రోహిత్ ఆత్మహత్య జాతీయ సంచలనం ఎలా అయ్యింది?
x

రోహిత్ ఆత్మహత్య జాతీయ సంచలనం ఎలా అయ్యింది?

రోహిత్ కేసు ఎందుకు ఇంత సంచలనం అయింది? అసలు రోహిత్ ఆత్మహత్యపై ఉన్న అనుమానాలేంటి? విద్యార్థి సూసైడ్ కేసు నేషనల్ ఇష్యూ గా ఎలా మారింది?


ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరోసారి నేషనల్ హాట్ టాపిక్ అయింది. 2016 లో రోహిత్ కేసు దేశవ్యాప్త సంచలనమే. వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నది రోహిత్ ఒక్కడేనా? అతనికంటే ముందు, ఆ తర్వాత ఏ యూనివర్సిటీలోనూ ఇలాంటి ఘటనలు జరగలేదా? పోనీ ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ ఒక్కడేనా? కాదు కదా! కానీ రోహిత్ కేసు ఎందుకు ఇంత సంచలనం అయింది? అసలు రోహిత్ ఆత్మహత్యపై ఉన్న అనుమానాలేంటి? విద్యార్థి సూసైడ్ కేసు నేషనల్ ఇష్యూ గా ఎలా మారింది?

రోహిత్ చక్రవర్తి వేముల... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పీహెచ్డీ విద్యార్థి. 2016, జనవరి 17 న న్యూ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశం మొత్తం HCU వైపు చూసేలా చేసింది. దళితుల హక్కుల కోసం పోరాడుతున్న అతనిని వేధించి ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపణలు వచ్చాయి. జస్టిస్ ఫర్ రోహిత్ అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.



దళితుల హక్కుల కోసం రోహిత్ పోరాటం...

2015 జులై నుండి యూనివర్సిటీ ప్రతినెలా అతనికి రావాల్సిన రూ.25,000 ఫెలోషిప్ నిలిపివేసింది. దీంతో అతను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) వేదికను ఏర్పాటు చేసి దళితుల హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. అదే సమయంలో ఏఎస్ఏ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య గొడవలు చెలరేగాయి.

దీంతో యూనివర్సిటీ కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని.. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఇక అదే ఏడాది నవంబర్ లో జరిగిన వర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుతో వీసీ అప్పారావు ఐదుగురు విద్యార్ధులపై బహిష్కరణ వేటు వేశారు. దాదాపు సస్పెండ్ అయిన నెల రోజులకి రోహిత్.. 2016 జనవరి 17 న న్యూ స్కాలర్ రీసెర్చ్ హాస్టల్ లోని తన ఫ్రెండ్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు.


రోహిత్ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం...

రోహిత్ బలవన్మరణానికి వర్సిటీలోని కుల వివక్షే కారణమని ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులపై చిన్నచూపు ఉందనడానికి అతని చావే ఉదాహరణ అంటూ నిరసనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ యూనియన్లు, మీడియా ఛానెల్స్ HCU వైపు వేలెత్తి చూపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వచ్చి, రోహిత్ కి మద్దతుగా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. 12 గంటల నిరాహార దీక్ష చేశారు. దీంతో రోహిత్ కేసుకి జాతీయ రాజకీయ రంగు పులుముకుంది.



ఏబీవీపీకి మద్దతుగా ఉండి, రోహిత్ ఆత్మహత్యకి ప్రేరేపించారన్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వర్శిటీ వైస్ ఛాన్సెలర్ అప్పారావు, బీజేపీ నాయకుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు వీసీ అప్పారావు, బీజేపీ నేతలు ఎన్ రామచంద్ర రావు, ఏబీవీపీ నాయకులపై ఐపీసీ 306, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

కేసు క్లోజ్..

రోహిత్ ఆత్మహత్య కేసు విచారణ ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. పోలీసులు 95 మంది సాక్ష్యుల్ని విచారించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పరిశీలించారు. అతని చావుకి అతనే కారణమని, ఎవరికీ సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది మార్చ్ 21 న క్లోజర్ రిపోర్ట్ ను న్యాయస్థానానికి సమర్పించారు. కాగా, రోహిత్ ఆత్మహత్యతో మాకు ఏ సంబంధం లేదని, కేసులో మా పేర్లు కొట్టేయాలని నిందితులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసుల క్లోజర్ రిపోర్ట్ ప్రకారం నిందితులకు ఈ కేసుతో సంబంధం లేదని చెబుతూ విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం తీర్పు ప్రకటించింది. పోలీసుల నివేదికతో ఏకీభవించని వారు కింది కోర్టులో చెప్పొచ్చని, లేదంటే చట్టప్రకారం సవాల్ చేయొచ్చని పేర్కొంది.



క్లోజర్ రిపోర్ట్ లో ఏముంది?

గచ్చిబౌలి పోలీసులు తెలంగాణ హైకోర్ట్ కి సమర్పించిన నివేదికలో రోహిత్ ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదని రాసుకొచ్చారు. అతను దళితుడు కాదని, వడ్డెర కులానికి చెందిన వాడని తెలిపారు. అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని జిల్లా స్థాయి స్క్రూనిటీ కమిటీ తేల్చిందన్నారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల విషయం బయట పడుతుందేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నాడని నివేదికలో పేర్కొన్నారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే అప్పటి వీసీ రోహిత్ పై చర్యలు తీసుకున్నారని, అతనిని కులం పేరుతో వేధించారనేది అబద్ధమని రిపోర్ట్ లో వెల్లడించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావు, ఇతర నిందితులకు రిలీఫ్ దక్కింది.

కేసు క్లోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరసన

కేసు రీఓపెన్...

రోహిత్ కేసు క్లోజ్ చేయడాన్ని రోహిత్ తల్లి రాధిక వేముల, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. విచారణపై అనుమానాలున్నాయని విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ లో ఆందోళనకి దిగారు. రోహిత్ కేసులో నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేసు రీఓపెన్ చేయాలని డీజీపీ రవి గుప్తా నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తిరిగి విచారణ జరిపేందుకు న్యాయస్థానం నుండి అనుమతి డీజీపీ తీసుకోనున్నట్లు తెలిపారు.

Read More
Next Story