నెహ్రూ సిద్ధాంతాలు మోదీ యుగంలోనే అవసరం!
x

నెహ్రూ సిద్ధాంతాలు మోదీ యుగంలోనే అవసరం!

నెహ్రూ కాలం నాటి లౌకిక విలువలు ఇప్పుడెందుకు క్షీణిస్తున్నాయి? మతతత్వం, ప్రాంతీయతత్వం, ఎన్నికలే పరమావధి అనే పోకడలు ప్రజాస్వామ్య విలువల పతనానికి కారణమా?


అబిద్ షా

ఇండియా తొలి ప్రధాని నెహ్రూ వర్థంతిని మే నెల 27న జరుపుకున్నాం. ఆయన మరణించిన 60 ఏళ్ల తర్వాత కూడా ఆయన వదిలిపెట్టిన బలమైన వారసత్వం ఇంకా బతికే ఉంది. లేదా ముందుకుసాగుతోంది. లేదా కనీసం మిగిలే ఉంది. ఇందుకు నిదర్శనమే నెహ్రూ ప్రస్తుత వారసుడు నరేంద్ర మోదీ గత వారం బీహార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగం. మోదీ తన ప్రసంగంలో నెహ్రూ వంటి కాంగ్రెస్ రాజనీతిజ్ఞుడు చాలా కాలం కిందటే కాలం చేసినా ఆయన కాలంనాటి విధానాలపై మరోసారి దాడి చేసి వాటిని పునరుజ్జీవింపజేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకమని మోదీ ఆరోపించారు. నెహ్రూ మరణించిన దశాబ్దాల తర్వాత కూడా జరిగే ప్రతి దానికీ లేదా తప్పుకి దాదాపు నెహ్రూనే నిందించడం బాగా అలవాటు చేసుకున్న కారణంగానే ప్రధాని మోదీ నోటి నుంచి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయన్పిస్తోంది. ఇందులో భాగంగానే మోదీ 'కుల శాపం' ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు.


అయితే నెహ్రూను విమర్శించే ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నెహ్రూ కాలం నాటి లౌకిక ఆదర్శాలు ఎందుకు అవసరమో, మతపరమైన లేదా ప్రాంతీయ విభేదాలను ఆయన ఎందుకు తెగనాడారో తెలుసుకోవడం అవసరం. నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అదే తోవలో పయనిస్తున్నట్టు కనిపిస్తూనే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడం కొసమెరుపుగా ఉంది.

నెహ్రూ మించిన లౌకికవాది ఎవరున్నారు?

నెహ్రూ మంచి లౌకికవాది. ఆయన అన్ని రకాల కుల,మత, ప్రాంతీయ తత్వాలను, మతవాదాలను ఎల్లప్పుడూ వ్యతిరేకించారు. ఇది కులానికి కూడా వర్తిస్తుంది. అయితే, దేశాన్ని భౌగోళికంగా, మానసికంగా గాయపరిచిన మతపరమైన విభజన ప్రక్రియ ఆయన కాలంలో జరగడం నెహ్రూ ఎదుర్కొన్న ప్రధాన సవాలు.

విభజనతో ఏర్పడిన గాయాలు మానడానికి చాలా కాలం పట్టింది. ప్రధాని హోదాలో నెహ్రూ హుందాగా వ్యవహరించడం వల్ల వేగంగా ఆ గాయం నయమైంది.

ఇప్పుడా గాయలను మళ్లీ రేపడం, వాటిని పదేపదే ప్రస్తావించడమంటే- పరిష్కరించడానికి వీలులేని- సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే అనుకోవాలి. లేదంటే నెహ్రూ ప్రతిష్టను నిర్దాక్షిణ్యంగా మసిపూసి మారేడుకాయ చేయడం లాంటిదని అనుకోవాలి.

వివక్షకు తావు లేని మంత్రం అది...

సమస్యకు ఏదైతే మూలంగా నెహ్రూ భావించారో ఇప్పుడు దాన్నే భారతదేశ వెనుకబాటుకు కారణంగా మోదీ ప్రభుత్వం జనాన్ని నమ్మించాలని చూస్తోంది. నెహ్రూ మనస్ఫూర్తిగా నమ్మిన లౌకికవాదం లేకుండా వివక్షను రూపుమాపడం అసాధ్యం. నెహ్రూ సహజంగానే ఆధునికుడు. ముందుచూపున్న మేధోద్రష్ట. అద్భుత ఊహాశక్తి కలిగిన వ్యక్తి.

