KTR Frustration|ఈ ముగ్గురిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోంది ?
x
KTR Harish Rao and Kavitha

KTR Frustration|ఈ ముగ్గురిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోంది ?

రేవంత్ రెడ్డి టార్గెట్ గా వీళ్ళు ప్రతిరోజు టైంటేబుల్ వేసుకుని మీడియా సమావేశాలు పెట్టి పదేపదే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నేతల్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతున్నట్లుంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా వీళ్ళు ప్రతిరోజు టైంటేబుల్ వేసుకుని మీడియా సమావేశాలు పెట్టి పదేపదే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాముచేస్తున్న ఆరోపణలు, విమర్శలను జనాలు ఎంతవరకు పట్టించుకుంటున్నారన్న ఆలోచనలేకుండా తాముచేయాల్సిన ఆరోపణలు, విమర్శలను చేసుకుంటుపోతున్నారు. పార్టీలో కీలకనేతలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR), హరీష్ రావు(Harish Rao), కవిత(Kavitha) మాత్రమే అని అందరికీ తెలుసు. పార్టీ చీఫ్ కేసీఆKCR)ర్ ఎలాగూ జనాల్లోకి రావటం కాదు అసలు పార్టీ నేతలకే టచ్ లో ఉండరు. కాబట్టి కేసీఆర్ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. పొద్దున లేచిన దగ్గర నుండి పై ముగ్గురు కీలకనేతలు చేస్తున్నది ఏమిటంటే అయినదానికి కానిదానికి రేవంత్ ను టార్గెట్ చేస్తుండటమే.

కొద్దిరోజులుగా కేటీఆర్, హరీష్, కవిత తెలంగాణాతల్లి విగ్రహావిష్కరణపైనే ఎక్కువగా టార్గెట్ పెట్టారు. తాము అధికారంలోకి రాగానే సచివాలయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించిన తెలంగాణా(కాంగ్రెస్)తల్లి(Telangana Talli) విగ్రహాన్ని తీసి గాంధీభవన్ కు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈమాటను కేటీఆర్ దాదాపు నెల క్రితమే చెప్పారు. అప్పటినుండి ఇప్పటివరకు తెలంగాణాతల్లి విగ్రహమే కేటీఆర్ కు ప్రధానమైన సబ్జెక్టు అయిపోయింది. తాజాగా మీడియాతో మాట్లాడుతు చేతికి ఓటేస్తే చేతకాని సీఎంను రుద్దారని మండిపడతు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లేఖ రాశారు. ఆ లేఖలో రేవంత్ మీద అనేక ఫిర్యాదులున్నాయి. రేవంత్ మీద రాహూల్ కు లేఖలో ఫిర్యాదుచేస్తే ఏమిటి ఉపయోగం ? రాహూల్ ఏమన్నా లేఖను చూడగానే విచారణ చేయిస్తాడా ? లేకపోతే వెంటనే యాక్షన్ తీసుకుంటాడా ?

రేవంత్ పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయట. తెలంగాణా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడట. గడచిన పదేళ్ళల్లో తాము పెంచిన సంపదను రేవంత్ దోచుకుంటున్నాడట. ఇలాంటి చాలాఆరోపణలతో కేటీఆర్ పెద్ద లేఖే రాశారు. ఒకవైపు అధిష్టానానికి రేవంత్ మూటలు మోస్తున్నాడని ఆరోపిస్తునే మరోవైపు రేవంత్ పైన అవినీతి ఆరోపణలతో రాహుల్ కు లేఖ రాయటంలో ఏమన్నా అర్ధముందా ? ఇక హరీష్, కవిత ధోరణి కూడా ఇంతకు తక్కువగా ఏమీలేదు. తెలంగాణా ఉద్యమంలో రేవంత్ పాల్గొనలేదట. రేవంత్ తెలంగాణా ద్రోహట. తెలంగాణా ద్రోహులపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ ఇపుడు తెలంగాణా గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్లుందని ఇద్దరూ గోలగోల చేస్తున్నారు. వీళ్ళు చెప్పింది ఎలాగుందంటే తెలంగాణా ఉద్యమంలో పాల్గొననివారంతా తెలంగాణా ద్రోహులే అన్నట్లుంది.

