల ప్రోత్సాహం లేకపోతే పవన్ ఇంతలా రెచ్చిపోరు అనే చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే పవన్ మినహా మిగిలిన అందరి పేషీల్లో లోకేష్ మనుషులే ఉన్నారు. పీఎస్, పీఏ, గన్ మెన్లు, ఓఎస్డీల్లాంటి కీలక స్ధానాల్లో లోకేష్ మనుషులే ఉన్నారు. పవన్ దగ్గర కూడా తన మనుషులను పెట్టాలని లోకేష్ అనుకుంటే సాధ్యంకాలేదని సమాచారం.
బీజేపీ పెద్దలు కూడా కూటమికి చంద్రబాబు నాయకత్వం వరకు ఓకేనే కాని లోకేష్ నాయకత్వాన్ని భరించేందుకు సిద్ధంగా లేరు. అయితే చంద్రబాబు వారసుడిగా లోకేష్ డామినేషన్ పెరిగిపోతోంది కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ పెద్దలు పవన్ను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం కూడా పెరుగుతోంది. ఎంతైనా రాష్ట్రరాజకీయాల్లో, మంత్రివర్గంలో బీజేపీ మైనర్ పార్టనర్ మాత్రమే. అందుకనే తాము వెనకుండి ముందు పవన్ పెట్టి బీజేపీ పెద్దలు షో చేస్తున్నారని సమాచారం.
చంద్రబాబునే డామినేట్ చేస్తున్నాడా ?
తాజా పరిణామాలను గమిస్తుంటే చంద్రబాబును కూడా పవన్ డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొక్కిసలాట ఘటనలో మృతులకుటుంబాలకు టీటీడీ బోర్డ్ ఛైర్మన్, ఈవో, జేఈవోలు క్షమాపణలు చెప్పాల్సిందే అని పవన్ పట్టుబట్టాల్సిన అవసరంలేదు. పై ముగ్గురిని బాధితకుటుంబాలకు క్షమాపణలు చెప్పమని చంద్రబాబు అడగకపోయినా పవన్ మాత్రం పదేపదే అదే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును డామినేట్ చేసేట్లుగా పవన్ మాట్లాడటంలో వ్యూహం మంత్రివర్గంలో తానే నెంబర్ 2 అని లోకేష్ కు సిగ్నల్స్ ఇవ్వటమేననే టాక్ పెరిగిపోతోంది.
అడ్రస్ లేని బీజేపీ
ఈమొత్తం ఘటనలో అసలు బీజేపీ(BJP) నేతలు అడ్రస్ కనబడనేలేదు. హిందూ ధర్మానికి, హిందుత్వంపై తమకే పేటెంట్ హక్కులున్నాయని గొంతుచించుకునే కాషాయపార్టీ నేతలు తొక్కిసలాట(Tirupati Stampede) ఘటన మీద మాత్రం నోరిప్పలేదు. అయినదానికి కానిదానికి మీడియా ముందుకొచ్చి ఆరోపణలతో రెచ్చిపోయే బీజేపీ నేత, ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా మూడురోజులుగా అడ్రస్ లేడు. తిరుపతిలో అసలు తొక్కిసలాట ఘటనే జరగనేలేదు అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఘటనపై తాము మాట్లాడకుండా పవన్ను ముందుకు తీసుకొచ్చి వెనుకనుండి కమలంపార్టీ నేతలే వ్యవహారాలు నడుపుతున్నారా ? అనే ప్రచారం బాగా జరుగుతోంది.