1954లో ఆయన ముఖ్యమంత్రులందరికీ రాసిన లేఖలో అది స్పష్టంగా కనిపిస్తుంది - “మనమందరం కోరుకుంటున్నట్టుగా భారతదేశం నిజంగా గొప్పగా ఉండాలంటే, ఇంటా బయటా ఒంటరిగా ఉంటామంటే కుదరదు. భారతీయ ఆత్మ, మనస్సు, సామాజిక జీవనాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ప్రతి దాన్ని మనం వదులుకోవాలి.

కానీ నేడు ఏమి జరుగుతోంది? సంకుచిత మనస్తత్వం, వేర్పాటు వాదాలు, పరిమితమైన లేదా ఎంపిక చేసుకున్న సామాజిక జీవన శైలి వాదాలతో దేశం భ్రష్టుపడుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అధిక ఆర్థికాభివృద్ధి పేరిట లేనిపోని వాదాలను సమర్థిస్తున్నారు. ఈవేళ దేశంలో ఏమూలకు పోయినా వినిపించే ఒక పదం 'సంపద సృష్టికర్తలు'. దీని అభిరుచి ఏమిటో, ఆ వృద్ధి ఏమిటో, ఎవరి శ్రేయస్సు కొరకో చెప్పకుండానే వీటిని చాలా ఘనమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఇదో ప్రమాదకర ధోరణి. ఈ ప్రమాదకర వాతావరణం పట్ల సంపద సృష్టికర్తల బాధ్యత ఏమిటో ఎక్కడా ఎటువంటి చర్చ లేదు.


మహాత్మా గాంధీ సంపన్నులను దేశం ధర్మకర్తలుగా భావించారు. దేశ పురోభివృద్ధికి దేశ ఆస్తులు, వనరులను ఉపయోగించుకోవడంలో వాళ్లు సహాయపడతారు అని చెప్పారు. దీన్ని ప్రేరణగా తీసుకున్న గాంధీ శిష్యుడైన నెహ్రూ సోషలిస్టు అయినప్పటికీ స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చెందడానికి ఊతమిచ్చారు. వ్యాపారాలకు ప్రభుత్వ సాయం అందించడానికి ముందుకువచ్చారు.

కానీ, నేడు నాటి జాతి పునర్ నిర్మాణ నిర్మాతల విశ్వాసానికి భిన్నంగా జరుగుతోంది. ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తాపత్రయపడుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న పాలకులే- కొందరి ప్రయోజనాల కోసం నామమాత్రపు పోటీ ఉండేలా మార్కెట్లను సృష్టిస్తున్నారు. ఉత్పత్తిదారులకు, అమ్మకం దార్లకు మార్కెట్లను పంచిపెడుతున్నారు. వాళ్ల సంపద పెరిగేందుకు ప్రస్తుత 'ప్రజాస్వామ్య ప్రభుత్వాలు' సాయపడుతున్నాయి.

దీని వెనకున్న గుట్టేమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంపద కొందరి వద్దే పోగుపడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సంపన్నులు లేదా సంపదను నియంత్రించే వారు లేదా ప్రభుత్వాలకు దగ్గరగా ఉండే వారి నెట్‌వర్క్‌లకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అసంఖ్యాకంగా ఉన్న ఇతరులకు ప్రయోజనం కలగకుండా పరిమితం చేయడానికి ఈ తీరు పనికివస్తుంది.

నెహ్రూ ఎన్నికల ప్రచారానికి నేటికి ఎంతో తేడా..

ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మ‌రో వారం రోజుల్లో ఫ‌లితాలు రానున్నాయి. నెహ్రూ ఉన్నప్పుడు మూడు సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేశారు. నెహ్రూ ఏ విలువల కోసం నిలబడి ప్రచారం చేశారో దానికి పూర్తి విరుద్ధమైన ప్రచారం నేటి మన ఎన్నికల సీజన్ లో చూస్తున్నాం.

నెహ్రూ ఎన్నడూ తన ఎన్నికల ప్రచారంలో ఇప్పటి మాదిరి తన ప్రత్యర్థులపై దాడి చేయలేదు. హింసకు తావివ్వలేదు. దీనికో మంచి ఉదాహరణ చెప్పవచ్చు. ఒకసారి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ ప్రత్యర్థి రామ్ మనోహర్ లోహియా ఆయన (నెహ్రూ)పై పోటీ చేయాలనుకుంటున్నానంటూ లేఖ రాస్తే... నెహ్రూ తన సమాధానంలో లోహియాకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల పట్ల నిబద్ధత...

