కేసీయార్ కుటుంబంపై హాట్ టాపిక్ ఏమిటో తెలుసా ?
x
KCR, KTR, Kavitha

కేసీయార్ కుటుంబంపై హాట్ టాపిక్ ఏమిటో తెలుసా ?

పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ కుటుంబం దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. గడచిన 24 ఏళ్ళుగా ప్రతి పార్లమెంటుఎన్నికల్లోను కేసీయార్ కుటుంబం పోటీచేస్తునే ఉంది.


పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ కుటుంబం దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. గడచిన 24 ఏళ్ళుగా ప్రతి పార్లమెంటుఎన్నికల్లోను కేసీయార్ కుటుంబం పోటీచేస్తునే ఉంది. అయితే కేసీయార్ లేకపోతే కూతురు కల్వకుంట్ల కవిత క్రమంతప్పకుండా పోటీలో ఉంటున్నారు. అలాంటిది ఇపుడు జరుగుతున్న ఎన్నికలకు మాత్రం కుటుంబం అంతా ఎందుకు దూరంగా ఉంటున్నది ? ఇపుడిదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అందుబాటులోని సమాచారం ఏమిటంటే గెలుపుపై నమ్మకంలేకనే కేసీయార్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేసిన కేసీయార్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఉద్యమపార్టీగా టీఆర్ఎస్ 2001లో ఏర్పాటైన తర్వాత 2004లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు సిద్ధిపేట అసెంబ్లీకి, కరీంనగర్ పార్లమెంటుకు కేసీయార్ పోటీచేశారు. రెండు నియోజకవర్గాల్లోను గెలిచిన కేసీయార్ సిద్ధిపేట ఎంఎల్ఏగా రాజీనామా చేశారు. ఆ స్ధానానికి జరిగిన ఉపఎన్నికలో హరీష్ రావు పోటీచేసి గెలిచారు. అప్పటినుండి హరీష్ సిద్ధిపేటలో పోటీచేసి గెలుస్తునే ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేసీయార్ అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చాలాకాలం కంటిన్యు అయ్యారు. తర్వాత ప్రత్యేక తెలంగాణా సెంటిమెంటును జనాల్లో బలోపేతంచేయటం కోసం 2006లో రాజీనామాచేశారు. ఉపఎన్నికలో గెలిచి మళ్ళీ 2008లో కూడా రాజీనామా చేశారు. రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా పోటీచేసి గెలిచారు.

2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాకుండా మహబూబ్ నగర్ నుండి పోటీచేసి గెలిచారు. ఇక్కడ ఎంపీగా ఉన్నపుడే 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గజ్వేలు ఎంఎల్ఏగా, మెదక్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావటంతో మెదక్ ఎంపీగా రాజీనామా చేసి కొత్తా ప్రభాకరరెడ్డిని పోటీచేయించి గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లోనే కేసీయార్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా పోటేచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో కేసీయార్ పోటీచేయలేదుకాని కవిత రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. 2022లో టీఆర్ఎస్ ను కేసీయార్ బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కేసీయార్ పావులు కదిపారు. ఆ ఊపులోనే మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక ఎన్నికల్లో కూడా పోటీచేయటానికి చాలా ప్లాన్లు వేసుకున్నారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది.

దాంతో జాతీయరాజకీయాలపై దృష్టి తగ్గించిన కేసీయార్ తెలంగాణాలో మళ్ళీ పార్టీని ఎలా ఉరకలెత్తించాలా అని ఆలోచిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేలుతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేసిన కేసీయార్ గజ్వేలులో మాత్రమే గెలిచారు. కామారెడ్డిలో ఓడిపోవటం కేసీయార్ రాజకీయ చరిత్రలో అదే మొదటిసారి. తాను ఓడిపోవటమే కాకుండా పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పార్టీతో పాటు తన పరిపాలనపైన జనాల్లో ఎంత మంటుందో కేసీయార్ కు అర్ధమైనట్లుంది. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత అరెస్టయి జైల్లో ఉన్నారు. కూతురు అరెస్టు, జనాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, నేతలు పార్టీని వదిలేస్తుండటం లాంటి అనేక కారణాలతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి కేసీయార్ కుటుంబం ధైర్యంచేయలేదని అర్ధమవుతోంది.

Read More
Next Story