
బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గందరగోళం ?
పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు మిగిలిన మంత్రులు క్లారిటి ఇవ్వకపోవటం పెద్దలోపమనే చెప్పాలి
ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమవుతోంది. తాజాగా పంచాయితీ ఎన్నికల్లో అమలుచేయాల్సిన బీసీ రిజర్వేషన్లు కూడా అత్యంత వివాదాస్పదమవుతోంది. పంచాయితీఎన్నికల్లో(BC Reservations) బీసీలకు ప్రభుత్వం అమలుచేస్తున్న రిజర్వేషన్లపై కొందరు కోర్టులో వేసిన కేసుపై విచారణ జరుగుతోంది. అలాగే బీసీ సంఘాల నేతలు, (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అండ్ కో ఒక అంకె చెబుతుండగా పంచాయితీ రాజ్ శాఖ మరో అంకెను ప్రకటించింది. దాంతో బీసీలకు అమలవ్వబోయే రిజర్వేషన్ శాతంపై బాగా గందరగోళం పెరిగిపోతోంది.
ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ను రద్దుచేయాలని కోరుతు ఆందోల్ మండలం రాంసాన్ పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కొరబోయిన ఆగమయ్యతో పాటు మరికొందరు దాఖలుచేసిన పిటీషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీమడివాల మహదేవ రజకుల సంఘంతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా పిటీషన్లు దాఖలుచేశారు. పంచాయితీ రాజ్ చట్టం-2018, సెక్షన్ 9(4) ప్రకారం ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల్లో బీసీ—ఏ,బీ,సీ,డీ క్యాటగిరీల వారీగా వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించలేదని తమ పిటీషన్లలో చెప్పారు. నాలుగు రకాలుగా వర్గీకరించకుండా బీసీలకు రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్ల ఫలాలను మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ, గౌడ కులాలు మాత్రమే పొందుతాయని వీరు తమ పిటీషన్లలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల బీసీల్లోని అత్యంత పేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోతారని చెప్పారు. కాబట్టి ఏ,బీ,సీ,డీలుగా బీసీ రిజర్వేషన్లను వర్గీకరించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కోరుతు అప్పటివరకు ఎన్నికల నిర్వహణకు జారీచేసిన జీవో 46ను నిలిపేయాలని వీళ్ళు హైకోర్టును కోరారు.
ఇపుడు విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల్లో మొదటగా పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులోభాగంగా పంచాయితి ఎన్నికలకు పంచాయితీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్ ప్రకారం మూడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 27, నవంబర్ 30వ తేదీ, డిసెంబర్ 3వ తేదీతో నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనిప్రకారం డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17వ తేదీన ఎన్నికలు జరిగి అవేరోజుల్లో కౌంటింగ్ జరిగి ఫలితాలు కూడా వచ్చేస్తాయి.
ఈవిషయాలు ఇలాగుండగా పంచాయితీ రిజర్వేషన్లశాతం బాగా వివాదాస్పదమవుతోంది. దీనికి కారణం ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం మాట తప్పడమే. చట్టప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదు కాబట్టి పార్టీపరంగా అయినా 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని మంత్రివర్గ సమావేశంలో చర్చజరిగింది. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రభుత్వం లేదా పార్టీ నుండి ఎలాంటి ప్రకటనా రాలేదు. దాంతో గందరగోళం మొదలైంది. ఈగందరగోళం ఇలా ఉండగానే మొదటి దశ నోటిఫికేషన్ లో అమలవుతున్న రిజర్వేషన్లపై వివాదం పెరిగిపోతోంది. కారణంఏమిటంటే బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లు 21.39శాతంగా పంచాయితీ రాజ్ శాఖ ప్రకటించటమే.
పంచాయితీరాజ్ శాఖేమో బీసీలకు 21.39 రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్లు ప్రకటించగా బీసీ సంఘాల నేతలు, కేటీఆర్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. బీసీలకు ప్రభుత్వం అమలుచేస్తున్నది కేవలం 17శాతం రిజర్వేషన్లు మాత్రమే అని నానా గోలచేస్తున్నారు. 17శాతం రిజర్వేషన్లు అమలుచేస్తు 21.39శాతం అమలుచేస్తున్నట్లు తప్పుడులెక్కలు ప్రకటిస్తోందని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తుతున్నారు. తమహయాంలో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు కల్పించామని కేటీఆర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు.
అయితే వాస్తవం ఏమిటంటే ఇపుడు బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నది 21.39శాతం మాత్రమే. కేటీఆర్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ హయాంలో అమలైన రిజర్వేషన్లు 24శాతం కాదు 22.78శాతం మాత్రమే. అంటే కేటీఆర్ అబద్ధాలు చెబుతు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సంఘాల నేతలను రెచ్చగొడుతున్న విషయం అర్ధమవుతోంది. కేసీఆర్ హయాంలోనే బీసీల రిజర్వేషన్లు 34శాతం నుండి 23శాతానికి తగ్గిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈవిషయాన్ని కేటీఆర్ అండ్ కో ఎక్కడా చర్చకు రాకుండా చూసుకుంటున్నారు. బీసీ సంఘాల నేతలు కూడా ఈ విషయాన్ని గట్టిగా ఎక్కడా ప్రముఖంగా ప్రస్తావించటంలేదు.
