
కాళేశ్వరం బాధ్యులపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు ?
ఎవరూ ఊహించని విధంగా ఎన్నికలు మరో నెలరోజులుందనగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోయాయి
ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. సుమారు లక్ష కోట్లరూపాయల వ్యయంతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. 2016లో మొదలైన ఈ ప్రాజెక్టు మొదటిదశ 2019లో పూర్తయింది. తర్వాత పనులు కూడా పూర్తయిపోయి 2023 ఎన్నికల ముందే ఆపరేషన్లోకి వచ్చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్నికలు మరో నెలరోజులుందనగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోయాయి. దాంతో మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో(Kaleswaram Project) అవినీతి రాజకీయ అస్త్రంగా మారిపోయింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు. ఎన్నికల సమయంలో పై రెండుపార్టీలు డైరెక్టుగా కేసీఆర్, హరీష్ ను టార్గెట్ చేసి ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా మౌనమే సమాధానంగా ఉండిపోయారు.
అలాంటి కీలకమైన ప్రాజెక్టులో అవినీతి జరిగిన కారణంగానే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం నాసిరకంగా తయారయ్యాయని అందరికీ అర్ధమైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతి, అవకతవకలపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్(పీసీ ఘోష్) కమిషన్ తో విచారణ చేయిస్తున్నారు. ఏడాదిగా ప్రాజెక్టుల్లో పనిచేసిన అధికారులను, పనిచేస్తున్న అధికారులతో పాటు ఇరిగేషన్ నిపుణులను, ప్రాజెక్టులను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారులను కూడా కమిషన్ విచారించింది. ఈనెల 31వ తేదీలోగా తన రిపోర్టును ప్రభుత్వానికి అందించబోతున్నట్లు సమాచారం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదన్నా ప్రాజెక్టు ఒక ప్రభుత్వంలో మొదలై అదే ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోతే క్రెడిట్ మొత్తం సదరు ప్రభుత్వానికే దక్కుతుంది. అదేపద్దతిలో మొదలైన ప్రాజెక్టు అదే ప్రభుత్వ హయాంలో దెబ్బతింటే జవాబు కూడా అదే ప్రభుత్వంచెప్పాలి. కేసీఆర్(KCR) శంకుస్ధాపన చేసి కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణలోపాలు బయటపడ్డాయి. నాసిరకం నిర్మాణం కారణంగా ఇపుడా ప్రాజెక్టు నీటినిల్వకు పనికిరాకుండాపోయింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అదనంగా 45 లక్షల ఎకరాలు తమ వల్లే సాగులోకి వచ్చాయని జబ్బలు చరుచుకుంటున్న కేసీఆర్, హరీష్ రావులు ప్రాజెక్టులో బయటపడిన నాసిరకం నిర్మాణానికి మాత్రం తాము బాధ్యలం కామంటున్నారు. ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతు పెద్ద ప్రాజెక్టుల్లో ఇలాంటి చిన్న సమస్యలు మామూలే కదా అనటమే ఆశ్చర్యంగా ఉంది.
పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన కారణంగా ప్రాజెక్టు నీటినిల్వకు పనికిరాదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) కూడా స్పష్టంగా తేల్చేసింది. అందుకనే వర్షాకాలంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ప్రాజెక్టుల్లో నుండి ప్రభుత్వం వదిలేస్తోంది. నీటిని నిల్వ ఉంచితే ఒత్తిడికి ప్రాజెక్టు ఎక్కడ బద్దలైపోతుందో అని ప్రభుత్వం భయపడుతోంది. కుంగిపోయిన పిల్లర్లు రిపేర్లుచేయటానికి పనికిరావని ఇంజనీరింగ్, ఇరిగేషన్ నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. వాస్తవాలు కళ్ళకు కనబడుతున్నా ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని హరీష్(Harish) ఇంకా బుకాయిస్తుండటమే విచిత్రంగా ఉంది. ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగకపోతే పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదు. సమాధానం చెప్పకపోగా రేవంత్ ప్రభుత్వం మీద ఎదురు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతోనే తమహయాంలో జరిగిన అవినీతిని సమర్ధించుకునేందుకు హరీష్ నానాఅవస్తలు పడుతున్న విషయం అర్ధమైపోతోంది.
ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టయిపోయిందని రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపేరుతో వేలకోట్ల రూపాయల దోపిడిచేసిన కేసీఆర్, హరీష్ జైలుకు వెళ్ళటం తథ్యమని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో పాటు చాలామంది మంత్రులు కేసీఆర్, హరీష్ లు దోపిడికీ పాల్పడ్డారంటు చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలను నిర్ధారించేందుకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. కమిషన్ విచారణతో సంబంధంలేకుండా కేసీఆర్, హరీష్ అవినీతికి పాల్పడ్డారని, వేలకోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినందుకు ఇద్దరినీ జైలుకు పంపటం ఖాయమని తీర్పుకూడా చెప్పేస్తున్నారు.
కేసీఆర్, హరీష్ అవినీతికి పాల్పడ్డారని తేల్చేసిన రేవంత్ మరి ఇద్దరిపైనా ఎందుకు యాక్షన్ తీసుకోవటంలేదు. అవినీతికి పాల్పడిన వారెవరో స్పష్టంగ తెలుసు. ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనే విషయమై విజిలెన్స్ కమిటి ఇచ్చిన రిపోర్టు ప్రభుత్వం దగ్గరుంది. ఇదే రిపోర్టును పీసీ ఘోష్ కమిషన్ కూడా పరిశీలించింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా కూడా కమిషన్ చాలామందిని విచారించింది. అప్పట్లో ప్రాజెక్టు కోసం పనిచేసిన చాలామంది ఉన్నతాధికారులు కమిషన్ ముందు మాట్లాడుతు ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్లే తాము నడుచుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. అయినా బాధ్యులపై యాక్షన్ తీసుకోవటానికి రేవంత్ ఎందుకు వెనకాడుతున్నాడు అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.
కేసీఆర్, హరీష్ పై విచారణ లేనట్లే
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ ను కమిషన్ విచారించటంలేదని సమాచారం. మొదట్లో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని అనుకున్న కమిషన్ ఇపుడు ఎందుకు మనసు మార్చుకుందో అర్ధంకావటంలేదు. ఈటల ఇపుడు బీజేపీ ఎంపీగా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేశాడు. అందుకనే విచారించాలని అప్పట్లో కమిషన్ అనుకున్నది. కమిషన్ తన రిపోర్టును ఈనెలఖరులోగా ప్రభుత్వానికి సమర్పించాల్సుంది. విచారణ చేయకుండానే ఇతరుల వాగ్మూలాల ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్, ఈటల పాత్రపై ఎలాంటి నిర్ణయానికి రాబోతుందా అన్న విషయం అర్ధంకావటంలేదు. ఒకవేళ విచారించకుండానే ఇతరుల వాగ్మూలాల ఆధారంగా కేసీఆర్, హరీష్, ఈటల అవినీతికి పాల్పడ్డారని లేదా పాల్పడలేదని కమిషన్ అభిప్రాయపడితే చెల్లుతుందా ? అన్నది న్యాయపరమైన అంశం. మరి కమిషన్ ఇవ్వబోయే రిపోర్టులో ఏముంటుందన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.
హరీష్ ఏమంటున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతే జరగలేదని హరీష్ పదేపదే వాదిస్తున్నారు. చిన్న సమస్యలను ప్రభుత్వం పెద్దదిగా చూపించి తమపైన బురదచల్లేస్తోందని ఎదురుదాడులు చేస్తున్నారు. సమస్యలను రేవంత్ ప్రభుత్వం రిపేర్లు చేయించకుండా కావాలని రైతులను ఇబ్బందులు పెడుతోందని కూడా ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి పనికిరాకపోతే తమ హయాంలో 45 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్ట ఎలా సాగులోకి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఎన్డీఎస్ఏ ఏమంటోంది ?
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి పనికిరాదని రిపోర్టులో చెప్పింది. ప్రాజెక్టులో నీటిని నిల్వచేస్తే ప్రమాదం మరింత పెరిగిపోతుందని చెప్పింది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూడాల్సిందే అని కూడా సూచించింది.
కేసీఆర్ కుటుంబం అవినీతి బయటపడింది
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన విషయం బయటపడిందని కేంద్రమంత్రులు అంటున్నారు. కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం సిఫారసు చేస్తే సీబీఐ విచారణ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు బండి సంజయ్ చాలాసార్లు చెప్పారు.