కేటీయార్కు ‘ఉస్మానియా’తో సమస్యేంటి ?
దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటి కాంపౌండులో దీక్ష చేయాలని ఛాలెంజ్ చేశారు. కేటీయార్ తో పాటు హరీష్ కూడా దీక్షలో కూర్చోవాలని రేవంత్ కండీషన్ పెట్టారు.
డీఎస్సీ నియామకాలు, నోటిఫికేషన్ల రద్దు వివాదం నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటి కాంపౌండులో దీక్ష చేయాలని ఛాలెంజ్ చేశారు. కేటీయార్ తో పాటు హరీష్ కూడా దీక్షలో కూర్చోవాలని రేవంత్ కండీషన్ పెట్టారు. 11వేల టీచర్ పోస్టుల భర్తీతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీన్ని నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ ఛాలెంజ్ కు కేటీయార్ స్పందించలేదు. దాంతో రేవంత్ ఛాలెంజ్ పై ఎందుకు స్పందించలేదు ? ఉస్మానియాతో కేటీయార్కు సమస్య ఏమిటనే చర్చ పెరిగిపోతోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా మెగాడీఎస్సీని ప్రభుత్వం ప్రకటించాలని 11 వేల టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ పరిమితం కాకూడదన్నది నిరుద్యోగుల డిమాండ్. సరే, దీనికి రేవంత్ ఏదో జవాబిచ్చి నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చే పనిలో ఉన్నారు. అయితే నిరుద్యోగుల మంటకు కేటీయార్ ఆజ్యం పోస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీచేయాల్సిందే అని కేటీయార్ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. కేటీయార్ అసలు ఉద్దేశ్యం నిరుద్యోగులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టడమే అని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావిస్తు కేసీయార్, కేటీయార్ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే విద్యార్ధులను రెచ్చగొడతారంటు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్ లో దమ్ముంటే కేటీయార్, హరీష్ దీక్ష చేయాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్ దీక్ష, ఉస్మానియా యూనివర్సిటి అనగానే కేటీయార్ చప్పుడుచేయలేదు. ఇక్కడే చాలామందికి కేటీయార్ పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే నిరుద్యోగుల డిమాండ్ పరిష్కారమవ్వాలని కేటీయార్కు ఉంటే ఉస్మినియా కాంపౌండులో దీక్ష చేయచ్చు కదా ? ఎందుకు దీక్ష చేస్తానని చెప్పటంలేదు ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. అదేమిటంటే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపు పెరిగిందంటంటే అది ఉస్మానియా విద్యార్ధుల పుణ్యమే. అప్పటివరకు ఉద్యమం ఏదోలా నడుస్తోంది. ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటి విద్యార్ధులు ఎంటరయ్యారో అప్పటినుండే ఉద్యమం ఊపందుకుంది. ఇతర రాజకీయపార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని విద్యార్ధిలోకాన్ని ఉస్మానియా విద్యార్ధి సంఘాల నేతలు ఏకతాటిపైకి తెచ్చారు.
ఆ సమయంలోనే యూనివర్సిటి క్యాంపస్ లోకి టీడీపీలో కీలకనేతగా ఉన్న నాగం జనార్ధనరెడ్డి ఎంటరయ్యారు. విద్యార్ధి నేతలకు నాగంకు మధ్య ఉద్యమం విషయంలోనే వాదన జరిగి చివరకు ఆయన్ను విద్యార్ధులంతా కలిసి చితక్కొట్టి ఆయన కారును ధ్వంసం చేసేశారు. అప్పటినుండి రాజకీయ నేతలు యూనివర్సిటీ క్యాంపస్ లోకి ఎంటరవ్వాలంటే వెనకాడేవారు. ఆ తర్వాత కేసీయార్ నిరాహరదీక్ష చేశారు. కొద్దిరోజులు కాగానే కేసీయార్ దీక్షను విరమించుకున్నారు. అందుకు యూనివర్సిటి విద్యార్ధులు అభ్యంతరం చెప్పారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని దీక్షను మాత్రం మధ్యలో విరమించేందుకులేదని పట్టుబట్టారు. అయినా సరే కేసీయార్ దీక్ష విరమణకే మొగ్గుచూపారు. దాంతో విద్యార్ధులంతా నిమ్స్ ఆసుపత్రి ప్రాంతంలో రచ్చరచ్చ చేశారు. ఆసుపత్రితో పాటు టీఆర్ఎస్ ఆఫీసుపైన దాడులు చేశారు. దాంతో యూనివర్సిటి విద్యార్ధుల దెబ్బకు కేసీయార్ మళ్ళీ దీక్షకు కంటిన్యు చేశారు.
