KTR and DilRaju|దిల్ రాజును బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది ?
x
KTR and DilRaju

KTR and DilRaju|దిల్ రాజును బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

రేవంత్ రెడ్డితో సినీప్రముఖులు భేటీఅవటాన్ని కారుపార్టీ నేతలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నట్లున్నారు.


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. రేవంత్ రెడ్డితో సినీప్రముఖులు భేటీఅవటాన్ని కారుపార్టీ నేతలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే భేటీఏర్పాటుచేసి సమస్య పరిష్కారానికి కృషిచేసిన దిల్ రాజును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) టార్గెట్ చేశారు. రేవంత్(Revanth) తో సినీప్రముఖుల చాటుమాటు వ్యవహారాలకు దిల్ రాజు తోడ్పాటు అందించారని కేటీఆర్ ఆరోపించారు. దానికి స్పందించిన ఎఫ్డీసీ ఛైర్మన్ కేటీఆర్ కు గట్టి సమాధానం ఇచ్చారు. రాజకీయ వివాదాల్లోకి సినీ పరిశ్రమను లాగవద్దన్నారు. రేవంత్ తో సినీప్రముఖుల భేటీ చాటుమాటు వ్యవహారం కాదని అందరికీ తెలిసే ప్రముఖులు సమవేశమైనట్లుగా గట్టిగా సమాధానమిచ్చారు. కేటీఆర్ ఆరోపణలకు దిల్ రాజు గట్టిగా సమాధానం ఇవ్వటాన్ని పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు. కేటీఆర్ ఆరోపణలకు దిల్ రాజు సమాధానం ఇవ్వటమా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అందుకనే దిల్ రాజును బీఆర్ఎస్ నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలకు ఇపుడు స్పందించిన దిల్ రాజు గతంలో ఎందుకు నోరిప్పలేదని మండిపడుతున్నారు. దిల్ రాజును పట్టుకుని కారుపార్టీ నేతలు డీల్ రాజు అని ఎద్దేవాచేస్తున్నారు. పార్టీ నేత క్రిశాంక్ మాట్లాడుతు ప్రముఖనటుడు అక్కినేని నాగార్జున-సమంత(Nagarjuna and Samantha) వ్యవహారంపై మంత్రి కొండాసురేఖ(Konda Surekha) అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు దిల్ రాజు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గతంలో సినీపరిశ్రమపై రేవంత్ నోరుపారేసుకున్నపుడు కూడా డీల్ రాజు ఎందుకు మాట్లాడలేదని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. మరో సీనియర్ నేత ఎర్రోళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతు రేవంత్ దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి దిల్ రాజు డీల్ రాజులాగ మారిపోయినట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళంతా దిల్ రాజును డీల్ రాజనే అంటున్నట్లు ఎద్దేవాచేశారు. నిజానికి వీళ్ళఆరోపణల్లో పెద్దగా లాజిక్ కనిపించటంలేదు.

ఎందుకంటే ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ గా ఎవరున్నా ప్రభుత్వానికి, సినీఇండస్ట్రీకి మధ్య వారధిగా పనిచేయాల్సిందే. ఎఫ్డీసీ ఛైర్మన్ను ఎంపికచేసేటపుడే ప్రభుత్వపెద్దలతోను, పరిశ్రమలోను ప్రముఖంగా ఉండే వ్యక్తినే నియమిస్తారని అందరికీ తెలుసు. ఏదైనా సమస్య వచ్చినపుడు ప్రభుత్వానికి సినీపరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించటం ఎఫ్డీసీ ఛైర్మన్ బాధ్యత. పుష్పసినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో(Sandhya Theatre) తొక్కిసలాట జరగటం, రేవతి మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళటం అందరికీ తెలిసిందే. ఘటన ఆధారంగా పోలీసులు హీరో అల్లుఅర్జున్(AlluArjun) మీద కేసునమోదు చేసి అరెస్టు చేశారు. పుష్ప అరెస్టుదెబ్బకు పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి.