ఇదే విషయమై పంచాయితీరాజ్ శాఖ ఒక వివరణ ఇచ్చింది. అదేమిటంటే నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీ పంచాయితీలు పెరగటం, 220 పంచాయితీలు మున్సిపాలటిల్లో విలీనం అవటం, ఉమ్మడి వరంగల్ జిల్లా, మంగపేట మండలంలో ఎన్నికలు జరగకపోవటం లాంటి కారణాల వల్ల బీసీల రిజర్వేషన్లు తగ్గినట్లు క్లారిటి ఇచ్చింది. అయితే బీసీ సంఘాల నేతలు దీన్ని పట్టించుకోవటంలేదు. ఏదేమైనా బీసీ రిజర్వేషన్లు 21.39శాతానికి పరిమితమవ్వటంపై ప్రభుత్వం నుండి సరైన పద్దతిలో క్లారిటి రాలేదన్న విషయం అర్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల శాతం ఎందుకు తగ్గిందన్న విషయాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు మిగిలిన మంత్రులు క్లారిటి ఇవ్వకపోవటం పెద్దలోపమనే చెప్పాలి. రిజర్వేషన్ల ఖరారు కాకముందే రేవంత్ లేదా మంత్రులు ఈ విషయమై క్లారిటి ఇచ్చుండాల్సింది.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాల నేతలు, కేటీఆర్ తదితరులు ఆరోపణలు చేసిన తర్వాత మాత్రమే పంచాయితీరాజ్ శాఖ క్లారిటి ఇచ్చిందన్నది గమనార్హం. ఇక్కడే ప్రభుత్వ ముఖ్యుల్లో ఏస్ధాయిలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నదో అర్ధమవుతోంది. పంచాయితీరాజ్ శాఖ క్లారిటి ఇచ్చేటప్పటికే బీసీ సంఘాల నేతలు, కేటీఆర్ ఆరోపణలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. 2019 ఎన్నికల్లో పోల్చినపుడు 8 జిల్లాల్లో హనుమకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి జల్లాల్లో పంచాయితీల్లో బీసీల రిజర్వేషన్లు పెరిగాయి. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంమొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారుచేసింది. అయితే రేవంత్ ప్రభుత్వం సుప్రింకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారం మండలాన్ని, పంచాయితీని యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. దీనివల్ల కూడా బీసీలకు రిజర్వేషన్ కొంత తగ్గింది. అయితే ఈ విషయాలను బీసీలకు చెప్పుకోవటంలో కూడా రేవంత్ ప్రభుత్వం విఫలమైంది.
17శాతం రిజర్వేషనే కరెక్ట్ : పర్వతం
పంచాయితీల్లో 17 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నదే కరెక్ట్ అని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ లెక్షిరర్, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘బీఆర్ఎస్ హయాంలో ఇపుడు జరిగిన దానికన్నా అన్యాయమే జరిగింది’’ అని ఆరోపించారు. పంచాయితీ రిజర్వేషన్లు 21.39 శాతం అని పంచాయితీరాజ్ శాఖ చేసిన ప్రకటనను తప్పుపట్టారు. ‘‘బీసీ రిజర్వేషన్లను రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అమలుచేయటంలో విఫలమైంది’’ అని మండిపడ్డారు. ‘‘చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రిజర్వేషన్లను కూడా అమలుచేయలేకపోయింది’’ అని ధ్వజమెత్తారు. ఇదేసమయంలో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు అమలుచేసినట్లు కేటీఆర్ చెప్పటాన్ని కూడా తప్పుపట్టారు. ‘‘బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుజరగటంలేదన్న విషయం బీసీల్లోకి ఇపుడు వెళ్ళింది’’ అని చెప్పారు. ‘‘రాజ్యంగ ప్రసాదించిన హక్కులను మాత్రమే బీసీలు అడుగుతున్నారు’’ అని గుర్తుచేశారు. ‘‘జనాభా లెక్కలను బయటపెట్టకపోవటమే అసలైన సమస్యగా మారింది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘కేసీఆర్ హయాంలో కూడా బీసీలకు ఎక్కువగా అన్యాయం జరిగినా అప్పుడు ఎక్స్ పోజ్ కాలేదు’’ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన రిజర్వేషన్లు 23శాతం మాత్రమే అని చెప్పారు.
అమలవుతున్నది 17శాతమే : ప్రొఫెసర్ సింహాద్రి
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం 34శాతం నుండి 24శాతానికి తగ్గించి పంచాయితీ ఎన్నికల్లోఅమలుచేసింది 18శాతం మాత్రమే’’ అని సింహాద్రి అన్నారు. ‘‘ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయటం వల్లే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోయింది’’ అని చెప్పారు.
ప్రభుత్వంలోనే గరందగోళరం : వకుళాభరణం
‘‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో పోను బీసీలకు కొన్ని జిల్లాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు 17శాతమే’’ అని అన్నారు. ‘‘కేటీఆర్ చెప్పుకుంటున్నట్లు వాళ్ళహయాంలో కూడా 24శాతం రిజర్వేషన్లు అమలుకాలేదు’’ అని వకుళాభరణం అన్నారు. ‘‘అమలవుతున్న రిజర్వేషన్లపై సరైన క్లారిటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను’’ అని వకుళాభరణం చెప్పారు.