విద్యార్ధులను కాదని తాను దీక్షను విరమిస్తే ఏమి జరుగుతుందో కేసీయార్ కు అనుభవపూర్వకంగా తెలిసింది. అందుకనే మరికొద్దిరోజులు దీక్షను కంటిన్యుచేసింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో ఉస్మానియా విద్యార్ధులే ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. తర్వాత పరిణామాల్లో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికే యూనివర్సిటి విద్యార్ధులతో కేసీయార్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గ్యాప్ పెరిగిందే కాని తగ్గలేదు. యూనివర్సిటి విద్యార్ధి నేతల్లో చాలామందిని కలవటానికి కూడా కేసీయార్ ఇష్టపడలేదు. యూనివర్సిటి అంటేనే కేసీయార్ ఎందుకో శతృభావంతోనే ఉండేవారు. కేసీయార్ హయాంలో కూడా విద్యార్ధులు తమ డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమాలనే ఎంచుకున్నారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటి అంటేనే కేసీయార్ మండిపోయేది.
ఈ నేపధ్యంలోనే ఒకసారి యూనివర్సిటి కాంపౌండులో కేసీయార్ హెలికాప్టర్లో దిగాల్సొచ్చింది. అయితే అందుకు విద్యార్ధులు అనుమతించలేదు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గ్రౌండ్ లో నుండి విద్యార్ధులు పెద్దఎత్తున ఆందోళనచేశారు. ఆందోళనను లెక్కచేయకుండా కిందకు దిగితే విద్యార్ధులు ఏమిచేస్తారో అన్న భయంతో చివరకు కేసీయార్ అట్నుంచి అటే వెళ్ళిపోయారు. అప్పటినుండి కేసీయార్ అధికారంలో ఉన్నంతవరకు యూనివర్సిటి మొహమే చూడలేదు. కేసీయార్ అనుభవాలు బాగా తెలిసిన వ్యక్తి కావటంతో కేటీయార్ కూడా యూనివర్సిటిలోకి అడుగుపెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. విద్యార్దుల దృష్టిలో కేసీయార్-కేటీయార్ మధ్య తేడాలేదు కాబట్టే ఇద్దరి విషయంలోను యూనివర్సిటి విద్యార్ధులు ఒకేలా వ్యవహరించేవారు.
అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ అగ్రనేతల్లో చాలామంది ఉస్మానియా క్యాంపస్ లోకి అడుగుపెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఏ విద్యార్ధుల కారణంగా అయితే తెలంగాణా ఉద్యమానికి ఒక్కసారిగా ఊపొచ్చిందో అదే విద్యార్ధులు కత్తికట్టి బీఆర్ఎస్ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాలన్నీ బాగా తెలుసు కాబట్టే ఇపుడు కేటీయార్ను యూనివర్సిటి క్యాంపసులో దీక్ష చేయాలని రేవంత్ ఛాలెంజ్ చేస్తున్నారు. క్యాంపసులోకి అడుగుపెడితే ఏమవుతుందో తెలుసు కాబట్టే కేటీయార్ కూడా రేవంత్ ఛాలెంజ్ కు సమాధానం ఇవ్వటంలేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపసులోకి కేటీయార్ అడుగుపెట్టకపోవటానికి ఇది కారణం.