అదేసమయంలో అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతు బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని ప్రకటించారు. అలాగే సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదని చేసిన ప్రకటన పరిశ్రమలో సంచలనంగా మారింది. బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతులు లేకపోతే, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వకపోతే నిర్మాతలు నిండా ముణిగిపోతారు. అందుకనే పరిశ్రమలోని ప్రముఖుల్లో కొందరు దిల్ రాజు కలిసి చర్చించారు. రేవంత్ తో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రముఖులు కోరినట్లే దిల్ రాజు సీఎంతో మాట్లాడి భేటీకి ఏర్పాటుచేశారు. అయితే భేటీలో ప్రముఖులు ఆశించినట్లు రేవంత్ సానుకూలంగా స్పందించలేదు. భేటీ మొదట్లోనే రేవంత్ మాట్లాడుతు బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతులు అడగవద్దని, టికెట్ల ధరలు పెంపును అంగీకరించేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఏమి మాట్లాడాలో అర్ధంకాక ఏదేదో మాట్లాడి సమావేశం అయ్యిందనిపించారు.

కేటీఆర్ ఉక్రోషం ఏమిటి ?

భేటీతర్వత సినీప్రముఖులు మాట్లాడినపుడు రేవంత్ కు పరిశ్రమ పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమకు సీఎంతో ఎలాంటి విభేదాలు లేవని ఎవరికివారుగా ప్రకటించారు. బహుశా దీన్నే కేటీఆర్ తట్టుకోలేకపోయినట్లున్నారు. అల్లుఅర్జున్ మీద కేసు, అరెస్టుచేసి రిమాండుకు పంపటంపై పరిశ్రమలోని ప్రముఖులు రేవంత్ ను భేటీలో నిలదీస్తారని కేటీఆర్ అంచనా వేసినట్లున్నారు. అయితే తన అంచనాలకు భిన్నంగా భేటీ జరగటాన్నే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లుంది. అల్లుఅర్జున్ మీద కేసు నమోదైనప్పటినుండి బీఆర్ఎస్ మొత్తం రేవంత్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ కు మద్దతు ఇవ్వటంవల్ల మొత్తం పరిశ్రమను రేవంత్ కు వ్యతిరేకంచేయాలని కేటీఆర్ అండ్ కో ఆలోచించినట్లున్నారు. అయితే వాళ్ళ వ్యూహాలకు భిన్నంగా జరగటాన్ని కేటీఆర్ అండ్ కో తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే రేవంత్ ను వదిలేసి దిల్ రాజును కేటీఆర్ టార్గెట్ చేశారు. కేటీఆర్ ఆరోపణలకు దిల్ రాజు గట్టిగా సమాధానం ఇవ్వటంతో కారుపార్టీ నేతలకు మండిపోయింది. కేటీఆర్ ఆరోపలకే సమాధానం ఇస్తారా అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఊగిపోతున్నారు.

ఇక్కడ కారుపార్టీ నేతలు మరచిపోయింది ఏమిటంటే నాగార్జున, సమంతపై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి. మంత్రిఆరోపణలకు నాగార్జున కటుంబంతో సమంత గట్టి సమాధానమిచ్చారు. పైగా అప్పట్లో చాలామంది సినీప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టినట్లే దిల్ రాజు కూడా తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయినాసరే అప్పుడు దిల్ రాజు ఎందుకు నోరిప్పలేదు ? ఇపుడే ఎందుకు సమాధానం ఇస్తున్నారని గోలచేయటమే విచిత్రంగా ఉంది. మంత్రి నాగార్జున కుటుంబంపై ఆరోపణలుచేస్తే, కేటీఆర్ మొత్తం పరిశ్రమతో పాటు దిల్ రాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కాబట్టే దిల్ రాజు స్పందించారు. అదేదో సినిమాలో చెప్పినట్లు ‘గిల్లితే గిల్లిచ్చుకోవాలి కాని నొప్పని అరవకూడద’నే డైలాగు లా ఎవరు ఎప్పుడు మాట్లాడాలి ? ఏమి మాట్లాడాలి ? ఎవరిపైన మాట్లాడాలో కూడా బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేస్తారా ?

Read More
Next Story