అయినా ప్రత్యేక తెలంగాణా ఏర్పడి మూడు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఇపుడు తెలంగాణా ఉద్యమంగురించి మాట్లాడి ఏమిటి ఉపయోగం ? తెలంగాణా ఉద్యమంలో పాల్గొనకపోతే ముఖ్యమంత్రి కాకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ? ఆమాటకు వస్తే సమైక్యవాదాన్ని వినిపించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి అనేకమందిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోలేదా ? సమైక్యవాదాన్ని వినిపించిన తుమ్మల, తలసానిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నావని వీళ్ళు కేసీఆర్ ను ఎప్పుడైనా అడిగారా ? పోనీ తెలంగాణా ఉద్యమంలో చొక్కాలు చింపుకుని వీర తెలంగాణా వాదాలుగా ముద్రపడిన కోదండరామ్ లాంటి అనేకమందిని ముఖ్యమంత్రి కాగానే ఎందుకు దూరం పెట్టేరని కేసీఆర్ ను ఎన్నడైనా నిలదీశారా ?

ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. పార్టీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అన్నది కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసింది. మధ్యలో వీళ్ళకు ఏమిటి బాధ ? ఏమిటంటే వీళ్ళను రేవంత్ అసలు పట్టించుకోవటంలేదు. బహిరంగసభలు, మీడియా సమవేశాల్లో వీళ్ళకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. రేవంత్ ను వీళ్ళు నాలుగు అంటే వీళ్ళని రేవంత్ పదంటున్నాడు. వీళ్ళు ఎన్ని హెచ్చరికలుచేసినా లెక్కచేయటంలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నాడు రేవంత్. ఎప్పటికైనా రేవంత్ నుండి బీఆర్ఎస్ కు ప్రమాదం పొంచి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్న ఎంఎల్ఏలందరినీ లాగేసుకుని ఎప్పుడు దెబ్బకొడతాడో అన్న టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. విచిత్రం ఏమిటంటే తమ హయంలో ఏవైతే జరిగాయో ఇపుడు కూడ అవే జరుగుతున్నా వాటిపై పదేపదే ఆరోపణలు చేస్తు రేవంత్ ను ఇరుకునపెట్టాలని చూస్తున్నారు.

కొన్ని సంక్షేమహాస్టళ్ళల్లో కలుషితాహారం తిని విద్యార్ధులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఒకరిద్దరు విద్యార్దులు చనిపోయారు కూడా. దీనిపై కేటీఆర్, హరీష్, కవితలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళల్లో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. సంక్షేమహస్టళ్ళల్లో పిల్లలు ఉండటానికి సౌకర్యాలు లేవని ఇపుడు గోలచేస్తున్నారు. మరి పదేళ్ళు అదికారంలో ఉన్నపుడు వీళ్ళెందుకు హాస్టళ్ళల్లో సౌకర్యలు మెరుగుపరచలేదంటే సమాధానం చెప్పటంలేదు. తెలంగాణాతల్లి విగ్రహాన్ని మార్చమని రేవంత్ ను ఎవరు అడిగారని కేటీఆర్ గోలగోల చేస్తున్నారు. 1969లో రూపొందిన తెలంగాణాతల్లి విగ్రహం రూపాన్ని మార్చాలని కేసీఆర్ ను ఎవరడిగారు ?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడూ రైతులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఇపుడూ పడుతున్నారు. అప్పట్లోనూ రైతులపై పోలీసులు కేసులుపెట్టి సంకేళ్ళు వేసి జైళ్ళల్లోకి తోశారు. ఇపుడూ కేసుల్లో రైతులు జైలుకు వెళుతున్నారు. నిత్యావసరాల ధరలు అప్పుడూ ఎక్కువగానే ఉన్నాయి, ఇపుడూ ఆకాశంలోకి ఎగబాకుతున్నాయి. తమహయాంలో టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఫిరాయింపులతో కేసీఆర్ లాక్కుంటే ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలను రేవంత్ లాగేసుకుంటున్నారు. ఆక్రమణలు, మూసీనది ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేశారో ఇపుడు రేవంత్ అదే చేస్తున్నారు. తమ హయాం అంతా రామరాజ్యమని, ఇపుడు రేవంత్ పాలన అంతా రాక్షసపాలన అని కేటీఆర్, హరీష్, కవిత అనుకుంటే సరిపోదు. ఆ విషయాన్ని జనాలు కూడా అనుకోవాలి. అప్పుడే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కనబడుతుంది. లేకపోతే పై ముగ్గురు నేతలు ట్విట్టర్, మీడియా సమావేశాల్లో రేవంత్ పై ఆరోపణలు, విమర్శలు చేసుకుంటు కాలం గడిపేయాల్సిందే. తాము అధికారంలో ఉన్నపుడు అంతా తామిష్టప్రకారం చేసుకున్నారు. ఇపుడు అదేపనిని రేవంత్ చేస్తున్నారంతే. దీనికే కేటీఆర్, హరీష్, కవితలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది.

Read More
Next Story