అధ్యక్ష పదవికి బీజేపీలో ఎందుకింత డిమాండ్ ?
x

అధ్యక్ష పదవికి బీజేపీలో ఎందుకింత డిమాండ్ ?

ఒకపుడు పార్టీ అధ్యక్షపదవిని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కారు. పోటీ అంతా ఒక దశాబ్దంగానే మొదలైంది.


కొద్దిరోజులుగా తెలంగాణా బీజేపీలో ఒక ప్రచారం బాగా పెరిగిపోతోంది. అదేమిటంటే పార్టీ తెలంగాణా అధ్యక్షపదవి కోసం నేతలమధ్య విపరీతమైన పోటీ పెరిగిపోతోందని. ఒకపుడు పార్టీ అధ్యక్షపదవిని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కారు. పోటీ అంతా ఒక దశాబ్దంగానే మొదలైంది. ఎందుకింత కారణం అంటే కేంద్రంలో అధికారంలోకి రావటమనే చెప్పాలి.

ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తొందరలోనే పార్టీ బాధ్యతలనుండి తప్పుకోబోతున్నారు. అందుకని తెలంగాణాకు కొత్తగా అధ్యక్షుడిని నియమించే విషయంలో జాతీయ నాయకత్వం కొందరి పేర్లను పరిశీలిస్తోంది. కాబట్టి అధ్యక్షపదవి కోసంమ కొందరు సీనియర్లు, ఎంపీలుగా గెలిచిన వారిలో కొందరు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అధ్యక్షపదవికి ప్రయత్నాలు చేసుకుంటున్నారంటు కొందరి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఎవరంటే మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందనరావు. వీరిలో అర్వింద్ తప్ప మిగిలిన ముగ్గురు మొదటిసారి ఎంపీలుగా గెలిచారు. ఈటల, అరుణ, రఘునందన్ గతంలో ఎంఎల్ఏలుగా పనిచేశారు. వీళ్ళల్లో కూడా డీకే, ఈటల మంత్రులుగా కూడా పనిచేశారు. ఈటల, ధర్మపురి బీసీ నేతలైతే, అరుణ, రఘు ఓసీ సామాజికవర్గాలకు చెందిన వాళ్ళు.

ఎంపీలసంగతిని పక్కనపెట్టేస్తే ఎంఎల్ఏలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎంఎల్సీ ఎన్. రామచంద్రరావు, మాజీ ఎంఎల్ఏ చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, జీ మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షరేసులో ఉన్నారు. వీళ్ళంతా తమస్ధాయిలో ఢిల్లీలోని పరిచయాలను ఉపయోగించుకుని ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. అధ్యక్షపదవికి ఎందుకింత పోటీ పెరిగిపోతోంది ? ఎందుకంటే రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటిదేమో కేంద్రంలో అధికారంలో ఉండటం. ఇక రెండో కారణం ఏమిటంటే తొందరలోనే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుందనే ప్రచారం. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు 8. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సీట్లు 8. అసెంబ్లీ సీట్లలో బలం పెంచుకున్న బీజేపీ అదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తాచాటింది.

అలాగే 2019లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న పార్టీ 2024 ఎన్నికల్లో రెట్టింపు సంఖ్యలో అంటే ఎనిమిది సీట్లను గెలుచుకున్నది. ఏ రకంగా చూసినా బీజేపీ బలం పెరుగుతోందనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దెబ్బతినేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా కుదేలైపోయింది. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోకపోవటంతో కేసీయార్ నాయకత్వంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కారుపార్టీ బాగా దెబ్బతినేస్తుండటంతో ఆ స్ధానాన్ని భర్తీచేయాలని బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐదేళ్ళు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయం అనే ఊపు కమలంపార్టీ నేతల్లో పెరిగిపోతోంది.

పార్టీని బలోపేతం చేయటంలో భాగంగానే ముందు కిందస్ధాయి క్యాడర్ పై గురిపెట్టింది. బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో అత్యధికులు కాంగ్రెస్ లో చేరటానికే ఆసక్తి చూపుతున్నారు. కారుపార్టీ తరపున గెలిచిన 38 మందిలో ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఎంఎల్ఏలు ఎలాగూ తమ పార్టీలో చేరరని అనుకున్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ కిందస్ధాయి నేతలను చేర్చుకోవటంపైన ఎక్కువగా దృష్టిపెట్టింది. మున్సిపాలిటీ స్ధాయిలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధాయి సెకండ్ గ్రేడ్ నేతలను చేర్చుకుంటున్నది. ద్వితీయశ్రేణి నేతలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుకు పనిచేస్తారని బీజేపీ నాయకత్వం నమ్ముతోంది. ఇలాంటి కారణాల వల్లే తెలంగాణా అధ్యక్షపదవికోసం పార్టీలో విపరీతమైన పోటీ పెరిగిపోతోంది.

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ రామచంద్రరావు మాట్లాడుతు ‘అధ్యక్షపదవి కోసం నేతలు పోటీ పగడటంలేద’న్నారు. ‘పదవి కోసం నేతలు పోటీపడటంలేదని బాధ్యతలు తీసుకోవటానికి మాత్రమే పోటీ చూపుతున్న’ట్లు సీనియర్ నేత చెప్పారు. ‘రాజకీయాల్లో పదవుల కోసం పోటీ పడటం చాలా సహజమ’న్నారు. జాతీయ నాయకత్వం కొందరు నేతలకు ఎంపీ టికెట్లు, మరికొందరికి ఎంఎల్ఏ టికెట్లు, మరికొందరికి ఇతరత్రా పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

Read More
Next Story