నెహ్రూ ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచేవారు. అయినా ఆయన ఎన్నడూ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన దాఖలాలు లేవు. అన్ని నియోజకవర్గాల మాదిరే తన నియోజకవర్గం కూడా అనే వారు తప్ప ఎన్నడూ ప్రత్యేకతను ఆశించలేదు. తనను ఏదో ఒక నియోజకవర్గానికే పరిమితం చేస్తూ ప్రజలు ఎన్నుకోలేదని, దేశంలోని అన్ని నియోజకవర్గాలను చూసుకునే అవకాశం కల్పించారని నెహ్రూ చెప్పేవారు.

నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ తన తండ్రి నియోజకవర్గంలో ఓటర్ల సమస్యలను తెలుసుకునేందుకు, సన్నిహిత సంబంధాల కోసం కొన్నిసార్లు నియోజకవర్గాన్ని సందర్శించేవారు. నియోజకవర్గ సందర్శన తరువాత ఓటర్ల అభిప్రాయాలేమిటో తన తండ్రికి చెప్పేందుకు ఆమె ఈ పని చేసేవారు.

నెహ్రూ, ఫిరోజ్ గాంధీల తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేస్తున్న ఇందిరా, సంజయ్, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలందరూ జంట లోక్‌సభ స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీలను ఇప్పటికీ శ్రద్ధగా చూసుకుంటున్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ప్రాంతీయ‘వైరం’..

ఇప్పుడు సొంత నియోజకవర్గాలపై ఉన్న ప్రేమ వాళ్లు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల దాకా పాకింది. అభిప్రాయ భేదాలకు మించిన గొడవల కారణంగా అధికార బీజేపీ- తన సైద్ధాంతిక మూలాధారమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కి దూరం కావడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఆర్ఎస్ఎస్ శాఖ- లక్షలాది డాలర్ల ప్రాజెక్టులు మహారాష్ట్రలోని ముంబై, పూణె నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్ లకు తరలిపోవడాన్ని వ్యతిరేకిస్తోంది. ఆర్ఎస్ఎస్ లో ప్రస్తుతం ఇదో వివాదాస్పద అంశంగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కి చెందిన వారి చేతిలో అధికారం, పలుకుబడి ఉండడంతో కొత్త గుజరాతీ ప్రచారక్‌లు మరాఠీ ఆర్ఎస్ఎస్ అనుభవజ్ఞులను పక్కనబెడుతున్నారన్న భావనా ఉంది.

ప్రాంతీయత, సెక్టేరియన్ ధోరణులతో నెహ్రూ విలువలకు ముప్పు...

నెహ్రూ ఎల్లప్పుడూ విశాల దృక్పథంతోనే వ్యవహరించేవారు. తన దేశం పట్ల దృఢంగా నిలబడేవారు. మతతత్వాన్ని, సెక్టేరియన్ ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రాంతీయ విభేదాలు, వైషమ్యాలను తోసిపుచ్చేవారు. 60 ఏళ్ల కిందట నెహ్రూ మరణించినప్పటి కంటే దేశం భౌతికంగా చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ వాటి (మతతత్వం, ప్రాంతీయ తత్వం) పర్యవసానాలు 'సద్బుద్ధిగల' భారతీయులను ఇంకా చుట్టుముట్టే ఉన్నాయి.

ప్రఖ్యాత చరిత్రకారుడు బిపన్ చంద్ర- నెహ్రూ కలలుగన్న ఆధునిక భారతదేశం గురించి ఏమన్నారంటే.. “నెహ్రూ తన జీవితమంతా పిడివాద మనస్తత్వాన్ని వ్యతిరేకించారు. ఈ ధోరణే సమస్యలపై శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లేందుకు ఉపయోగపడింది. శాస్త్రీయ దృక్పథాన్ని ఇష్టపడటానికి ప్రధాన కారణం అయింది.

1951లో నెహ్రూ స్వయంగా ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో “మన ప్రజాస్వామ్యం ఓ లేత మొక్క. విజ్ఞానం, దూరదృష్టి, శ్రద్ధతో దాన్ని పోషించాలి.

నెహ్రూ రాసిన ఈ అర్థవంతమైన పదాలు 73 ఏళ్ల తర్వాత కూడా విలువైనవిగానే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంతగా రక్షించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. వివేకం లేని నేటి నాయకుల చిన్న బుద్ధుల్ని, వాళ్ల మాటల్ని వింటుంటే నెహ్రూ మేధోతనాన్నీ మసకబార్చాలని చూడడం దుస్సాహసమే.



Read More
Next Story