కేసీయార్ దూరంగా పెట్టేశారా ?
కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి చేస్తారు..ఎప్పుడేమి మాట్లాడుతారో తెలీదు. ఎవరిపై ప్రేము చూపిస్తారో ? ఎవరిని దూరంగా పెడతారో కూడా తెలీదు.
కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి చేస్తారు..ఎప్పుడేమి మాట్లాడుతారో ఎవరికీ తెలీదు. ఎవరిపై ప్రేము చూపిస్తారో ? ఎవరిని దూరంగా పెడతారో కూడా తెలీదు. ఇపుడు విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కూతురు కల్వకుంట్ల కవితను కేసీయార్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదు. కవితను తల్లి శోభారావు, అన్న కేటీయార్, బావ హరీష్ రావులు కలిశారు. భర్త దేవనపల్లి అనీల్ కుమార్ కూడా చాలాసార్లు కలిశారు. జైల్లో ఉన్న కవితను ఊరడించటానికి, ధైర్యం చెప్పటానికే వీళ్ళంతా కలిసింది.
మరి ఇదేవిషయమై కేసీయార్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కవితను ఎందుకు కలవలేదు ? పార్టీ శ్రేణుల్లో ఇదే విషయమై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హరీష్ రావు ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్ళి కవితతో భేటీ అయ్యొచ్చారు. హరీష్ భేటీ నేపధ్యంలోనే కేసీయార్ వైఖరిపై చర్చలు మొదలయ్యాయి. కూతురు కవిత అంటే కేసీయార్ కు చాలా ప్రేమని బాగా ప్రచారంలో ఉంది. అంతటి ప్రేమున్న కూతురు కష్టాల్లో ఉంటే జైలుకు వెళ్ళి పరామర్శించి కేసీయార్ ధైర్యం చెబుతారని అందరు భావించారు. అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా కేసీయార్ మాత్రం ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు, కవితను పరామర్శించలేదు. మరి కూతురు జైలుకు వెళ్ళిన విషయమై కేసీయార్ ఆలోచన ఏమిటో కూడా అర్ధంకావటంలేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నేతల సమావేశంలో ఒకసారి కేసీయార్ మాట్లాడుతు తన కూతురు ఎలాంటి తప్పుచేయలేదని, కడిగిన ముత్యంలాగ బయటకు వస్తుందని మాత్రమే చెప్పారు. అప్పటికింకా కవిత అరెస్టు జరగలేదు. ఈడీ విచారణ మాత్రమే జరిగింది. తర్వాత ఈడీ విచారణకు కూడా కవిత సహకరించకపోతే ఉన్నతాదికారులే హైదరాబాద్ వచ్చి ఇంట్లోనే కవితను అరెస్టుచేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. అప్పటినుండి కవిత అరెస్టు, కేసు గురించి ఎక్కడా కేసీయార్ కనీసమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. కవితను కలవటానికి సోదరుడు కేటీయార్, బావ హరీష్ ఇప్పటికే మూడు,నాలుగు సార్లు తీహార్ జైలుకు వెళ్ళొచ్చారు. చివరకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా తీహార్ జైల్లో ఉన్న కవితను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే కేసీయార్ వైఖరి ఏమిటో పార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. కవితకు బెయిల్ వచ్చేంతవరకు దూరంగా ఉండాలని కేసీయార్ అనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కవిత విషయం చూస్తే బెయిల్ ఎప్పుడు దక్కుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. మార్చి రెండోవారంలో అరెస్టయిన తర్వాత ఈడీ ఢిల్లీలోని తన ఆపీసులోనే మూడు రోజులు విచారించింది. తర్వాత తీహార్ జైలుకు తరలించింది. అప్పటి నుండి సుమారు వందరోజులుగా కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం కవిత ఎంత ప్రయత్నించినా దొరకటంలేదు. ముందు తనకు అనారోగ్యమన్నారు, తర్వాత కొడుకు చదువు, పరీక్షలన్నారు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రచారం చేయాలని చెప్పారు. ఎన్ని కారణాలతో బెయిల్ కు దరఖాస్తులు చేసుకున్నా ప్రతిసారి రెజెక్టవుతునే ఉంది. కవిత బెయిల్ కు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఈడీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించిన సాక్ష్యాలను చూపిస్తోంది.
కవిత నేపధ్యం ఎంత బలంగా ఉందో అన్న విషయాలను ఈడీ వివరిస్తు, సాక్ష్యులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాదిస్తోంది. దాంతో ఈడీ వాదనలతో ఏకీభవిస్తున్న కోర్టు కవిత బెయిల్ ను తిరస్కరిస్తోంది. ఇప్పటికి కనీసం ఏడుసార్లయినా కవిత బెయిల్ ను కోర్టు తిరస్కరించుంటుంది. బెయిల్ కోసం కవిత ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటుంది ? కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. ఈ నేపధ్యంలోనే కూతురు కవితకు మనోధైర్యం చెప్పటానికి కేసీయార్ తీహార్ జైలుకు వెళ్ళి కవితను ఎందుకు కలవటంలేదో అర్ధంకావటంలేదు.