కేసీయార్ జిల్లాల పర్యటన ఇందుకేనా ?
పై మూడుజిల్లాల్లో తనపర్యటనలో పాల్గొనే నేతలు ఎవరు ? క్యాడర్ స్పందన ఎలాగుంటుందని తెలుసుకోవటమే కేసీయార్ అసలుద్దేశ్యం అయ్యుండచ్చు. పార్టీ బాగా బలహీనపడిపోతోంది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జిల్లాల పర్యటనకు కేసీయార్ మొదటిసారి వస్తున్నారు. ఆదివారం సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ మూడుజిల్లాల పర్యటన ఎందుకంటే ఎండినపంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పటానికి. ఎన్నికల సమయంలో ఓట్లడగటానికి ప్రజల్లోకి వెళ్ళాల్సిన కేసీయార్ ఎండిన పంటలను పరిశీలిస్తారని, రైతులతో మాట్లాడుతారని పార్టీ ప్రకటించటమే విచిత్రంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీయార్ పెద్దగా జనాల్లోకి వచ్చిందిలేదు. ఒకసారి నల్గొండ బహిరంగసభలో మాత్రమే పాల్గొన్నారు. అప్పటినుండి మళ్ళీ కనబడలేదు. అలాంటిది ఇపుడు ఎన్నికలు ఊపందుకుంటున్న నేపధ్యంలో రైతుల పరామర్శపేరుతో జిల్లాల టూర్ పెట్టుకున్నారు. అయితే కేసీయార్ జిల్లాల పర్యటన అసలు ఉద్దేశ్యం వేరని తెలుస్తోంది.
జిల్లాల టూర్ అంటేనే రాబోయే ఎన్నికల్లో పార్టీనీ గెలిపించుకునేందుకే అని అర్ధమవుతోంది. అయితే కేసీయార్ ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది అనుమానమే. ఎందుకంటే కేసీయార్ ఎంత ప్రయత్నించినా కారు జోరందుకునేట్లు కనబడటంలేదు. కీలకనేతల్లో చాలామంది పార్టీని వదిలేస్తున్నారు. ఉన్నకొద్దిమంది కూడా అంత యాక్టివ్ గా లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో జిల్లాల పర్యటనల్లో బీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏమిటన్నది అర్ధంకావటంలేదు. లాభనష్టాలతో సంబంధంలేకుండా పార్టీ అధినేతగా కేసీయార్ జిల్లాలు పర్యటించక తప్పదు కాబట్టే వస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు పంటలు ఎండిపోయినా రైతాంగాన్ని కేసీయార్ పట్టించుకోలేదు. అలాంటిది ప్రతిపక్షంలోకి రాగానే రైతులకు కేసీయార్ ముచ్చట్లు చెబుతారని పార్టీ ప్రకటించటం విడ్డూరమనే చెప్పాలి.
పై మూడుజిల్లాల్లో తనపర్యటనలో పాల్గొనే నేతలు ఎవరు ? క్యాడర్ స్పందన ఎలాగుంటుందని తెలుసుకోవటమే కేసీయార్ అసలుద్దేశ్యం అయ్యుండచ్చు. ఎందుకంటే పార్టీ బాగా బలహీనపడిపోతోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించటమే కష్టమైపోయింది. పైగా అభ్యర్ధులుగా ప్రకటించిన వాళ్ళు కూడా ఎంతమంది నామినేషన్లు వేస్తారో తెలీటంలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో గ్రౌండ్ లెవల్లో పార్టీపరిస్ధితి ఎలాగుందో తెలుసుకునేందుకే సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాల్లో స్వయంగా పర్యటిస్తున్నట్లున్నారు. పైమూడుజిల్లాల్లో మొన్నటి అసెంబ్లీఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినేసింది. ఈ పర్యటన ఆధారంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారుజోరును కేసీయార్ అంచనా వేసుకుంటారేమో.
పంటలు ఎండిపోవటానికి, సాగునీటిని విడుదలచేయకపోవటంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీయార్ మండిపడటం చాలా సహజం. కాని కేసీయార్ హయాంలో జరిగిన అవకతవకలు, నాసిరకం నిర్మాణాలవల్లే కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులు మూలపడ్డాయి. నాసిరకం నిర్మాణాల కారణంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లోని నీటిని ఇరిగేషన్ అధికారులు బయటకు వదిలేయాల్సొచ్చింది. దాంతో సాగునీటికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందొచ్చింది. అలాగే ఇది వేసవికాలమని అందరికీ తెలుసు. వేసవికాలంలో అకాల వర్షాలు తప్ప రుతుపవనాల ఆధారంగా వర్షాలు కురవవు. ప్రాజెక్టుల్లోని నీటిని బయటకు వదిలేసిన తర్వాత, వేసవికాలంలో నీరందకపోతే పంటలు ఎండిపోవటం సహజమే.
ప్రాజెక్టుల దుస్ధితికి, పంటలు ఎండిపోవటానికి కేసీయార్ కూడా కారణమే అని అందరికీ తెలుసు. కాకపోతే ఇది ఎన్నికలపర్యటన కాబట్టి కచ్చితంగా రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడతారనటంలో సందేహంలేదు. దాంతో ప్రభుత్వం కూడా కేసీయార్ పై ఎదురుదాడికి దిగుతుంది. హోలు మొత్తంమీద చూస్తే కేసీయార్ పర్యటన వల్ల రైంతాంగానికి జరిగే మేలు ఏమీ కనబడటంలేదు. ప్రభుత్వాన్ని నాలుగుతిట్టి తాను ప్రభుత్వంతో పది తిట్టించుకోవటంతప్ప ఇంకేమీజరగదు. కేసీయార్ కు పార్టీపరంగా మద్దతు కూడా తగ్గిపోతోంది. పార్టీనేతల్లో ఎవరుంటారో ఎవరెళ్ళిపోతారో కూడా తెలీటంలేదు. అందుకనే నేతలను కాపాడుకునేందుకు, క్యాడర్లో జోష్ నింపేందుకే కేసీయార్ జిల్లాల పర్యటన పెట్టుకున్నట్లున్నారు.