జగనే సీఎం కావాలని కేసీయార్ ఎందుకు కోరుకుంటున్నారు ?
x
Jagan and KCR

జగనే సీఎం కావాలని కేసీయార్ ఎందుకు కోరుకుంటున్నారు ?

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణాలో ఇబ్బందులు తప్పవని కేసీయార్ భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తట్టుకోవటం కేసీయార్ వల్లకావటంలేదు.


ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని తనకు సమాచారం ఉంది’..ఈమధ్యనే ఒక ఛానల్లో కేసీయార్ వ్యక్తంచేసిన అభిప్రాయం. దీన్ని అభిప్రాయం అనేకన్నా కేసీయార్ కోరిక అంటే బాగుంటుంది. జగన్ గనుక రెండోసారి అధికారంలోకి వస్తే కేసీయార్ రాజకీయం కొంతవరకు సాఫీగానే సాగుతుంది. ఒకవేళ జగన్ కాకుండా చంద్రబాబానాయుడు అధికారంలోకి వస్తే కేసీయార్ రాజకీయం చాలా ఇబ్బంద్దులో పడుతుందనటంలో అనుమానం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణాలో తనకు ఇబ్బందులు తప్పవని కేసీయార్ భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డిని తట్టుకోవటం కేసీయార్ వల్లకావటంలేదు.

జీవితకాలపు ముఖ్యమంత్రిగా ఉంటామనే భ్రమలో అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. దాని పర్యవసానాలను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీయార్ చేస్తున్న ఆరోపణలు, మాట్లాడుతున్న మాటలు, తిడుతున్న తిట్లలోనే ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతిపక్షమే ఉండకూడదన్న ఆలోచనతో టీడీపీ, కాంగ్రెస్ లను చీల్చి చెండాడారు. కేసీయార్ ధాటికి టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. ‘ఓటుకునోటు’ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేసీయార్ తెలుగుదేశంపార్టీని అసెంబ్లీతో పాటు రాష్ట్రంలో కూడా లేకుండా భూస్ధాపితం చేసేశారు. తర్వాత కాంగ్రెస్ ను కూడా బొందపెట్టేందుకు ప్రయత్నించినా పూర్తిగా సాధ్యంకాలేదు.

గతం వెంటాడుతోందా ?

అప్పట్లో తానుచేసిన ప్రయత్నాలన్నీ ఇపుడు కేసీయార్ కళ్ళముందు కదలాడుతున్నట్లున్నాయి. రేవంత్ ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండి బీఆర్ఎస్ నుండి వలసలను ప్రోత్సహిస్తు ప్రతిరోజు కేసీయార్ ను టెన్షన్ పెడుతునే ఉన్నారు. ఏరోజు ఏ ఎంఎంఎల్ఏ పార్టీని వదిలేస్తారో తెలీక కేసీయార్ టెన్షన్ పడిపోతున్నారు. అందుకనే ఇప్పటికే పార్టీని వదిలేసిన ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను బూతులు తిడుతున్నారు. తాను అధికారంలో ఉండగా కాంగ్రెస్ విషయంలో చేయలేని పనిని ఇపుడు బీఆరఎస్ విషయంలో రేవంత్ సక్సెస్ చేస్తారేమోననే టెన్షన్ కేసీయార్ ను రోజూ పట్టి పీడిస్తోంది. అందులో నుండి కాంగ్రెస్ ను నోటికొచ్చినట్లు తిడుతున్నది. ఒక్క రేవంత్ నే తట్టుకోలేకపోతుంటే ఏపీలో చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే అంతే సంగతులు.

చంద్రబాబు, రేవంత్ గురు శిష్యులన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణాలో కూడా చంద్రబాబు ఆలోచనలే సాగుతాయనటంలో సందేహంలేదు. చంద్రబాబు, రేవంత్ వేర్వేరు క్యాంపుల్లో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలుండవు. అయితే అనధికారికంగా రెండురాష్ట్రాల్లో చంద్రబాబు మాటే చెల్లుబాటవుతుందనే చర్చ మొదలైంది. తనకు వ్యతిరేకంగా ఇద్దరు కలిస్తే ఇబ్బందులు తప్పవని కేసీయార్లో భయం పెరిగిపోతున్నట్లుంది. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను భూస్ధాపితం చేయటానికి వ్యూహాలు పన్నేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రయత్నాలను బీజేపీ కూడా అడ్డుకోదు. ఎందుకంటే తెలంగాణాలో కారుపార్టీ భూస్ధాపితమైపోవటమే బీజేపీకి చాలా అవసరం. తనకు అవసరమైన పనిని రేవంత్, చంద్రబాబు కలిసి చేస్తుంటే బీజేపీకి హ్యాపీనేకదా. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టయి జైల్లో ఉన్నారు. కేసీయార్ కూడా జైలుకు వెళ్ళటం ఖాయమని రేవంత్ తో పాటు మంత్రులందరు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

కేసీయార్ నైతికబలం పెరుగుతుందా ?

రేపటి ఎపీ ఎన్నికల్లో అధికారంలోకి జగనే వస్తే కేసీయార్ కు కాస్త నైతికంగా ఊరట లభించినట్లవుతుంది. టెక్నికల్ గా కేసీయార్ కు జగన్ బహిరంగంగా సాయం చేయలేకపోవచ్చు కాని చంద్రబాబు దూకుడుండదు. కేసీయార్ విషయంలో రేవంత్ ప్రయత్నాలకు తెరవెనుక నుండి చంద్రబాబు నైతిక మద్దతుంటుందనటంలో సందేహంలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఏపీలో మళ్ళీ జగనే సీఎం కావాలని కేసీయార్ బలంగా కోరుకుంటున్నారనటంలో సందేహంలేదు. అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో తనకు మద్దతుగా జగన్ పనికొస్తారని కేసీయార్ భావిస్తుండచ్చు కూడా. అందుకనే జగనే రెండోసారి సీఎం కావాలని కేసీయార్ బలంగా కోరుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story